మీ అమ్మకు సీరియ్‌సగా ఉంది

ABN , First Publish Date - 2022-04-24T18:07:54+05:30 IST

శస్త్ర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించిన ‘మీ అమ్మగారికి సీరియ్‌సగా ఉంది.. అత్యవసరంగా రూ.12,500 కట్టాలి’

మీ అమ్మకు సీరియ్‌సగా ఉంది

అత్యవసరంగా డబ్బులు చెల్లించాలంటూ బురిడీ

పేయాప్‌ ద్వారా డబ్బు బదిలీ.. ఆగంతుకుల కొత్త ఎత్తుగడ

హైదరాబాద్/పంజాగుట్ట: శస్త్ర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించిన ‘మీ అమ్మగారికి సీరియ్‌సగా ఉంది.. అత్యవసరంగా రూ.12,500 కట్టాలి’ అని ఓ ఆగంతుకుడు చేసిన ఫోన్‌కాల్‌ను నిజమేనని నమ్మిన ఓ వైద్య విద్యను అభ్యసిస్తున్న యువతి పేయాప్‌ ద్వారా డబ్బులు చెల్లించింది. తర్వాత అసలు విషయం తెలుసుకుని మోసపోయానని గ్రహించి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉస్మానియా వైద్య కళాశాలలో సరిత వైద్య విద్యను అభ్యసిస్తోంది. ఆమె తల్లి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆమెను సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 22న శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. అయితే, ఈనెల 21న గుర్తు తెలియని ఆగంతుకుడు సరితకు ఫోన్‌ చేసి ఐసీయూలో ఉన్న ‘మీ అమ్మగారి పరిస్థితి సీరియ్‌సగా ఉంది.. అత్యవసరంగా రూ.12,500 పంపించాలి’ అని చెప్పాడు. తల్లి పేరు, ఆమె చికిత్స పొందుతున్న ఐసీయూ వార్డ్‌, వైద్యుడి పేరు, తదితర వివరాలు చెప్పడంతో ఆమె నిజమేననుకొని అతను చెప్పిన విధంగా డబ్బులు చెల్లించింది. తర్వాత మోసపోయానని గ్రహించింది. తనతోపాటు ఐసీయూలో చికిత్స పొందుతున్న మరికొందరు రోగుల సహాయకులకు కూడా ఇదేవిధంగా ఫోన్‌ చేసి డబ్బు వసూలు చేసినట్లు తెలుసుకుంది. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఫోన్‌ కాల్‌ వివరాలు, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆస్పత్రిలో ఎవరైనా సహకరించి, రోగులు, వారి సహాయకుల వివరాలు చెప్పారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-04-24T18:07:54+05:30 IST