అమ్మకానికి పాంగోలిన్‌

ABN , First Publish Date - 2022-12-20T00:45:25+05:30 IST

వన్యప్రాణుల్లో అత్యంత వేగంగా అంతరించిపోతున్న అరుదైన జంతువు పాంగోలిన్‌(అలుగు)ను కొంతమంది కేటుగాళ్లు వేటాడి పట్టుకున్నారు.

అమ్మకానికి పాంగోలిన్‌

వాట్సా్‌పలో ఫొటోలు.. రూ.కోటికి బేరం

చైనా సహా.. విదేశాల్లో అధిక డిమాండ్‌

కేటుగాళ్ల ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 19(ఆంధ్రజ్యోతి): వన్యప్రాణుల్లో అత్యంత వేగంగా అంతరించిపోతున్న అరుదైన జంతువు పాంగోలిన్‌(అలుగు)ను కొంతమంది కేటుగాళ్లు వేటాడి పట్టుకున్నారు. రూ. కోటి విలువైన జంతువని వాట్సా్‌పలో ఫొటోలు పెట్టి అమ్మకానికి యత్నిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ప్రాణాలతో ఉన్న పాంగోలిన్‌(అలుగు)ను, కారు, ఆరు మొబైల్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పాంగోలిన్‌ జంతువుకు చైనా దేశంతో సహా అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. వీటిని బుల్లెట్‌ ప్రూఫ్స్‌ జాకెట్స్‌, ఔషధాలు, వ్యాలెట్స్‌ తయారీలో వినియోగిస్తారని తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని, దాన్ని పట్టుకొని అమ్మితే లైఫ్‌ సెటిల్‌ అయిపోవచ్చని కొందరు భావించారు. దాంతో మెదక్‌ జిల్లాకు చెందిన ఎస్లావత్‌ రూప్‌సింగ్‌, ములావత్‌ శ్రీను, కరీంనగర్‌కు చెందిన నూనావత్‌ మురళి, నీరటి సంపత్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన రమావత్‌ రమే్‌షలు ముఠాగా ఏర్పడ్డారు. ఎస్లావత్‌ రూప్‌సింగ్‌ మెదక్‌ జిల్లా అల్లీపూర్‌ అటవీ ప్రాంతంలో పాంగోలిన్‌ను వేటాడి పట్టుకున్నాడు. ఆ తర్వాత ముఠా సభ్యుల సహకారంతో దాని ఫొటోలు, వీడియోను వాట్సాప్‌ గ్రూపులో షేర్‌ చేసి అమ్మకానికి ఉంచారు. పహాడీషరీఫ్‌ ప్రాంతంలో దాన్ని అమ్మకానికి ఉంచినట్లు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దాంతో ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ బృందం, పహాడీషరీఫ్‌ పోలీసులు, ఫారెస్టు అధికారులతో కలిసి సంయుక్తంగా దాడిచేసి ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి పాంగోలిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో శంషాబాద్‌ అటవీ డివిజనల్‌ అధికారి విజయానందరావు, ఎఫ్‌ఆర్‌వో విక్రమ్‌ చంద్ర మంకల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-20T00:45:27+05:30 IST