పిలుపు లేకపోయినా ఫంక్షన్లకు అతిథిగా వెళ్తాడు.. ఆభరణాలను కొట్టేస్తాడు..!

ABN , First Publish Date - 2022-02-19T14:04:08+05:30 IST

పిలుపు లేకపోయినా ఫంక్షన్లకు అతిథిగా హాజరవుతాడు. మంచిగా తయారై..

పిలుపు లేకపోయినా ఫంక్షన్లకు అతిథిగా వెళ్తాడు.. ఆభరణాలను కొట్టేస్తాడు..!

  • నిందితుడి అరెస్ట్‌ 


హైదరాబాద్ సిటీ/కొత్తపేట : పిలుపు లేకపోయినా ఫంక్షన్లకు అతిథిగా హాజరవుతాడు. మంచిగా తయారై బుద్ధిమంతుడిలా వ్యవహరిస్తాడు. అదును చూసి దుస్తులు మార్చుకునే గదిలోకి చొరబడి బంగారు ఆభరణాలను తస్కరించి జారుకుంటాడు. నిందితుడిని సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్టుచేసి అతడి నుంచి 17 తులాల ఆభరణాలు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ ఏనుగొండ గొల్లగేరికి చెందిన జాజల లక్ష్మీనర్సింహస్వామి అలియాస్‌ రవితేజ అలియాస్‌ లడ్డు(27) మన్సూరాబాద్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ కాలనీలో ఉంటూ ఎక్స్‌కవేటర్‌ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో 2018 నుంచీ చోరీల బాట పట్టాడు. ఎవరూ అనుమానించకుండా నీటుగా తయారై ఫంక్షన్‌ హాళ్లలో జరిగే వేడుకలకు హాజరై విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు చోరీ చేయడం మొదలు పెట్టాడు. అతడిపై ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదయ్యాయి. పలుమార్లు జైలుకెళ్లినా మారలేదు.


సరూర్‌నగర్‌ కేసుతో..

ఈ నెల 9న సరూర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో చంపాపేట, ఏపీఆర్‌ గార్డెన్స్‌లో జరిగిన పెళ్లి వేడుకలో అతడు మూడు తులాల బంగారు నెక్లెస్‌ చోరీ చేశాడు. బాధితురాలి భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా లడ్డూపై నిఘా పెట్టారు. కర్మన్‌ఘాట్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌ వద్ద శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాలు అంగీకరించడంతో 17 తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఫంక్షన్‌ హాళ్లలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. సమావేశంలో ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Read more