Nursery, LKG, UKG కి గుడ్ బై.. ఇక నేరుగా ఒకటో తరగతికి..!
ABN , First Publish Date - 2022-02-22T13:31:38+05:30 IST
వాస్తవానికి నాలుగేళ్లు నిండిన పిల్లలను తొలుత నర్సరీలో చేర్పిస్తుంటారు. తర్వాత ఎల్‌కేజీ, యూకేజీ అనంతరం ఫస్ట్ క్లాస్‌కు పంపిస్తుంటారు...
- కరోనాతో రెండేళ్లు వృథా
- వయసు రీత్యా ఎల్‌కేజీ, యూకేజీకి..
- గుడ్ బై చెబుతున్న తల్లిదండ్రులు
- పిల్లల మానసికస్థితిపై ప్రభావం..
- పడుతుందంటున్న నిపుణులు
మియాపూర్‌కు చెందిన దేవి, గణేష్ దంపతులు తమ బాబుకు నాలుగేళ్లు వస్తున్నాయనగా పాఠశాలలో చేర్పిద్దామనుకున్నారు. ఇంతలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూతపడతాయోనన్న డైలమాలో చేరిక రెండేళ్లు వాయిదా పడింది. ఇప్పుడా బాబుకు ఆరేళ్లు రావడంతో నేరుగా ఒకటో తరగతిలో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ సిటీ : వాస్తవానికి నాలుగేళ్లు నిండిన పిల్లలను తొలుత నర్సరీలో చేర్పిస్తుంటారు. తర్వాత ఎల్‌కేజీ, యూకేజీ అనంతరం ఫస్ట్ క్లాస్‌కు పంపిస్తుంటారు. కరోనా కారణంగా రెండేళ్లు విద్యా వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నేరుగా మొదటి తరగతిలో చేర్పిస్తున్నారు. దీంతో చాలామంది పిల్లలకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదివే అవకాశం ఉండడం లేదు. కార్పొరేట్, టెక్నో స్కూళ్లు పిల్లలకు నర్సరీ నుంచి క్లాసులు చెబుతూ వారిని క్రమక్రమంగా తీర్చిదిద్దుతుంటాయి. తద్వారా ఉన్నత తరగతులకు వెళ్లిన తర్వాత పిల్లల్లో బోధనా సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే కరోనా తెచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడంలో భాగంగా పిల్లల్లో సామర్థ్యాలు పరిశీలించకుండానే కొన్ని విద్యాసంస్థలు సీట్లను భర్తీ చేస్తున్నాయి.
సీట్లు ఫుల్..
గతానికంటే ఫీజులు పెంచినా తల్లిదండ్రులు సీట్లను పొందేందుకు పోటీ పడుతున్నారు. ఉదాహరణకు అత్తాపూర్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో 2021-22 అకాడమిక్ ఇయర్‌లో ఫస్ట్ క్లాస్ ఫీజు రూ.45వేలు ఉంది. అయితే ముందస్తు అడ్మిషన్ పేరిట ఇటీవల రూ.65 వేలు తీసుకుంది. బస్సు ఫీజు అదనంగా రూ.20వేలు తీసుకుంటామని తల్లిదండ్రులకు తెలిపారు. అయినప్పటికీ ఆ స్కూల్‌లో సీట్లు ఫుల్ అయ్యాయి. ఎప్పుడూ లేనిది ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటో తరగతి అడ్మిషన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2022-23 నూతన విద్యా సంవత్సర అడ్మిషన్లకు మరో నాలుగు నెలల గడువున్నప్పటికీ పేరున్న కార్పొరేట్, టెక్నో స్కూళ్లు గేట్లు మూసివేశాయి. డిమాండ్‌ను బట్టి ముందుగానే అడ్మిషన్లను పూర్తి చేసుకున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో పిల్లలకు సీట్లు దొరకని కొందరు తల్లిదండ్రులు బడ్జెట్ స్కూళ్ల వైపు దృష్టి సారిస్తున్నారు.

నిపుణులు ఏం చెబుతున్నారంటే..
అడ్మిషన్లపై దృష్టిసారించి పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు బిడ్డల మానసిక స్థితిని పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో నర్సరీ నుంచి చదువు మొదలైతే.. పిల్లలు ఆటపాటలతో సులువుగా ముందుకుసాగుతారని, నేరుగా ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ చేస్తే బోధనపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమగ్రమైన విద్యతోనే పిల్లల్లో పఠనాసక్తి పెరుగుతుందని, ప్రైవేట్ మాయలో పడి పిల్లలను మానసిక ఇబ్బందులకు గురిచేయొద్దని సూచిస్తున్నారు.
