‘నిమ్స్‌’కు వెళ్తే నిరీక్షణే..!

ABN , First Publish Date - 2022-10-07T06:10:47+05:30 IST

నిమ్స్‌ అంటే మెరుగైన వైద్యం, తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చునని ఎందరో పేద, మధ్య సామాన్య వర్గాలలో నెలకొన్న అభిప్రాయం.

‘నిమ్స్‌’కు వెళ్తే నిరీక్షణే..!

సేవలు బహు ఆలస్యం

వైద్య చికిత్సకు పడిగాపులు

పది అయితే కానీ తెరుచుకోని ఓపీ

పేరు నమోదుకు గంటల తరబడి నిరీక్షణ

చికిత్సా విభాగం వద్దా అంతే..

అధికారుల పర్యవేక్షణ కరువు

అప్పట్లో ఇక్కడే చికిత్సలు పొందిన ముఖ్యమంత్రులు

ఇప్పుడు తగ్గిన ప్రజాప్రతినిధుల రాక

నిమ్స్‌ అంటే మెరుగైన వైద్యం, తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చునని ఎందరో పేద, మధ్య సామాన్య వర్గాలలో నెలకొన్న అభిప్రాయం. ఇక్కడ క్లిష్టమైన వైద్యం చేసే వైద్య నిపుణులున్నారనే విశ్వాసం. కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లలేని ఎందరో నిమ్స్‌ ఆస్పత్రికి వచ్చి చికిత్సలు చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ ఆస్పత్రులకు ‘ఆరోగ్యశ్రీ’ చెల్లింపులు చేయకపోవడం వల్ల ‘నిమ్స్‌’లో ఒక చోట మాత్రమే పేదలకు మెరుగైన వైద్యం అందుతోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు, పాత్రికేయులకు కూడా ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ కింద నిమ్స్‌ ఆస్పత్రే శరణ్యం. క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసి రోగికి పునర్జన్మ ప్రసాదించే ఎందరో నిష్ణాతులైన వైద్యులున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల నిమ్స్‌ ప్రతిష్ట మంటగలుస్తోంది. నిజాం ట్రస్టు సహకారంతో ఏర్పడిన నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ (నిమ్స్‌) ప్రతిష్ట బజారుకెక్కుతోంది. ఆస్పత్రి వైఫల్యాలపై వరుస కథనాలు నేటి నుంచి..

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 6 (ఆంధ్రజ్యోతి) : దశాబ్దాల చరిత్ర కలిగిన నిమ్స్‌ ఎనిమిదేళ్లుగా దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ నిర్వహణ లోపాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. నిధుల దుర్వినియోగం, బిల్లింగ్‌, క్రెడిట్‌, రీసెర్చ్‌లో అవినీతి జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, అప్పట్లో పెద్దగా ఫిర్యాదులు వచ్చేవి కావు. కానీ, ఇటీవలి కాలంలో నిమ్స్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

అప్పట్లో సీఎంలూ, కేసీఆరూ..

వైఎస్‌ రాజశేఖర్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆయన వైద్య పరీక్షలకు ఎప్పుడూ నిమ్స్‌కే వచ్చేవారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కూడా ఇక్కడే బైపాస్‌ సర్జరీ చేయించుకున్నారు. 2009లో రాష్ట్రం కోసం నిరాహారదీక్ష చేసిన కేసీఆర్‌ కూడా నిమ్స్‌లోనే వైద్య సేవలు అందుకున్నారు. 2014 తర్వాత వైద్య సేవల కోసం ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇక్కడకు రావడం తగ్గింది. తెలంగాణ రాక మునుపే ఇక్కడ స్పెషాలిటీ బ్లాక్‌, ట్రామా కేర్‌ సెంటర్లను నిర్మించారు. దీంతో బెడ్‌ కెపాసిటీ 800 నుంచి 1500కు పెరిగింది. నిమ్స్‌ మరింత విస్తరణ కోసం అత్యవసరంగా ఎర్రమంజిల్‌ కాలనీలోని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులను ఖాళీ చేయించారు. ఆ 20 ఎకరాలను డాక్టర్‌ ప్రసాద్‌ రావు డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే సంస్థ స్వాధీనం చేసుకుంది. తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. మంత్రి హరీశ్‌రావు ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ రెండు వేల పడకలతో కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థల పరిశీలన, బదలాయింపు పూర్తి అయింది. భవన నిర్మాణాలు జరగాల్సి ఉంది. 

నరకమే..

నిమ్స్‌లో వైద్యం పొందాలంటే నరకమే అన్నట్లుగా పరిస్థితి మారింది. గంటల తరబడి లైన్లో నిలబడినా, ఒక్కోసారి ఓపీ దొరకడం కష్టమే. ఇక వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నా, నివేదికలు పొందాలన్నా రోజులు, వారాలు తిరగాల్సిందే. శస్త్రచికిత్సలు అవసరమైన వారూ నిరీక్షించాల్సిందే. ఓపీలో గతంలో ఉదయం 8 గంటలకు కనిపించే సీనియర్‌ వైద్యులు ఇప్పుడు ఉదయం 10 తర్వాతే కనిపిస్తున్నారు. జూనియర్‌ వైద్యులే రోగులను పరీక్షిస్తున్నారు. వీఐపీలు మాత్రమే ఇక్కడ త్వరితగతిన వైద్యం పొందగలుగుతున్నారు. డైరెక్టర్‌ రౌండ్స్‌ వేయడం మానేయడంతో కొన్ని విభాగాల నర్సింగ్‌ కేర్‌ కుంటుపడింది. పక్కనే కొత్తగా వెలిసిన కార్పొరేట్‌ ఆస్పత్రి, డయాగ్నోస్టిక్‌కు చెందిన బోర్డులు నిమ్స్‌ గోడలకు తగిలించినా అడిగే వారు లేరు.

వైద్యాధికారే ఇతర ఆస్పత్రికి..

తెలంగాణ ఏర్పడిన తర్వాత సంచాలకుడిగా బాధ్యతలు చేపట్టిన వైద్యాధికారి నిర్లక్ష్యమే నిమ్స్‌ దయనీయ పరిస్థితికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు అధిక విభాగాల సేవల పనితీరు మందకొడిగా తయారైంది. ఇక్కడి పరిస్థితిని గమనించే అత్యవసర పరిస్థితిలో ఆయనే చికిత్స కోసం మరో కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాకర్ల సుబ్బరావు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఆయన ఉదయమే 8 గంటలకు ఆస్పత్రికి వచ్చి రౌండ్స్‌కు వెళ్లే వారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, లోపాలు, ఫిర్యాదులపై సమీక్షించేవారు. దీంతో వైద్యులు, ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉండే వారు. ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్లు కూడా అదే ఆనవాయితీ కొనసాగించారు. ఔట్‌ పేషంట్ల క్లినిక్‌ కూడా ఉదయం 8 గంటలకే తెరుచుకునేది. డాక్టర్‌ మనోహర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆస్పత్రి పనితీరు మందగించిందనే అపవాదు మూటగట్టుకున్నారు. ఆయన ఉదయం 11 గంటలకు రావడం, మధ్యాహ్నం 3కే వెళ్లిపోవడం, వరుస సెలవులు, మూడు నాలుగు రోజులు వరంగల్‌లోనే ఉండడం వంటివి సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతున్నాయనే చర్చ నడుస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇతర ఉన్నతాధికారులు కూడా అలాగే వ్యవహరించడం మొదలు పెట్టారు. మరో వైపు ఫ్యాకల్టీలో రాజకీయాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది సిన్సియర్‌ వైద్యులు ఇక్కడ ఉండలేక కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు.

అదే ఒరవడి కొనసాగితే..

నిమ్స్‌లో మొదట్లో లభించిన వైద్య సేవలు, అంకితభావం, డైరెక్టర్ల పర్యవేక్షణ కొనసాగి ఉంటే, ఎయిమ్స్‌ స్థాయికి ఎదిగేదని నిపుణులు భావిస్తున్నారు. బీబీనగర్‌ క్యాంప్‌సలో నిమ్స్‌ మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. తర్వాత దానిని ఎయిమ్స్‌కు అప్పగించారు. దీంతో నిమ్స్‌ బాగా నష్టపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

గవర్నింగ్‌ బాడీ సమావేశం ఏది?

నిమ్స్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక సారి కూడా గవర్నింగ్‌ బాడీ సమావేశం జరగలేదు. చివరి సమావేశం దాదాపు పదేళ్ల క్రితం జరిగినట్లు సమాచారం. మొక్కలు నాటడం, ఇతర కార్యక్రమాలకు తప్పా ముఖ్యమంత్రి అధికారికంగా నిమ్స్‌ను తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. నిమ్స్‌లో కాన్వకేషన్‌ జరిగి దాదాపు పదేళ్లయింది. మునుపు ఆరోగ్య మంత్రులుగా పనిచేసిన లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్‌లకు కూడా నిమ్స్‌ నిర్వహణ తీరుపై అసంతప్తి ఉండేది. ప్రస్తుత మంత్రి హరీశ్‌రావు కూడా డైరెక్టర్‌ పని తీరు మీద, సంస్థలోని ఉన్నతోద్యోగుల మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు వైద్య శాఖ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో డైరెక్టర్‌ అస్వస్థతతో మరో ఆస్పత్రిలో చేరడంతో నెల రోజులుగా సెలవులో ఉన్నారు. మరొకరికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆరోగ్యం కుదట పడడంతో నాలుగు రోజుల క్రితం తిరిగి బాధ్యతలు చేపట్టారు. 

Read more