నిమ్స్‌లో మరో అధునాతన భవనం
ABN , First Publish Date - 2022-08-04T05:46:53+05:30 IST
నిమ్స్‌లో మరో అధునాతన భవనం రూపుదిద్దుకోబోతుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి
ఎర్రమంజిల్ క్వార్టర్స్ ఖాళీ స్థలంలో నిర్మాణం
2 వేల పడకలతో కొత్త ఆస్పత్రి.. 200 పడకలతో ఐసీయూ
కొత్తగా మాతాశిశు సంరక్షణ విభాగం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో మరో అధునాతన భవనం రూపుదిద్దుకోబోతుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎర్రమంజిల్ క్వార్టర్స్ స్థలం నిమ్స్‌కు అప్పగించడంతో ఆస్పత్రి భవనానికి గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది. 32.16 ఎకరాల ఖాళీ స్థలాన్ని నిమ్స్‌కు బదలాయిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో నిమ్స్‌కు మరో కొత్త భవనం నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండువేల పడకలతో కొత్త భవనం నిర్మించాలని యోచిస్తున్నారు. అలాగే మాతా శిశు సంరక్షణ కేంద్రం భవనం, ఓపీ భవనం నిర్మించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం నిమ్స్‌లో రెండు వేల పడకల వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి ఎప్పుడూ రోగులతో కిటకిటలాడుతుంటాయి. ఐసీయూలోనూ పడకల కోసం చాలా మంది రోగులు ఇక్కడ నిరీక్షిస్తూనే ఉంటారు. ఇప్పటికే 400 వరకు ఐసీయూలో పడకలు ఏర్పాటు చేసినప్పటికీ అవసరం ఇంకా ఎక్కువగానే ఉంది. దీంతో కొత్త భవనంలో అదనంగా మరో రెండు వేల పడకలతో ఆస్పత్రిని నిర్మించనున్నారు. అలాగే మరో 200 పడకలతో అత్యవసర ఐసీయూను ఏర్పాటు చేయనున్నారు. దీంతో నిమ్స్‌లో పడకల సంఖ్య నాలుగు వేలకు చేరనుంది. ఆస్పత్రిలో మాతా, శిశు సేవల విభాగం నెలకొల్పబోతున్నారు. ఇంత వరకు గైనిక్, పిల్లల సేవలు నిమ్స్‌లో అందుబాటులో లేవు. దీంతో ఇక్కడ మొదటిసారి ఈ సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం కొత్త భవనంలో 50 పడకలను మాతాశిశు సంరక్షణ సేవల కోసం కేటాయించనున్నారు.
ఓపీ వైద్యం ఒకే చోట
ప్రస్తుతం నిమ్స్ ఓపీ రోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఓపీ చికిత్స కోసం తెల్లవారు జామునే రోగులు టోకెన్ కోసం వచ్చి క్యూలో నిల్చుంటారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 31 విభాగాలు ఉన్నాయి. అయితే అన్ని ఓపీలు ఒకే చోట లేవు. కొన్ని మిలియన్ బ్లాక్, మరికొన్ని పాతభవనంలో ఓపీ కౌంటర్లు ఉన్నాయి. దీంతో రోగులు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అటూ ఇటూ పరుగులు తీసేసరికి ఓపీ సమయం మించిపోతోంది. మరుసటి రోజు వరకు ఎదురుచూడాల్సి వస్తోంది. ఓపీ కౌంటర్లు, వైద్య విభాగాలను కొత్త భవనంలో ఒకే చోట ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అన్ని వ్యాధులకు ఒకే చోట చికిత్స లభించనున్నది.