HYD : రేటు కట్టి.. ఎంపిక చేసి.. లక్షలు చేతులు మారిన వైనం.. ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయ్..!

ABN , First Publish Date - 2022-03-05T15:01:20+05:30 IST

రేటు కట్టి.. ఎంపిక చేసి.. లక్షలు చేతులు మారిన వైనం.. ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయ్..!

HYD : రేటు కట్టి.. ఎంపిక చేసి.. లక్షలు చేతులు మారిన వైనం.. ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయ్..!

  • పారిశుధ్య కార్మికుల నియామకంలో అక్రమాలు
  • కీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులు


హైదరాబాద్‌ సిటీ : జీహెచ్‌ఎంసీలో అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికుల నియామకంలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లో కార్మికుల నియామకం జరగగా.. కేంద్ర కార్యాలయంలోనూ గుడ్డిగా ఆమోదముద్ర వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కాని వారినీ విధుల్లో చేర్చుకోవడంతోపాటు కాగితాల్లో మాత్రమే ఉన్న కొందరు కార్మికుల స్థానంలో టారిఫ్‌ నిర్ణయించి మరీ ఇతరులను నియమించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీలోని మెజార్టీ సర్కిళ్లలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని ప్రచారం జరుగుతోంది. కార్మికుల నియామకంలో కీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులు ఇప్పటికే మాతృశాఖలకు వెళ్లగా.. ఇంకొందరు సుదీర్ఘ సెలవులో ఉన్నట్టు సమాచారం.


మరికొందరు బదిలీపై వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. చార్మినార్‌ జోన్‌ పరిధిలో కార్మికుల నియామకం వివాద స్పదంగా మారింది. కార్మికుల నియామక జాబితాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రికార్డుల్లో కుటుంబ సభ్యులని చూపిన కొందరికి.. అసలు కార్మికులతో సంబంధం లేకపోవడం గమనార్హం. సర్కిల్‌-10 పరిధిలో 35 మందికిపైగా కార్మికులను మార్చారు. ఇదే జోన్‌ పరిధిలో దాదాపు వందల సంఖ్యలో కార్మికుల నియామకం జరిగింది. ఇతర జోన్లలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది.


ఎలా చేశారు..?

 60 ఏళ్లు పైబడి, అనారోగ్య కారణాలతో విధుల నుంచి వైదొలగాలనుకుంటున్న కార్మికుల కుటుంబ సభ్యులను పిలిచి వారి నిర్ణయం మేరకు ఒకరికి అవకాశం కల్పించాలి. తండ్రి/తల్లి స్థానంలో కొడుకు, కూతురు, కోడలు, అదే కుటుంబానికి చెందిన ఇతర కుటుంబ సభ్యులను నియమించాలి. అయితే ఈ నియామకాలకూ రూ.50వేల నుంచి రూ. లక్ష తీసుకున్నట్టు తెలుస్తోంది. దీర్ఘకాలంగా సెలవులో ఉన్న వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. ఈ తరహా నియామకాలకు రూ.2 లక్షల వరకు తీసుకున్నారని చెబుతున్నారు. దీర్ఘకాలంగా సెలవుల్లో ఉన్న కార్మికుల వేతనాలు కొన్ని సర్కిళ్లలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఏఎంఓహెచ్‌, డీసీ, శానిటరీ సూపర్‌ వైజర్లకు వాటాలుగా వెళ్తాయని చెబుతున్నారు. బయోమెట్రిక్‌ హాజరుతో బోగస్‌ దందాకు చెక్‌ పడడంతో కొత్త వారిని తీసుకున్నారు. ఈ క్రమంలో అంగట్లో సరుకుల్లా కార్మికుల నియామక పోస్టులను అమ్మకానికి పెట్టారు.


బోగస్‌ కార్మికులున్నారని తెలిసినా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో నియామకాల్లో అవినీతి పెచ్చరిల్లింది. కుటుంబ సభ్యులైతే ఒక రేటు, ఇతరులకు అవకాశం కల్పిస్తే మరో ధర నిర్ణయించి.. మొత్తంగా టారిఫ్‌ నిర్ణయించి మరీ కార్మిలకు నియామక ప్రక్రియ చేపట్టడం గమనార్హం. వారసులు లేని, కుటుంబ సభ్యులు స్వీపింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపని వారు, ఇతరులకు తమ పోస్టును అమ్ముకున్నారు. ఇలాంటి నియామకాల విషయంలో అధికారులు భారీగా వసూలు చేశారని ఓ శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తెలిపారు. కార్మికులకు ప్రస్తుతం కటింగ్‌లు పోను రూ.14వేల వేతనం వస్తోంది. దీంతో కార్మికుల పోస్టులకు డిమాండ్‌ పెరిగింది. దీనిని అధికారులు ధనార్జన మార్గంగా వినియోగించుకున్నారు.


మొక్కుబడి కమిటీ..

జీహెచ్‌ఎంసీలో 18 వేలకుపైగా అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులున్నారు. రహదారులను ఊడ్చి చెత్తాచెదారం తొలగిస్తుంటారు. పని తీరు మెరుగుపర్చాలనే ఉద్దేశంతో 60 ఏళ్లు పైబడిన, అనారోగ్యంతో బాధపడుతోన్న, మరణించిన, దీర్ఘకాలంగా విధులకు హాజరు కాని వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. గత పాలకమండలి హయాంలో సర్కారుకు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కార్మికుల నియామక ప్రక్రియ చేపట్టారు. ఇందుకోసం జోనల్‌ కమిషనర్‌ నేతృత్వంలో సీపీ, డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌, ఏఎంఓహెచ్‌లతో కమిటీలు వేశారు. కమిటీ ఆమోదంతో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. మెజార్టీ సర్కిళ్లలో ఏఎంఓహెచ్‌లు, డీసీలు ఇష్టానికి నియామకాలు చేపట్టారని ప్రచారం జరుగుతోంది. మొక్కుబడిగా కమిటీ ఆమోదం పొంది క్షేత్రస్థాయిలో తమకు నచ్చిన వారిని ఎంపిక చేశారని చెబుతున్నారు.

Read more