Naina Jaiswal.. క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌కు వేధింపులు
ABN , First Publish Date - 2022-08-12T20:50:36+05:30 IST
టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌ను ఓ యువకుడు సోషల్ మీడియాలో వేధిస్తున్నాడు.

హైదరాబాద్ (Hyderabad): సోషల్ మీడియా (Social Media) ప్రముఖులకు వేధింపులు తప్పడం లేదు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ (Naina Jaiswal)ను ఓ యువకుడు సోషల్ మీడియాలో వేధిస్తున్నాడు. గత కొంత కాలంగా శ్రీకాంత్ (Srikanth) అనే యువకుడు తనను వేధిస్తున్నాడంటూ నైనా జైశ్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా శ్రీకాంత్ ఇలాగే నైనా జైశ్వాల్‌ను వేధిస్తుండగా.. పోలీసులు అతనికి కౌన్సెలింగ్ (Counseling) ఇచ్చి పంపించారు. అయినా తీరు మార్చుకోని శ్రీకాంత్.. ట్విట్టర్ (Twitter), ఇన్స్టాగ్రామ్ (Instagram)లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టి నైనా జైశ్వాల్‌ను వేధిస్తున్నాడు. దీంతో ఆమె తండ్రి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శ్రీకాంత్ కోసం దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
కాగా హైదరాబాద్‌కు చెందిన నైనా జైస్వాల్..దేశంలో టేబుల్ టెన్నిస్ స్టార్ క్రీడాకారుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. నైనా జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పలు టైటిళ్లను సైతం గెలుచుకుని.. అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తున్నారు.