ముసారాంబాగ్‌ బ్రిడ్జి.. ముందడుగు ఏది..?

ABN , First Publish Date - 2022-11-22T01:48:11+05:30 IST

’పది రోజుల్లో టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం’

ముసారాంబాగ్‌ బ్రిడ్జి.. ముందడుగు ఏది..?

వచ్చే వర్షాకాలంలోపూ అందుబాటులోకి రావడం కష్టమే

డీపీఆర్‌ కూడా సిద్ధం కాని వైనం

సమగ్ర నివేదిక వచ్చే నెలలోనే..?

తరువాతే టెండర్‌ నోటిఫికేషన్‌

ప్రస్తుత బ్రిడ్జి పూర్తిగా తొలగింపు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): ’పది రోజుల్లో టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం’

- భారీ వర్షాలతో ముసారాంబాగ్‌ బ్రిడ్జి పొంగిపొర్లినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ప్రకటన. ఆయన ఈ ప్రకట న చేసి నెలన్నర దాటింది. ఇప్పటి వరకు కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) కూడా సిద్ధం కాలేదు. ఈ క్రమంలో బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశముంది. అంటే వచ్చే వర్షాకాలానికి కూడా బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే దాఖలాలు దాదాపుగా కనిపించడం లేదు. కొన్నేళ్లుగా నగరంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతోంది. చెరువులు, నాలాలు పొంగి పొర్లడమే కాదు.. మూసీ మహోగ్రరూపం దాలుస్తోంది. పక్కనున్న కాలనీలు, బస్తీలను ముంచెత్తడంతోపాటు.. నదిపై పలు ప్రాంతాల్లో ఉన్న బ్రిడ్జిలపై నుంచి నాలుగైదు అడుగుల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు రోజుల తరబడి పూర్తిగా స్తంభిస్తున్నాయి. చాదర్‌ఘాట్‌, ముసారాంబాగ్‌ బ్రిడ్జిల వద్ద ఎక్కువగా సమస్య ఉంది. ఈ యేడాది వర్షాలకు పలుమార్లు ఆ రెండు బ్రిడ్జిలపై నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ముసారాంబాగ్‌ బ్రిడ్జి వద్ద ఇరువైపులా రెయిలింగ్‌తోపాటు, ఫెన్సింగ్‌ కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జి తక్కువ ఎత్తు ఉండడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన అధికారులు.. ఎక్కువ ఎత్తులో కొత్త బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. తద్వారా వరద ప్రవాహం సాఫీగా వెళ్లడంతోపాటు.. రాకపోకలకు అవాంతరాలు ఉండవన్నది వారి యోచన.

డీపీఆర్‌ ఎప్పటికయ్యేనూ..?

మూసీపై 13 చోట్ల బ్రిడ్జిలు, రెండు ప్రాంతాల్లో మిస్సింగ్‌ లింక్‌ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. రూ.545 కోట్లతో ఆయా ప్రాజెక్టులకు జూలై 6న పాలనాపరమైన అనుమతులూలు జారీ చేసింది. ప్రాధాన్యతా క్రమంలో సమస్య ఎక్కువగా ఉన్న ముసారాంబాగ్‌లో మొదట పనులు చేపట్టాలని నిర్ణయించారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని పలుమార్లు మంత్రులు ఆదేశించారు. దాదాపు అర కిలోమీటర్‌ మేర నిర్మించ తలపెట్టిన ముసారాంబాగ్‌ బ్రిడ్జికి రూ.52 కోట్లు ఖర్చవుతాయని సూత్రప్రాయంగా అంచనా వేశారు. డీపీఆర్‌ రూపకల్పన కోసం టెండర్‌ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ.. కోల్‌కతాకు చెందిన ఓ ఏజెన్సీకి గత నెలలో బాధ్యతలు అప్పగించింది. డిసెంబర్‌లో ఏజెన్సీ నివేదిక ఇస్తుందని ఓ అధికారి చెప్పారు. డీపీఆర్‌ను ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం బ్రిడ్జి నిర్మాణ పనుల అప్పగింతకు టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటిస్తారు. ఈ ప్రక్రియంతా జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తయ్యే అవకాశముంది. అనంతరం పనులు ప్రారంభించినా.. పూర్తవడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వర్షాకాలంలోపు బ్రిడ్జి అందుబాటులోకి రావడం దాదాపు అసాధ్యమని అధికారులూ అంగీకరిస్తున్నారు.

ముసారాంబాగ్‌ వద్ద మూసీపై ప్రస్తుతం ఉన్న వంతెనను పూర్తిగా తొలగించి.. కొత్త బ్రిడ్జి నిర్మించనున్నారు. గోల్నాకలో కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై నుంచి వాహనాల మళ్లింపు ఉంటుందని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న వంతెనను యథాతథంగా ఉంచుతూ.. కొత్తది నిర్మించాలంటే ఎక్కువ ఆస్తులు సేకరించాల్సి ఉంటుందని, క్షేత్రస్థాయిలో అది సాధ్యమయ్యే అవకాశం లేనందునే తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఓ అధికారి చెప్పారు.

Updated Date - 2022-11-22T01:48:12+05:30 IST