‘ఎంఎంటీఎస్‌’లో కదలిక !

ABN , First Publish Date - 2022-12-16T01:19:46+05:30 IST

ఎంఎంటీఎస్‌ (మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం) రెండో దశలో కదలిక వచ్చింది.

‘ఎంఎంటీఎస్‌’లో కదలిక !

రెండో దశకు రూ.100కోట్లు చెల్లించిన రాష్ట్రం

పెండింగ్‌లో మరో రూ.481కోట్లు

ముందుకు వెళ్లాలా.. ఆగాలా ?

రైల్వేలో తర్జనభర్జన

సికింద్రాబాద్‌, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఎంఎంటీఎస్‌ (మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం) రెండో దశలో కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.100 కోట్లను రైల్వేశాఖకు కేటాయించింది. దీంతో ఎంఎంటీఎస్‌ రెండోదశ పనులపై ఆశలు రేకెత్తాయి. కొన్నేళ్లుగా నిధులు కేటాయించకుండా తాత్సారం చేస్తూ వచ్చిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ వాటాలో ఇది కొద్ది మొత్తమేనని రైల్వేశాఖ భావిస్తోంది. తాజా పరిణామ నేపథ్యంలో ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లాలా, లేక మిగిలిన నిధులు వచ్చే వరకు నిరీక్షించాలా అనే విషయమై తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది.

2003లో ప్రారంభం..

విశ్వనగరంగా రూపు దిద్దుకుంటున్న హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి, ప్రయాణికుల సౌకర్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో 2003 ఆగస్టులో ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు ప్రారంభమైంది. మొదటి కారిడార్‌లో 40 సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్‌ రైళ్లు ప్రస్తుతం 125 సర్వీసులు నడుస్తున్నాయి. లక్షా 50వేల మంది వరకు అనునిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. మొదటి దశ విజయవంతం కావడంతో రెండో దశకు డిమాండ్‌ పెరిగింది. రెండో దశ పనులకు 2012-13వ సంవత్సరంలో పచ్చ జెండా లభించింది. రూ.623 కోట్ల వ్యయంతో రెండోదశ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత అంచనా వ్యయం పెరిగి రూ.813 కోట్లకు, అదికూడా పెరిగి రూ.1,150 కోట్లకు చేరుకుంది. 2014వ సంవత్సరంలో రెండో దశ పనులు ప్రారంభమయ్యాయి. రెండో దశ కింద సికింద్రాబాద్‌-మౌలాలి-ఘట్‌కేసర్‌, సికింద్రాబాద్‌-బొల్లారం, బొల్లారం-మేడ్చల్‌, ఫలక్‌నుమా-ఉందానగర్‌- శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌, మౌలాలి-సనత్‌నగర్‌, మౌలాలి-మల్కాజిగిరి-సీతాఫల్‌మండి, తెల్లాపూర్‌-రాంచంద్రాపురం స్ట్రెచ్‌లలో మొత్తం 84.5 రూట్‌ కిలోమీటర్ల (96.25 ట్రాక్‌ కిలోమీటర్లు) మేర పనులు చేపట్టాలని నిర్ణయించారు.

కింకర్తవ్యం..?

ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టును కేంద్ర రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తన వాటాకు మించి రెట్టింపు మొత్తం (రూ. 580 కోట్లు) ఖర్చు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.760కోట్లు చెల్లించవలసి ఉండగా, గతంలో రూ.179కోట్లు చెల్లించింది. మిగతా మొత్తాన్ని కూడా చెల్లిస్తే తప్ప ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లలేమంటూ పలుమార్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను చెల్లించగా మరో రూ.481 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అనుసరించవలసిన విధానంపై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలిసింది. రూ.100 కోట్లు విడుదల చేసినందుకు ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలా లేక మిగిలిన నిధులు వచ్చే వరకు నిరీక్షించాలా? అనే విషయమై ఉన్నత స్థాయిలో చర్చిస్తున్నట్టు తెలిసింది. మిగతా మొత్తం చెల్లింపు విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే రెండో దశ పనులు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Updated Date - 2022-12-16T01:19:48+05:30 IST