MMTS రెండో ‘దశ’ మారేనా.. మెట్రోను ఆదుకునేనా..!?

ABN , First Publish Date - 2022-03-07T12:42:20+05:30 IST

తెలంగాణ వాటా నిధులు విడుదల కాకపోవడంతో ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు..

MMTS రెండో ‘దశ’ మారేనా..  మెట్రోను ఆదుకునేనా..!?

హైదరాబాద్‌ సిటీ : తెలంగాణ వాటా నిధులు విడుదల కాకపోవడంతో ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు ముందుకు సాగడం లేదు. మొదటి విడత విజయవంతం కావడంతో రైల్వే అధికారులు రెండో దశ పనులకు 2012లో శ్రీకారం చుట్టారు. పలు మార్గాల్లో మొత్తం 72.95 కిలోమీటర్ల మార్గానికి రూ. 817 కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఇందులో 1/3 వంతు నిధులు కేంద్ర ప్రభుత్వం, 2/3 వంతు నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించేలా ఒప్పందం చేసుకున్నాయి. కేంద్రం తన వాటా నిధులు రూ. 217 కోట్లకు అదనంగా మరో రూ.217 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.544 కోట్లలో కేవలం రూ.1.29 కోట్లు మాత్రమే చెల్లించింది. ఏళ్లు గడుస్తున్నా నిధులు విడుదల చేయకపోవడంతో ముడిసరుకు ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా మరింత పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రూ.631 కోట్లను చెల్లించాల్సి ఉందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. నిధుల లేమితో సనత్‌నగర్‌, ఘట్‌కేసర్‌, మౌలాలి, మల్కాజిగిరి, సీతాఫల్‌మండి రూట్లలో పనులు నిలిచిపోయాయి.


మెట్రోను ఆదుకునేనా..?

నగర ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా ఇనుమడింపజేస్తున్న హైదరాబాద్‌ మెట్రోకు బడ్జెట్‌లో నిధులు కేటాయింపు ఆసక్తిగా మారింది. ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న హైదరాబాద్‌ మెట్రో రైలుకు 2021-22, 2022-23 బడ్జెట్‌లో కేంద్రం మొండిచేయి చూపించింది. తెలంగాణ ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించడంతో ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్‌ సంస్థలు కొంత ఊరట పొందాయి. కానీ, ఆ నిధులు చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కూడా సరిపోలేదని అధికారులు చెబుతున్నారు. కొవిడ్‌ కారణంగా ప్రయాణికుల సంఖ్య సగానికి తగ్గిపోవడంతో టికెట్లు, ప్రకటనల ఆదాయం పడిపోయిందని, మరో వైపు షాపింగ్‌మాల్స్‌, స్టేషన్లలో దుకాణాల నిర్వహణ లేకపోవడంతో అద్దెలు నిలిచిపోయాయని అంటున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను ఆదుకోవాలని కోరుతున్నారు. నిధుల కేటాయింపుపైనే మెట్రో రెండో దశ విస్తరణ ఆధారపడి ఉందని పేర్కొంటున్నారు.

Updated Date - 2022-03-07T12:42:20+05:30 IST