తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను కాపాడుకుందాం
ABN , First Publish Date - 2022-11-06T05:04:01+05:30 IST
తెలంగాణ చరిత్రకు సాక్ష్యాలైన పురాతన కట్టడాలు, గుర్తులను కాపాడుకుందామని చరిత్ర ...
చరిత్ర అధ్యయనకారుల పిలుపు
హైదరాబాద్ సిటీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ చరిత్రకు సాక్ష్యాలైన పురాతన కట్టడాలు, గుర్తులను కాపాడుకుందామని చరిత్ర పరిశోధకులు పిలుపునిచ్చారు. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తదితరులతో కూడిన బృందం సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల్లో ఉన్న ఇనుపరాతి యుగపు ఆనవాళ్లను శనివారం పరిశీలించింది. సిద్దిపేట జిల్లా వరదరాజపురం శివారులోని చిన్నగుట్ట మీద బృహత్‌శిలాయుగం నాటి అనేక సమాధులు ఉండేవని, ప్రతి సమాధి ముందు ఒక నిలువు రాయి కనిపించేదని శివనాగిరెడ్డి తెలిపారు. కానీ, వ్యవసాయ పనుల విస్తరణలో భాగంగా అవన్నీ కనుమరుగై ప్రస్తుతం ఒకేఒక్క నిలువు రాయి మిగిలిందని తెలిపారు. ఇక, మేడ్చల్ జిల్లా కేశవరం తండాలో రోడ్డుకు ఇరువైపులా నెలవైన ఇనుపరాతి యుగం నాటి వందల కొద్దీ సమాధులు కనుమరుగైపోయాయని వివరించారు. ఆయా ప్రాంతాల్లో మిగిలిన కొన్ని ఆధారాలనైనా కాపాడుకోవాలన్నారు.