అవినీతిని నిర్మూలిద్దాం.. సమాజాన్ని మారుద్దాం

ABN , First Publish Date - 2022-12-10T00:36:15+05:30 IST

అవినీతి నిర్మూలన కోసం శ్రమిస్తున్న యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ వాక్‌ జరిగింది.

అవినీతిని నిర్మూలిద్దాం.. సమాజాన్ని మారుద్దాం

ఖైరతాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అవినీతి నిర్మూలన కోసం శ్రమిస్తున్న యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ వాక్‌ జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున యువత పాల్గొని అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పీవీ నిర్సింహారావు మార్గంలోని పీపుల్స్‌ప్లాజా నుంచి జలవిహార్‌ వరకు ఈ వాక్‌ జరిగింది. ఈ వాక్‌ను తెలంగాణ మాజీ ముఖ్య అదనపు కార్యదర్శి, రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ అజయ్‌ మిశ్రా ప్రారంభించారు. అవినీతిని అడ్డుకుంటామని యువతతో ఆర్టీఐ మాజీ ముఖ్య కమిషనర్‌ వర్రె వెంకటేశ్వర్లు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారుల్లో జవాబుదారీతనం, పాలకుల్లో పారదర్శకత లేకపోవడం వల్లే అవినీతి పెరిగిపోయిందన్నారు. ప్రజలు, పౌరులు చట్టాలను వినియోగించుకుంటేనే అవినీతిని నిర్మూలించగలుగుతామన్నారు. అజయ్‌ మిశ్రా మాట్లాడుతూ సమాజంలో అవినీతి కేన్సర్‌లా పెరిగిపోయిందని, దాని నిర్మూలనలో యువత చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్వాహక సంస్థ వ్యవస్థాపకులు రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా తెలుగు రాష్ర్టాల్లో అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా చేసుకొని అవినీతిపై పోరాడుతున్నామన్నారు. ఇందులో సంస్థ ప్రతినిధులు జయరాం, రాజు, దేవేందర్‌, కోమటి రమేష్‌ బాబు, వి. గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:36:15+05:30 IST

Read more