ఎంజాయ్‌ చేద్దాం

ABN , First Publish Date - 2022-12-31T01:06:59+05:30 IST

వేడుకల వేళ మత్తులో యువత చిత్తుకావొద్దని, డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికి కొత్త ఏడాది మొదటి రోజే బాధపడొద్దని యువతకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

ఎంజాయ్‌ చేద్దాం

కానీ, కాస్త జాగ్రత్త..!

ఇన్సిడెంట్‌ ఫ్రీ వేడుకలే లక్ష్యం

నిబంధనలు ఉల్లంఘించొద్దు: ట్రై కమిషనరేట్‌ సీపీలు

ఫ్లై ఓవర్లు మూసివేత

శివార్లలో ‘నయా’ జోష్‌

న్యూ ఇయర్‌కు స్వాగతం పలికేందుకు నగరం సిద్ధమైంది. వేడుకలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ హ్యాపీ మూవ్‌మెంట్‌ను ఇన్సిడెంట్‌ ఫ్రీ (జీరో యాక్సిడెంట్స్‌, జీరో డెత్‌)గా జరుపుకునేలా ట్రై కమిషనరేట్‌ సీపీలు సీవీ ఆనంద్‌, మహేష్‌ భగవత్‌, స్టీఫెన్‌ రవీంద్ర తగిన చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): వేడుకల వేళ మత్తులో యువత చిత్తుకావొద్దని, డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికి కొత్త ఏడాది మొదటి రోజే బాధపడొద్దని యువతకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎంజాయ్‌ చేయండి కానీ.. జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలని సూచిస్తున్నారు. ఈవెంట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు.

ఓఆర్‌ఆర్‌ క్లోజ్‌

వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని డిసెంబర్‌ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 వరకు ఓఆర్‌ఆర్‌ను క్లోజ్‌ చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు వెల్లడించారు. కేవలం మీడియం, హెవీ గూడ్స్‌ లారీలను మాత్రమే అనుమతిస్తారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు టికెట్లు చూపిస్తే అనుమతిస్తారు. ట్రాఫిక్‌ రద్దీని బట్టి మందమల్లమ్మ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు ఉన్న సాగర్‌ రింగ్‌రోడ్‌ ఫ్లైవోవర్‌ తప్ప, మిగతా ఫ్లై ఓవర్లను కూడా మూసి వేయనున్నారు.

సైబరాబాద్‌లో అన్నీ క్లోజ్‌

సైబరాబాద్‌లో ఉన్న అన్ని ఫ్లై ఓవర్లనూ డిసెంబర్‌ 31 రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు మూసి వేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఆ రెండు మినహా..

హైదరాబాద్‌లో కమిషనరేట్‌ పరిధిలో బేగంపేట, లంగర్‌హౌజ్‌ ఫ్లైఓవర్‌లు మినహాయించి అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఎన్టీఆర్‌ మార్గ్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదకు రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎలాంటి వాహనాలను అనుమతించరు. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లించే వాహనాలను కవాడిగూడ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ ఆలయం మీదుగా మళ్లిస్తారు.

రిసార్టులు రెడీ..

రూ. లక్షల్లో ఎంట్రీ ఫీజులు

రంగారెడ్డి అర్బన్‌: న్యూ ఇయర్‌ వేడుకలకు నగర శివార్లలోని రిసార్ట్స్‌, హోటళ్లు ముస్తాబవుతున్నాయి. ఆకట్టుకునే ఈవెంట్లతో ఆహ్వానం పలుకుతున్నాయి. నగర శివార్లలో జరుగుతున్న కొన్ని ఈవెంట్లకు రూ. లక్షలు వెచ్చించి జనం టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. రిసార్ట్స్‌ల్లో ట్రెక్కింగ్‌, నైట్‌ క్యాంపింగ్‌, అడ్వెంచర్‌ గేమ్స్‌, లైవ్‌ సింగింగ్‌, డ్యాన్స్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ రిసార్ట్స్‌ల్లో ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల నుంచి సింగర్స్‌, డ్యాన్సర్లను రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఖరీదైన ఈవెంట్‌

ప్రముఖ సింగర్‌ దర్శన్‌ రావల్‌ హాజరవుతున్న నార్సింగ్‌లోని ఓ ఈవెంట్‌ను ఖరీదైనదిగా చెబుతున్నారు. దీనికి మూడు ప్యాకేజీల్లో టికెట్లు విక్రయిస్తున్నారు. ఓ జంటకు డైమండ్‌ ప్యాకేజీకి రూ. 2.50 లక్షలు, ప్లాటినం ప్యాకేజీకి రూ.1.25 లక్షలు, గోల్డ్‌ ప్యాకేజీకి రూ.75 వేలుగా ధరలు ఉన్నాయి.

అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): శనివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. న్యూ ఇయర్‌ నేపథ్యంలో శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం అర్ధరాత్రి 2 గంటల వరకు తిరుగుతాయని, చివరి రైలు ఒంటి గంటకు బయలుదేరి చివరి స్టేషన్‌కు 2 గంటలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు.

ఎంఎంటీఎస్‌ ప్రత్యేక సర్వీసులు

సికింద్రాబాద్‌, (ఆంధ్రజ్యోతి): కల్వరీ టెంపుల్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈనెల 31 అర్ధరాత్రి ఎంఎంటీఎస్‌ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ స్పెషల్‌ లింగంపల్లి నుంచి అర్ధరాత్రి 1.15 గంటలకు బయల్దేరి, హైదరాబాద్‌ స్టేషన్‌కు 1.55గంటలకు చేరుతుంది. లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌ స్పెషల్‌ లింగంపల్లి నుంచి అర్ధరాత్రి 1.30గంటలకు బయల్దేరి, ఫలక్‌నుమా స్టేషన్‌కు 2.55గంటలకు చేరుతుంది.

Updated Date - 2022-12-31T01:07:00+05:30 IST