ఖతర్నాక్‌లు

ABN , First Publish Date - 2022-12-15T01:03:06+05:30 IST

vaమూడు కమిషనరేట్‌ల పోలీసులు నేరస్థులపై ఉక్కుపాదం మోపుతున్నారు. బుధవారం ఒక్కరోజే మూడు వేర్వేరు కేసుల్లో కిలాడీ కేటుగాళ్లను అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి పంపించారు.

ఖతర్నాక్‌లు

బంగారం వ్యాపారులే టార్గెట్‌గా దోపిడీలు

బ్యాంకులకు టోకరా వేస్తున్న మరో బ్యాచ్‌

సెక్స్‌ రాకెట్‌లో ఇంకో ముగ్గురు

మూడు ముఠాల ఆటకట్టించిన పోలీసులు

మూడు కమిషనరేట్‌ల పోలీసులు నేరస్థులపై ఉక్కుపాదం మోపుతున్నారు. బుధవారం ఒక్కరోజే మూడు వేర్వేరు కేసుల్లో కిలాడీ కేటుగాళ్లను అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి పంపించారు. కళ్లలో కారం కొట్టి.. అవసరమైతే ఆయుధాలు వినియోగించి బంగారం వ్యాపారులను దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల ఘరానా దోపిడీ గ్యాంగ్‌ను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏటీఎంలో నగదు డ్రా చేసుకొని బ్యాంకులకు టోకరా వేస్తున్న ఓ చీటర్స్‌ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. దేశంలోనే అతిపెద్ద సెక్స్‌ రాకెట్‌ తీగ లాగుతున్న సైబరాబాద్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ మరో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసింది.

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి):బ్యాంక్‌లను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. వారి నుంచి రూ.1.18లక్షలు, నాలుగు బంగారు గాజులు, వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డులు 24, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 4.68 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. బుధవారం బషీర్‌బాగ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ ఓస్‌డీ రాధాకిషన్‌తో అడిషనల్‌ సీపీ విక్రమ్‌సింగ్‌ మాన్‌ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సయ్యద్‌ ఉర్‌ రహ్మాన్‌ ఏరోబిక్‌ టీచర్‌. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు. 2020లో చందానగర్‌లో కొంతకాలం ఉన్నాడు. జవహర్‌నగర్‌ బాలాజీనగర్‌కు చెందిన మహ్మద్‌ సానూ అలియాస్‌ సుల్తాన్‌ పరిచయమయ్యాడు. సుల్తాన్‌ స్నేహితుడు షేక్‌ మహబూబ్‌ అలియాస్‌ మౌలానా తోడయ్యాడు. రహ్మాన్‌కు సాంకేతికతపై పట్టు ఉంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుల్తాన్‌, మౌలానా తరచూ ముంబైలో ఉంటున్న రహ్మాన్‌ వద్దకు వెళ్లేవారు. వారి డెబిట్‌ కార్డులతోపాటు.. స్నేహితులు, బంధువులు, తెలిసిన వారి డెబిట్‌ కార్డులు తీసుకెళ్లేవారు. శివారు ప్రాంతాలు, సెక్యూరిటీ, సీసీటీవీలు లేని ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకుల ఏటీఎంలను లక్ష్యంగా చేసుకునేవారు. రహ్మాన్‌ సహకారంతో ఏటీఎంలలో డబ్బు విత్‌డ్రా చేసేవారు. డబ్బులు విత్‌డ్రా అయిన విషయం బ్యాంకులో నమోదు కాకుండా రహ్మాన్‌ సాంకేతికతను ఉపయోగించేవాడు. తర్వాత కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి, డబ్బులు విత్‌ డ్రా కాలేదనీ, అకౌంట్‌ నుంచి డెబిట్‌ అయ్యాయని ఫిర్యాదు చేసేవారు. బ్యాంకు అధికారులు రెండు మూడు రోజుల్లో డబ్బును తిరిగి ఖాతాలో జమచేసేవారు. ఇలా థానే, ముంబై సెంట్రల్‌, మాజ్‌గాన్‌, వక్లీ, వర్లినాకా, శివాజీనగర్‌, ఖలీనా, పవాయి, వాగ్లేసర్కిల్‌, ఘట్కేపర్‌, చర్చ్‌ఘాట్‌, జియోరీగోన్‌, సీ ఉడ్‌ సహా 13 ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఏటీఎంల నుంచి రూ. 20లక్షలు కాజేశారు. థానే జిల్లాలో రెండుప్లాట్లు కొనుగోలు చేశారు.రూ. 6-7లక్షలు రహ్మాన్‌ తల్లి చికిత్సకు, రూ. 3-4లక్షలతో బిట్‌కాయిన్స్‌ కొనుగోలు చేశారు. 6 తులాల బంగారు గాజులు కొన్నారు. మిగిలిన డబ్బును పోలీసులు రికవరీ చేశారు.

ఇలా దొరికారు

పేట్‌బషీరాబాద్‌, కుత్బుల్లాపూర్‌, బోయినపల్లి, మారేడుపల్లి ప్రాంతాల్లోని శివారు ప్రాంతాల ఏటీఎంలలో మోసాలకు పాల్పడ్డారు. అక్టోబర్‌-23న సుల్తాన్‌, షేక్‌ మహబూబ్‌ మారేడుపల్లి పరిధిలోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లోని క్యాష్‌డిపాజిట్‌ మిషన్‌ నుంచి డెబిట్‌ కార్డు ద్వారా రూ. 20 వేలు విత్‌డ్రా చేశారు. డబ్బులు రాలేదని బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయగా డబ్బు తిరిగి ఖాతాలో డిపాజిట్‌ చేశారు. ఇలా రూ. 99వేలు మోసం చేశారు. అనుమానం వచ్చిన ఎస్‌బీఐ మేనేజర్‌ మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకున్నారు.

500 స్నాచింగ్‌లు, దోపిడీలు

ఒంటరిగా వెళ్లేవారిని భయభ్రాంతులకు గురిచేసి బంగారం, వజ్రాలు, నగదు దోచుకుంటున్న ఘరానా దోపిడీ దొంగల ముఠా ఆటకట్టించారు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఐదుగురిని అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ. 8 లక్షలు, డైమండ్‌ నెక్లెస్‌, స్పేర్‌ డైమండ్స్‌-4, 30 గ్రాముల ఫ్లాట్‌ డైమండ్‌తోపాటు మరికొన్ని వజ్రాలు, 75 గ్రాముల బంగారం బిస్కట్‌, 30 కిలోల వెండి, ఐదు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువ రూ. 88 లక్షలు ఉంటుందన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ సిటీ అడిషనల్‌ సీపీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌, టాస్క్‌ఫోర్‌ ఓఎ్‌సడీ రాధాకిషన్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.

ఎన్‌ఎ్‌స కుంట జహనుమాకు చెందిన సయ్యద్‌ సయీద్‌ హుస్సేన్‌ అలియాస్‌ లంబా అలియాస్‌ హుస్సేన్‌ అలియాస్‌ లంబా హుస్సేన్‌, లాల్‌దర్వాజకు చెందిన ఎస్‌కే సలీమ్‌ అలియాస్‌ జబ్బా, అత్తాపూర్‌కు చెందిన అవరు బాలకిషన్‌ అలియాస్‌ కిషన్‌, మహ్మద్‌ అహదుద్దీన్‌, సయ్యద్‌ ముబాసిర్‌ అలియాస్‌ ముజ్జు, మహ్మద్‌ గౌస్‌ పాషా అలియాస్‌ గౌస్‌ ముఠాగా ఏర్పడ్డారు. ఒంటరిగా వెళ్తున్న వారి కళ్లలో కారం చల్లి, కత్తులు, మారణాయుధాలతో బెదిరించి, బంగారం, వజ్రాలు, నగదు దోచుకుంటున్నారు. ఈ ముఠా మూడు కమిషనరేట్ల పరిధుల్లో 500 చైన్‌స్నాచింగ్‌లు, దారిదోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అక్టోబర్‌-3న మహీంద్రాహిల్స్‌ దగ్గరలోని బ్రింక్స్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెండి తీసుకెళ్తున్న వ్యాపారిని అనుసరించారు. బషీర్‌బాగ్‌ ఫ్లైవోర్‌ వద్దకు రాగానే వ్యాపారి బైక్‌ను ఢీకొట్టారు. వెండి ఉన్న బ్యాగ్‌ లాక్కొని పారిపోయారు. నవంబర్‌-22న జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-45లో ఓ వ్యాపారిని అనుసరించిన గ్యాంగ్‌ మార్గమధ్యంలో అతడి వద్ద ఉన్న బ్యాగ్‌ లాక్కొని పారిపోయింది. నవంబర్‌-24న హిమాయత్‌నగర్‌ రోడ్డు నంబర్‌-6లో మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యాపారి ముఖంపై కారం చల్లి అతడి వద్ద ఉన్న డైమండ్‌ నెక్లెస్‌ బ్యాగ్‌ లాక్కొని పారిపోయారు. డిసెంబర్‌-5న పవన్‌కుమార్‌ అనే వ్యాపారిని సికింద్రాబాద్‌ ఆర్‌పీ రోడ్డులో అడ్డగించి కళ్లలో కారం చల్లి, బ్లేడ్‌తో గాయపరిచి అతడి వద్ద బంగారం, వజ్రాలతో ఉన్న బ్యాగ్‌ లాక్కొని పారిపోయారు.

ఆధారాలు సేకరించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు లంబా, జబ్బా, ముజ్జు ముఠాను గుర్తించారు. ముఠాలో ఆరుగురు ఉండగా.. ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. మహ్మద్‌ అహదుద్దీన్‌ పరారీలో ఉన్నాడు. లంబాపై 2014లో పీడీయాక్ట్‌ నమోదైంది. 2017లో జైలు నుంచి బయటకు వచ్చాడు. జబ్బా 2017లో జైలుకు వెళ్లి 2018లో బయటకు వచ్చాడు. ముఠాలో ఉన్న అవురు బాలకిషన్‌ అలియాస్‌ కిషన్‌ దోపిడీకి స్కెచ్‌ వేయడంలో ప్రధాన భూమిక పోషించేవాడని విచారణలో తేలింది. కేసును ఛేదించిన టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను సీపీ అభినందించి రివార్డులు ప్రకటించినట్లు అడిషనల్‌ సీపీ తెలిపారు.

మహిళల అక్రమ రవాణా కేసులో ..

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): మహిళల అక్రమ రవాణా కేసులో మరో ముగ్గురిని సైబరాబాద్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ విభాగం అధికారులు అరెస్ట్‌ చేశారు. వీరిపై ఎనిమిది కేసులున్నాయి. ఏపీ, తెలంగాణ, వెస్ట్‌బెంగాల్‌, ముంబైల నుంచి 800 మంది మహిళలను అక్రమ రవాణా చేసినట్లు, లొకాంటో, స్కోక్కా వెబ్‌సైట్లు, హైదరాబాద్‌ కేంద్రంగా కాల్‌సెంటర్‌లు వాట్సా్‌పల ద్వారా దందా సాగించినట్లు పోలీసులు గుర్తించారు.

కడప జిల్లా, తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లోమాడా రామసుబ్బారెడ్డి(38) అడ్వొకేట్‌, రియల్‌ వ్యాపారం చేస్తుంటాడు. 2004లో నగరానికి వచ్చి లా కాలేజీలో చేరి ఓ లాయర్‌ వద్ద టైపిస్టుగా చేరాడు. 2007లో ఓ పిటా (వ్యభిచార నిర్వాహకుడు) ఆర్గనైజర్‌ వద్ద కలెక్షన్‌ బాయ్‌గా చేరాడు. ఇప్పటి వరకు 600 మంది మహిళలను రప్పించినట్లు పోలీసు విచారణలో వెల్లడించాడు. అదే గ్యాంగ్‌ సభ్యుడు కర్ణాటక గుల్బర్గాకు చెందిన హబీబ్‌ ప్రభాకర్‌(49) కూడా బ్రోతల్‌ హౌస్‌ నిర్వాహకుడు. కర్నూలు జిల్లా అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన దాసరి చైతన్య(32) 2013లో నగరానికి వచ్చి ఓ బ్రోతల్‌ హౌస్‌లో రూమ్‌బాయ్‌గా చేరాడు. పట్టుబడి జైలుకెళ్లినా బుద్ధి మారకుండా రామసుబ్బారెడ్డితో కలిసి అదే దందాలో కొనసాగుతున్నాడు. ఇతడు ఇప్పటి వరకు 200 మంది మహిళలను అక్రమంగా సరఫరా చేసినట్లు గుర్తించారు. నిందితుల నుంచి 8 ఫోన్లు, ల్యాప్‌టాప్‌, ఐదు ఆధార్‌కార్డులు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2022-12-15T01:03:09+05:30 IST