సునీల్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
ABN , First Publish Date - 2022-12-31T04:53:12+05:30 IST
అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో ఇటీవల సైబర్ క్రైం పోలీసులు నమోదు చేసిన కాంగ్రెస్ వార్‌రూం కేసును, పోలీసులు జారీచేసిన సీఆర్పీసీ 41ఏ నోటీసులను
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో ఇటీవల సైబర్ క్రైం పోలీసులు నమోదు చేసిన కాంగ్రెస్ వార్‌రూం కేసును, పోలీసులు జారీచేసిన సీఆర్పీసీ 41ఏ నోటీసులను కొట్టేయాలని కోరుతూ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ కే సురేందర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సునీల్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్ సభ్యుడని.. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన రాజకీయ వ్యంగ్య వీడియోతో సునీల్‌కు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయి వ్యూహకర్త అయిన సునీల్ ఢిల్లీలో ఉంటారని, ఆయనకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వార్‌రూంకు ఆయనకు సంబంధం లేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు కావాలనే పోలీసులతో కాంగ్రెస్ వార్‌రూంపై దాడులు చేయించారని పేర్కొన్నారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సార సుదర్శన్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ఇంకా పోలీసుల ఎదుట హాజరుకాలేదని.. తదుపరి లభించే ఆధారాలను బట్టి నిందితుడిగా చేర్చే అంశంపై నిర్ణయం ఉంటుందని తెలిపారు. పిటిషనర్ అడ్రస్ గాంధీభవన్ అని ఉండటంతో అక్కడే నోటీసు అందజేశామని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.