ఉమ్మడి ఏపీ విశ్రాంత లోకాయుక్త జస్టిస్‌ సీతారాంరెడ్డి కన్నుమూత

ABN , First Publish Date - 2022-11-18T04:26:41+05:30 IST

ఉమ్మడి ఏపీ లోకాయుక్త, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీతారాంరెడ్డి (95) ఇకలేరు.

ఉమ్మడి ఏపీ విశ్రాంత లోకాయుక్త జస్టిస్‌ సీతారాంరెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌ సిటీ, ఉండవల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీ లోకాయుక్త, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీతారాంరెడ్డి (95) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. జస్టిస్‌ కొండా మాధవరెడ్డికి జస్టిస్‌ సీతారాంరెడ్డి స్వయానా తోడల్లుడు. ఆయన స్వస్థలం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా (ప్రస్తుతం గద్వాల జిల్లా) ఉండవల్లి గ్రామం. నిజాం కాలేజీలో డిగ్రీ అనంతరం లండన్‌లో బారిస్టర్‌ చదివారు. ముంబైకి చెంది న ప్రముఖ న్యాయశాస్త్ర నిపుణుడు జస్టిస్‌ పాల్కివాలా వద్ద 1955లో సహాయ న్యాయవాదిగా, ఓయూ న్యాయకళాశాలలో అధ్యాపకుడిగా, సెనేట్‌ సభ్యుడిగాను సేవలందించారు. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగానూ పనిచేశారు.

అప్పుడే 1960-1968 వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగారు. అంతర్జాతీయ న్యాయ నివేదికలకు ఏపీ సంపాదకుడిగా, ప్రభుత్వ న్యాయవాదిగా, ఇండియన్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడి హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా 1978-1990వరకు పని చేశారు. తర్వాత మరో ఐదేళ్లు లోకాయుక్తగా ఉన్నా రు. రాజా బహదూర్‌ వేంకటరామారెడ్డి ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వహించారు. సీతారాంరెడ్డి భౌతికకాయానికి మాదాపూర్‌లోని స్వగృహంలో న్యాయనిపుణులు, న్యాయమూర్తులు నివాళులు అర్పించారు. అందులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్‌రెడ్డి, తెలంగాణ మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ లోకాయుక్త జస్టిస్‌ సీవీ రాములు, ఉపలోకాయుక్త జస్టిస్‌ నిరంజన్‌రావు ఉన్నా రు. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో గురువారం సీతారాంరెడ్డి అంత్యక్రియలు ముగిసాయి.

Updated Date - 2022-11-18T04:26:42+05:30 IST