స్ఫూర్తిదాత హీరాబెన్‌

ABN , First Publish Date - 2022-12-31T03:45:59+05:30 IST

ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మరణం పట్ల గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ సహా పలువురు బీజేపీ నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

స్ఫూర్తిదాత హీరాబెన్‌

ప్రధాని తల్లి మృతి పట్ల గవర్నర్‌, సీఎం సహా పలువురి సంతాపం

హైదరాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మరణం పట్ల గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ సహా పలువురు బీజేపీ నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. చిన్నతనం నుంచే ధృడమైన నాయకుడిగా పెంచి, ప్రజా జీవితంలో మేరు పర్వతం వంటి ఉన్నతమైన వ్యక్తిని, బలమైన నాయకుణ్ణి ప్రపంచానికి అందించిన అద్వితీయమైన తల్లి హీరాబెన్‌ అని గవర్నర్‌ పేర్కొన్నారు. దేనైనా తట్టుకునే శక్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎల్లప్పుడు ఇచ్చే భగవంతుడు ఇపుడు తల్లి మృతిని కూడా తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని గవర్నర్‌ తెలిపారు. తల్లి, కొడుకుల అనుబంధాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి స్ఫూర్తి దాత హీరాబెన్‌ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. శివాజీని తీర్చిదిద్దిన జిజియాబాయి లాగా ప్రధాని మోదీని హీరాబెన్‌ తీర్చిదిద్దారన్నారు. హీరాబెన్‌ మరణం పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మొదటి దైవం, గురువు అయిన తల్లిని కోల్పోతే ఉండే దుఃఖం తనకు తెలుసునన్నారు. గత 20 ఏళ్లుగా సీఎం, పీఎం హోదాలో కుమారుడు ఉన్నా ఆర్భాటాలకు హీరాబెన్‌ దూరంగా ఉన్నారన్నారు. హీరాబెన్‌ కుటుంబ సభ్యులకు ఆమె మరణాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు కల్పించాలని ఎంపీ లక్ష్మణ్‌ ఆకాంక్షించారు. తల్లి మరణం ప్రధాని మోదీకి తీరని లోటని పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ట్విటర్‌ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్‌.. ప్రధాని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హీరాబెన్‌ మృతిపట్ల మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ తదితరులు సంతాపం తెలిపారు. వందేళ్లు పూర్తి చేసుకుని సంపూర్ణ జీవితం గడిపిన హీరాబెన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ మృతి పట్ల టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. హీరాబెన్‌ మరణం పట్ల వైస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల సంతాపం ప్రకటించారు. తల్లిని కోల్పోయిన మోదీకి, ఆయన కుటుంబ సభ్యులకు ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రగాఽఢ సానుభూతి తెలిపారు. హీరాబెన్‌ నూరేళ్ల సంపూర్ణ జీవితాన్ని గడిపారని ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరారు.

Updated Date - 2022-12-31T03:45:59+05:30 IST

Read more