Indian Racing League: రయ్‌.. రయ్‌..

ABN , First Publish Date - 2022-11-20T13:11:14+05:30 IST

హుస్సేన్‌సాగర్‌ తీరాన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో ట్రయల్‌ ఆకట్టుకుంది. శనివారం కార్ల రేస్‌ ఉత్కంఠగా

Indian Racing League: రయ్‌.. రయ్‌..

హైదరాబాద్‌ సిటీ: హుస్సేన్‌సాగర్‌ తీరాన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో ట్రయల్‌ ఆకట్టుకుంది. శనివారం కార్ల రేస్‌ ఉత్కంఠగా సాగింది. రెప్పపాటు వేగంతో దూసుకెళ్లిన కార్లను చూసి చాలా మంది సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

ఎన్‌టీఆర్‌ గార్డెన్‌ చుట్టూ హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన 2.7 కిలోమీటర్ల రేసింగ్‌ ట్రాక్‌పై శనివారం మధ్యాహ్నం కార్లు దూసుకెళ్లాయి. కొత్త ట్రాక్‌ కావడంతో డ్రైవర్లు ప్రాక్టీ్‌సలో భాగంగా ట్రయల్స్‌ వేశారు. ఎన్‌టీఆర్‌ గార్డెన్‌ ముందు రేసింగ్‌ కార్లన్నీ బారులు తీరగా, మంత్రి కేటీఆర్‌ జెండా ఊపి ప్రారంభించారు. రేసింగ్‌ బృందాలను, వారి కార్లను పరిశీలించారు. డ్రైవర్ల అనుభవాలను తెలుసుకున్నారు.

గరిష్ఠంగా 260 కిలోమీటర్ల వేగం

ఈ లీగ్‌లో పాల్గొన్న కార్లన్నీ పెట్రోలుతో నడిచేవి. కారు గరిష్ఠ వేగం 260 కిలోమీటర్లు. 2.7 కిలోమీటర్ల ట్రాక్‌ను ఒక్కో కారు నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషంలో చుట్టి వచ్చేశాయి. రెప్పపాటుతో దూసుకెళ్తున్న కార్లను ఫోన్లలో బంధించేందుకు చాలా మంది ఆసక్తి కనబరిచారు. ఎలక్ర్టికల్‌ కార్లయితే గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని నిర్వాహకులు తెలిపారు. పురుషులతో పోటీ పడి మహిళా రేసర్లు రయ్యుమంటూ కార్లను నడిపారు. కార్లు దూసుకెళ్తున్న శబ్ధం కిలోమీటర్ల మేర వినిపించింది.

పకడ్బందీగా ఏర్పాట్లు

రేస్‌ కారు అదుపు తప్పినా బయటకు దూసుకురాకుండా ఇరువైపులా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. 15 అడుగుల మేర భారీ ఇనుప కంచెను ఉంచారు. 2.7 కిలోమీటర్ల ట్రాక్‌పై 17 మలుపులున్నాయి. ప్రతీ మలుపు వద్ద ప్రముఖ ఆస్పత్రికి చెందిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పదికి పైగా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. అవసరమైతే అత్యవసర చికిత్స అందించే వైద్య సిబ్బందిని నియమించారు.

హైలైట్స్‌

వీఐపీల అనుచరులు రేసింగ్‌ పాస్‌ల కోసం ఉన్నతాధికారులతో రాయబారాలు జరిపారు.

ఉదయం నుంచే ట్రాఫిక్‌ మళ్లించడంతో చాలా చోట్ల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

పలువురు ఐమాక్స్‌ ముందున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పై నుంచి, ప్రభుత్వ పాఠ్య పుస్తక ముద్రణాలయం భవనం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం పై నుంచి చూశారు.

మింట్‌ కాంపౌండ్‌ తొలి గ్యాలరీ వద్ద ఉన్న మూల మలుపు వద్ద ఓ రేసింగ్‌ కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రేసర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడంతో కారు ఓ మలుపు తిరిగింది. తిరిగి తేరుకొని కారును ముందుకు నడిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

సాయంత్రం 4.30 అనంతరం జరిగిన చివరి ఈవెంట్‌కు ఆంక్షలు సడలించడంతో చాలా మంది మింట్‌ కాంపౌండ్‌ మార్గంలో రేసింగ్‌ చూడగలిగారు.

ఎన్టీఆర్‌ స్టేడియం, నిజాం కాలేజ్‌, నెక్లె్‌సరోడ్‌లలో పార్కింగ్‌ ఏర్పాటు చేయడంతో అక్కడి నుంచి రేసింగ్‌ ప్రాంతానికి వచ్చేందుకు నిర్వాహకులు బస్సులను ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-11-20T13:11:16+05:30 IST