1948, సెప్టెంబర్‌ 17..ఆ రోజు ఏం జరిగింది?

ABN , First Publish Date - 2022-09-17T17:04:56+05:30 IST

1948, సెప్టెంబర్‌ 17న నిజాం ప్రధాని లాయక్‌ అలీఖాన్‌ రాజీనామా చేశారు. ఇండియన్‌ ఏజంట్‌ జనరల్‌ కేఎం మున్షీ సలహా మేరకు భారత సైన్యానికి తాము స్వాగతం పలుకుతున్నట్టు ఆ వేళ

1948, సెప్టెంబర్‌ 17..ఆ రోజు ఏం జరిగింది?

హైదరాబాద్‌ సిటీ: 1948, సెప్టెంబర్‌ 17న నిజాం ప్రధాని లాయక్‌ అలీఖాన్‌ రాజీనామా చేశారు. ఇండియన్‌ ఏజంట్‌ జనరల్‌ కేఎం మున్షీ సలహా మేరకు భారత సైన్యానికి తాము స్వాగతం పలుకుతున్నట్టు ఆ వేళ దక్కన్‌ రేడియో ద్వారా నిజాం రాజు ప్రకటించాడని నరేంద్ర లూథర్‌ రచనల్లో ప్రస్తావించారు. 1948, సెప్టెంబర్‌ 18న భారత బలగాలు హైదరాబాద్‌ శివార్లకు చేరాయి. అదే రోజు నగరానికి విచ్చేసిన జనరల్‌ చౌదరి బొల్లారంలోని కేఎం మున్షీ నివాసంలో బస చేశాడు. పోలీసు చర్య ముగిసింది అని కూడా ప్రకటన వెలువడింది. సెప్టెంబర్‌ 19న నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్‌ లొంగిపోయాడు. పోలీసు చర్యతో జంట నగరాల్లో తీవ్ర ఘర్షణలు తలెత్తుతాయని అందరూ ఆందోళన చెందారు. నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ భయం కూడా అదే. అప్పటికే నిజాం సైన్యం వెనక్కి తగ్గింది. ప్రభుత్వమంటూ ఏదీ లేదు. దాంతో కొన్ని అరాచక శక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలున్నాయని కొందరు భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే, ఆ రోజు సికింద్రాబాద్‌లో కొద్దిపాటి అల్లర్లు, స్వల్ప మొత్తంలో ప్రాణనష్టం తలెత్తిందని చారిత్రక రచనల్లో కొందరు ప్రస్తావించారు.


జిన్నా సాయం కోసం..

1948, ఆగస్టు17న హైదరాబాద్‌, భారత ప్రభుత్వం మధ్య వివాద పరిష్కారానికి తాము ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించనున్నట్లు ప్రధాని నెహ్రూకు నిజాం ప్రధాని లాయక్‌ అలీ తెలిపారు. ఇది భారత అంతరంగిక సమస్య కనుక ఐక్యరాజ్య సమితి జోక్యం ఉండదని నెహ్రూ బదులిచ్చారు. హైదరాబాద్‌ ప్రతినిధి వర్గం ప్యారిస్‌ వెళ్లడానికి విమాన సదుపాయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించింది. దాంతో హైదరాబాద్‌ విదేశాంగ మంత్రి మోయిన్‌ నవాజ్‌ జంగ్‌ నేతృత్వంలో ప్రతినిధి వర్గం పాకిస్తాన్‌ వెళ్లి, ప్యారి్‌సకు చేరుకుంది. అదే సమయంలో లాయక్‌అలీ రహస్యంగా సిడ్నీ విమానంలో జిన్నాను కలిసేందుకు పాకిస్తాన్‌ వెళ్లారు. ఒకవేళ భారత్‌ కనుక తమపై దాడి చేస్తే, పాకిస్తాన్‌ హైదరాబాద్‌కు ఏ విధమైన సహకారం అందించగలదు అని తెలుసుకోవడమే ఆ ప్రయాణం ముఖ్య ఉద్దేశం. కానీ జిన్నా మరణశయ్యమీద ఉన్నాడు. దాంతో మిగతా పాకిస్తాన్‌ సభ్యులెవరూ ఆ విషయంలో నోరు మెదపలేదు. పాకిస్తాన్‌ గూఢచారుల ప్రకారం సెప్టెంబర్‌ 23న భారత సైన్యం హైదరాబాద్‌పై దాడి మొదలు పెట్టొచ్చు అని లాయక్‌అలీకి సమాచారం అందింది. అదే సమయంలో భారత సైన్య ప్రధాన కార్యాలయం సైనిక చర్యకు కొంత గడువు అడిగింది. కనీసం సెప్టెంబర్‌ 15కు వాయిదా వేయమని అడిగారు. అయినా భారత ప్రభుత్వం అందుకు అనుమతించలేదు. సెప్టెంబర్‌ 13న సైనిక చర్య మొదలవ్వాలని, సెప్టెంబర్‌ 9న నిర్ణయం జరిగింది. అలా ఆపరేషన్‌ పోలో పేరుతో పోలీస్‌ యాక్షన్‌ సాగింది.


కాశీం రజ్వీ నోట సమతా మాట..

భారత బలగాల విజయం తథ్యమని ముందే గుర్తించిన కాశీంరజ్వీ భయాందోళన వ్యక్తం చేసినట్లు మొహమ్మద్‌ హైదర్‌ రచనలో ప్రస్తావించారు. సెప్టెంబరు 17న సాయంత్రం 5 గంటలకు భారత సైన్యం నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అదే రోజు ఖాసీం రజ్వీ దక్కన్‌ రేడియోలో... మతసామరస్యం కొనసాగాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. గత ఘటనలను మరిచిపోవాలని విన్నవించాడు. 


సదాశివపేటను కాపాడిన పోస్టు మాస్టర్‌

మా సొంతూరు సదాశివపేట. 1947, అక్టోబర్‌లోని దసరాపండుగ రోజున రజాకార్లు కొందరు సదాశివపేటలోని కొన్ని దుకాణాలకు అగ్గిపెట్టారు. ఆ తర్వాత రోజు హిందువుల ఇళ్లను దగ్ధం చేయాలని పెట్రోలు, కిరోసిన్‌ డబ్బాలతో రోడ్డుమీదకు వచ్చారు. ఆ దుకాణ సముదాయాల తర్వాత ఆంజనేయస్వామి గుడి, తర్వాత వరుసలో మా ఇల్లు, ప్రభుత్వ పోస్టాఫీసు ఉంది. వాళ్ల దాష్టీకానికి భయపడిన నేను పెద్దగా ఏడ్చాను. అప్పుడు నా వయసు ఏడేళ్లు. నా ఏడుపు విన్న మా పక్క ఇంటిలోని పోస్టు మాస్టర్‌ నన్ను ఓదార్చారు. సమస్యను గుర్తించి, ఆయన రజాకార్లను అదిలించాడు. పోస్టు మాస్టర్‌ కూడా ముస్లిం కావడంతో, అవతలివాళ్లు కాస్త వెనక్కి తగ్గారు. మీరు ఇళ్ళకు అగ్గిపెడితే, పక్కనే ఉన్న పోస్టాఫీసు కూడా తగలపడుతుంది. మరి దీనికి బాధ్యత వహిస్తారా అని ఆ పోస్టు మాస్టర్‌ రజాకార్ల ముఠాను నిలదీయడంతో వాళ్లు వెనుదిరిగారు. అలా సదాశివపేటలోని కొన్ని వందల ఇళ్లు కాలి బూడిద కాకుండా ఆ పోస్టు మాస్టర్‌ కాపాడారు. 

- పంతుల విఠల్‌రావు, న్యాయవాది, 82 ఏళ్లు 


సాయుధ పోరాటానికి ఓనర్లం

విద్యార్థి నాయకుడు రఫీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున ఉస్మానియా యూనివర్సిటీ భవనం పై జాతీయ జెండాను ఎగురేశాడు. నైజాం వ్యతిరేక పోరాటానికి పిలుపు నిచ్చిన కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ను మగ్దూం మొయుద్దీన్‌ స్థాపించారు. అందులో జావెద్‌ రజ్వీ వంటి వీరులెందరో పాల్గొన్నారు. తెలంగాణ భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న యోధుల్లో సగం మంది ముస్లింలే. అలాంటిది, నైజాం వ్యతిరేక పోరాటాన్ని ముస్లిం వ్యతిరేక పోరాటంగా బీజేపీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. చరిత్రను తప్పుదోవ పట్టించాలనుకోవడం దుర్మార్గం. మేం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఓనర్లం. ఆనాడు భూస్వాముల దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడాం. అలాంటిది మా కళ్లముందే చరిత్రను తారుమారు చేస్తున్నారు. ఆంధ్ర మహాసభ, కామ్రేడ్స్‌ ఆసోసియేషన్‌, ఆర్యసమాజ్‌, భారతీయ కమ్యూనిస్టు పార్టీ తదితర సంస్థల పోరాటంతోనే భారత ప్రభుత్వంలో హైదరాబాద్‌ విలీనమైంది. చరిత్రను కబ్జాకాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత భావితరాలదే. 

- జైని మల్లయ్య గుప్త, 96 ఏళ్లు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు

Updated Date - 2022-09-17T17:04:56+05:30 IST