బీజేపీ పాలనలో ఆకలి దేశంగా భారత్‌

ABN , First Publish Date - 2022-12-31T04:33:21+05:30 IST

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రధాని నరేంద్రమోదీ నిర్వీర్యం చేస్తున్నారని...

బీజేపీ పాలనలో ఆకలి దేశంగా భారత్‌

వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు విజయరాఘవన్‌

ఖమ్మంలో రాష్ట్ర మహాసభలు ప్రారంభం

ఖమ్మం, డిసెంబరు 30 (ఆంఽధ్రజ్యోతి): దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రధాని నరేంద్రమోదీ నిర్వీర్యం చేస్తున్నారని, విపక్షాలను లేకుండా చేయాలని చూస్తున్నారని, ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు విజయరాఘవన్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రం ఆవరణలో సీపీఎం అనుబంధ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.సోమయ్య అరుణపతాకాన్ని ఆవిష్కరించి అమరులకు సంతాపం తెలిపారు. అనంతరం విజయరాఘవన్‌ మాట్లాడుతూ... మోదీ, అమిత్‌షా పాలనను, వారి ప్రజావ్యతిరేక చర్యలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వామపక్ష పాలనలో ఉన్న కేరళ అభివృద్ధిలో నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు.

75 ఏళ్ల ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరుపుతున్న సమయంలో ఆకలి దేశంగా భారత్‌ మారుతోందని, ప్రపంచంలో భారత్‌ 107వ స్థానంలో నిలవడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ మహిళలపై అకృత్యాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ముదిగొండ భూపోరాటంలో ఏడుగురు ప్రాణత్యాగం చేయడం మరువలేనిదన్నారు. ఆహ్వానసంఘం అధ్యక్షుడు డాక్టర్‌ యలమంచిలి రవీంద్రనాథ్‌ ప్రసంగిస్తూ దేశంలో ప్రతి ఒక్కరూ వ్యవసాయ కార్మికుల సమస్యల పట్ల అంకితభావంతో పనిచేయాలని, రైతు, కార్మిక ఉద్యమాల్లో చురుగ్గా నిలబడాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల పని అయిపోయిందనే వారికి ఖమ్మం సభ కనువిప్పు అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ దున్నే వాడిదే భూమి అని వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపకులు పుచ్చలపల్లి సుందరయ్య ఇచ్చిన పిలుపును విస్మరించి నేటి పాలకులు కార్పొరేట్‌ శక్తులకు భూమి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిజమైన అన్నదాత అంటే వ్యవసాయ కార్మికుడేనని, వారి కోసం ప్రత్యేకచట్టం ఉండాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T04:33:21+05:30 IST

Read more