అకారణంగా జైలులో ఉంచడం.. వ్యక్తుల స్వేచ్ఛను హరించడమే

ABN , First Publish Date - 2022-12-31T04:52:11+05:30 IST

అకారణంగా వ్యక్తులను జైలులో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

అకారణంగా జైలులో ఉంచడం.. వ్యక్తుల స్వేచ్ఛను హరించడమే

యాంత్రికంగా బెయిళ్లను తిరస్కరించొద్దు: సీజేఐ చంద్రచూడ్‌

హైదరాబాద్‌/అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): అకారణంగా వ్యక్తులను జైలులో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. న్యాయాధికారుల శిక్షణ నిమిత్తం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఏర్పాటుచేసిన ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడుతూ... బెయిల్‌ మంజూరు చేసే విషయంలో కింది కోర్టులు భయపడి, యాంత్రికంగా ఆ పిటిషన్లను తిరస్కరిస్తున్నాయని, కింది కోర్టులు బెయిల్‌ ఇవ్వడాన్ని హైకోర్టులు తప్పుబడుతుండటమే ఇందుకు ముఖ్య కారణమని చెప్పారు. కింది కోర్టుల్లో ఉపశమనం లభించేందుకు అవకాశం ఉన్నా, అక్కడ తిరస్కరించడంతో కక్షిదారులు ఉన్నత న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, అవకాశం ఉన్న కేసులకు బెయిళ్లు మంజూరు చేయాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచించారు. ప్రజలు మొదట న్యాయవ్యవస్థతో సంభాషించగలిగేది జిల్లా కోర్టుల ద్వారా మాత్రమే అనేది గుర్తుంచుకోవాలని, రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత హైకోర్టులు, సుప్రీంకోర్టులతోపాటు జిల్లా కోర్టులకు కూడా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. న్యాయమూర్తి అంటే చట్టనిబంధనలను అనుసరించి తీర్పులు వెల్లడించడం మాత్రమే కాదని, మానవజీవితాన్ని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమేనని తెలిపారు. సమాజాన్ని సరైన విధానంలో అర్థం చేసుకున్నప్పుడే న్యాయమూర్తులుగా మనం ఎలా వ్యవహారించాలో తెలుసుకోగలుగుతామని స్పష్టం చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు ధరించే తెలుపు, నలుపు దుస్తులు వైరుధ్యానికి సూచికలన్నారు.

Updated Date - 2022-12-31T04:52:12+05:30 IST