ఆన్‌లైన్‌ దళిత బంధు!

ABN , First Publish Date - 2022-12-30T03:20:49+05:30 IST

దళితబంధు పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఇకపై విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆన్‌లైన్‌ దళిత బంధు!

రెండో విడత దరఖాస్తులకు కొత్త పద్ధతి

ప్రత్యేక వెబ్‌సైట్‌, యాప్‌ రూపకల్పన

మండల అధికారుల ప్రమేయం ఉండదు

నేరుగా కలెక్టర్‌ కార్యాలయంలో పరిశీలన

బ్రోకర్లు, అవినీతి లేకుండా ఉండేందుకే..

లబ్ధిదారుల ఖాతాల్లోకి దశల వారీగా డబ్బు

వారికి స్మార్ట్‌ ఫోన్లు!.. వాటితో యూనిట్ల

సమాచారం అనుసంధానం

సంక్రాంతి తర్వాత రెండో విడత అమలు?

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): దళితబంధు పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఇకపై విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం మొదటి దశ అమలులో అవినీతి జరిగిందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అర్హులైన నిరుపేదలకు కాకుండా అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులను ఎంపిక చేశారని, కొంతమంది ఎమ్మెల్యేల అనుచరులు డబ్బులు తీసుకుని అనర్హులను జాబితాలో చేర్చారంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ పథకంలో లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున అందించే ఆర్థిక సహాయం నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారని ప్రచారం జరిగింది. దళితబంధు అమలులో ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండరాదని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న రెండో దశలో మాన్యువల్‌ విధానంలో కాకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ప్రత్యేక ఫార్మాట్‌లో దరఖాస్తులు స్వీకరించి, మొదట మండలస్థాయి అధికారులు, తర్వాత కలెక్టర్‌ కార్యాలయ అధికారుల పరిశీలన అనంతరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమోదంతో జాబితా రూపొందించే వారు.

దానికి జిల్లా మంత్రి ఆమోదం అవసరమయ్యేది. కానీ రెండో దశలో అలాంటి పరిస్థితి లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీనికి ప్రత్యేక వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ బాధ్యతను సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్‌ కార్యాలయ అధికారులు పరిశీలించి, జాబితా రూపొందిస్తారు. అయితే అర్హుల జాబితా ఖరారులో కలెక్టర్ల నిర్ణయమే ఫైనలా, లేక మంత్రులకు అవకాశం కల్పిస్తారా అన్న అంశాన్ని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల ఖాతాలోకి ఆర్థిక సహాయాన్ని దశల వారీగా జమ చేస్తారు. రెండో దశలో ప్రతి నియోజకవర్గం నుంచి 1500 మందిని పథకానికి ఎంపిక చేయాలని ప్రభుత్వం మొదట భావించినా తర్వాత 500కు తగ్గించింది. ఇటీవల జరిగిన అత్యుతన్నత స్థాయి సమావేశంలో దాన్ని మరింత తగ్గించి, 200కే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిరుపేద దళిత కుటుంబాలకే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఇటీవల పార్టీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలకు సూచించారు.

స్మార్ట్‌ ఫోన్‌తో అనుసంధానం!

దళితబంధు మొదటి దశలో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఇకపై లబ్ధిదారులు ఏర్పాటు చేసే యూనిట్లపై నిరంతర నిఘా కొనసాగించేలా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా యూనిట్‌ ఏర్పాటు సమయంలోనే ప్రతి లబ్ధిదారుడికి స్మార్ట్‌ ఫోన్‌ ఇప్పించాలని నిర్ణయించారు. అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారులు ప్రతి వారం తమ వ్యాపార లావాదేవీలు, లాభ నష్టాలు, ఇతర సమాచారాన్ని స్మార్ట్‌ ఫోన్‌లో అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుడు, సంబంధిత అధికారుల్ని స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా అనుసంధానం చేయడం వల్ల నిరంతర పర్యవేక్షణకు ఆస్కారం ఉంటుందని ఉన్నతాధికారుల ఆలోచన. దీంతో పాటు అవసరాన్ని బట్టి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ పరిస్థితి తెలుసుకుంటారు. ప్రతి లబ్ధిదారుడికి అతని ఫొటో, క్యూఆర్‌ కోడ్‌తో స్మార్ట్‌ కార్డు తయారుచేయించి ఇస్తారు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజు నుంచి జరిగిన లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు.

సంక్రాంతి తరువాత రెండో విడత!

2022-23 ఆర్ధిక సంవత్సరం మరో రెండు నెలల్లో పూర్తికావస్తున్నా ఇప్పటికీ రెండో విడత దళితబంధు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం మొదటి విడతలో మంజూరు జరిగి పెండింగ్‌లో ఉన్న యూనిట్లను అందిస్తున్నారు. సంక్రాంతి తరువాత నుంచి రెండో విడత ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే... దళితబంధు రెండో విడతకు సంబంధించి కొన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులే దరఖాస్తులు తీసుకుంటుండడం విశేషం.

Updated Date - 2022-12-30T03:20:50+05:30 IST