‘మా ట్రాక్టర్లు ఆపితే.. అంతు చూస్తాం’

ABN , First Publish Date - 2022-12-31T04:40:11+05:30 IST

కామారెడ్డి జిల్లాలో అధికార బీఆర్‌ఎస్‌ నేతల కన్నుసన్నల్లో ఉన్న ఇసుక మాఫియా రెచ్చిపోయింది.

‘మా ట్రాక్టర్లు ఆపితే.. అంతు చూస్తాం’

బీర్కూర్‌లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా

ట్రాక్టర్లను అడ్డుకున్న మహిళా ఎస్సై, ఏఎస్సైకి బీఆర్‌ఎస్‌ నేతల బెదిరింపులు

బీర్కూర్‌, డిసెంబరు 30 : కామారెడ్డి జిల్లాలో అధికార బీఆర్‌ఎస్‌ నేతల కన్నుసన్నల్లో ఉన్న ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అనుమతులు లేకుండా ఇసుకను తీసుకెళ్తున్న ట్రాక్టర్లను అడ్డగించిన మహిళా ఎస్సై, ఏఎస్సైలపై బెదిరింపులకు పాల్పడింది. ఇంకోసారి తమ బండ్లు ఆపితే అంతు చూస్తామని హెచ్చరించిన అధికార పార్టీ నేతలు కొందరు ఇసుక ట్రాక్టర్లను తీసుకెళ్లిపోయారు. కామారెడ్డి జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. జిల్లాలోని బీర్కూర్‌ శివారులోని మంజీరా నది నుంచి అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు శుక్రవారం వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలింపు చేపట్టారు. దీనిపై స్థానిక రైతులు చేసిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందుకున్న బీర్కూర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. బీర్కూర్‌ ఇన్‌చార్జి ఎస్సై విజయమ్మ, ఏఎస్సై సీతారామమ్మ తమ పోలీసుస్టేషన్‌ ఎదుట సుమారు 70 ట్రాక్టర్లను అడ్డుకుని నిలిపివేశారు. అనుమతులు లేకుండా ఇసుకను ఎలా తరలిస్తున్నారంటూ డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ట్రాక్టర్‌ యజమానులు, అధికార పార్టీ నాయకులు వెంటనే పోలీసు స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రెండు గంటల పాటు హంగామా చేశారు. ఏ అధికారంతో తమ ట్రాక్టర్లను ఆపారని పోలీసులను ప్రశ్నించారు. టిప్పర్లలో ఇసుక తరలిస్తుంటే ఆపరు కానీ తమ ట్రాక్టర్లను ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. అనుమతితోనే టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారని, అక్రమంగా ఇసుక తరలించడం చట్టవిరుద్ధమని పోలీసులు చెప్పినా లెక్కచేయలేదు. పైగా, తమ ట్రాక్టర్లను ఆపొద్దని, ఒకవేళ ఆపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖాకీలను బెదిరించారు. ఆపై ట్రాక్టర్లను తీసుకెళ్లిపోయారు. అసలే బీఆర్‌ఎస్‌ నేతలు కావడం.. ఆపై తెర వెనుక ‘అధికార’ ఒత్తిళ్లు ఉండడంతో పోలీసులు ఏం చేయకుండా ఉండిపోయారు.

Updated Date - 2022-12-31T04:40:11+05:30 IST

Read more