Hyderabad: హైదరాబాద్‌లో మెట్రో స్టేషన్ల పైకప్పులను ఎప్పుడైనా గమనించారా.. మెట్రో ట్రైన్ బ్రేక్ వేసినప్పుడు ఏమౌతుందంటే..

ABN , First Publish Date - 2022-10-06T03:31:57+05:30 IST

నగరవాసులకు మెరుగైన, వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తున్న హైదరాబాద్‌ మెట్రో, ఎల్‌అండ్‌టీ సంస్థలు సంప్రదాయ ఇంధన వనరులపై..

Hyderabad: హైదరాబాద్‌లో మెట్రో స్టేషన్ల పైకప్పులను ఎప్పుడైనా గమనించారా.. మెట్రో ట్రైన్ బ్రేక్ వేసినప్పుడు ఏమౌతుందంటే..

మెట్రోలో సోలార్‌ పవర్‌

సంప్రదాయ ఇంధన వనరులపై ఎల్‌అండ్‌టీ ప్రత్యేక దృష్టి 

డిపోలు, స్టేషన్ల నుంచి 8.35 మెగావాట్ల ఉత్పత్తి

విద్యుత్‌ అవసరాల్లో 15 శాతం ఇందులో నుంచి వినియోగం

భూగర్భ జలాల పెంపునకు నీటి గుంతలూ ఏర్పాటు 


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరవాసులకు మెరుగైన, వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తున్న హైదరాబాద్‌ మెట్రో, ఎల్‌అండ్‌టీ సంస్థలు సంప్రదాయ ఇంధన వనరులపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా సౌరశక్తి ఉత్పాదనను క్రమేపీ పెంచుకుంటూ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థిరమైన కార్యకలాపాలను అవలంబిస్తూ పరోక్ష ప్రయోజనాలు పొందుతూ ముందుకుసాగుతూ ఇతర రంగాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జంట నగరాల పరిధిలోని మూడు కారిడార్లలోని 62.8 కిలోమీటర్ల మార్గంలో ప్రస్తుతం మెట్రో రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లు రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా తిరుగుతూ విభిన్న వర్గాల ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. అయితే ఓ వైపు నగర రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో రైలు సంస్థ సౌరశక్తి ఉత్పాదనను సైతం మెరుగుపరుచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధానంగా నగరంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తనవంతుగా కృషి చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.


డిపోల్లో 8.35 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి..

నగర పరిధిలోని ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌, నాగోలు-రాయదుర్గం కారిడార్లలో 57 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల గుండా ప్రతి రోజు 860కి పైగా ట్రిప్పులు నడుస్తుంటాయి. అయితే హైదరాబాద్‌ మెట్రో రైలుకు నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం తెలంగాణ స్టేట్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ అన్ని చర్యలు తీసుకుంటోంది. మెట్రో రైలు సంస్థ నిర్వహణకు రోజుకు గరిష్ఠ విద్యుత్‌ సుమారు 125 మెగావాట్లు ఉంటుంది. కాగా, రైళ్లు, ఆపరేటింగ్‌ స్టేషన్ల కోసం రోజుకు సుమారు 7.63 లక్షల కిలోవాట్‌ గంటలు/యూనిట్లు వినియోగమవుతోంది. కారిడార్‌-1 ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, కారిడార్‌-3 నాగోలు-రాయదుర్గం మార్గంలో ఒక్కో ట్రిప్పునకు 450 కిలోవాట్‌ గంటలు, కారిడార్‌-3 జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ రూట్‌లో 300 కిలోవాట్‌ గంటలను వాడుతుంటారు. అయితే ఆయా కారిడార్లలో పెద్ద మొత్తంలో వినియోగిస్తున్న విద్యుత్‌ను తగ్గించుకునేందుకు మెట్రో రైల్‌, ఎల్‌అండ్‌టీ సంస్థలు సౌరశక్తి ఉత్పాదనపై దృష్టి సారించాయు. ఈ క్రమంలో 28 మెట్రో స్టేషన్ల పైకప్పులు, ఉప్పల్‌, మియాపూర్‌ డిపోల్లో ఖాళీ ప్రదేశాల్లో ఏటా 8.35 మెగావాట్లకు పైగా క్యాప్టివ్‌ సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. కాగా, 28 మెట్రో స్టేషన్లు, కార్యాలయాల్లో వినియోగించే విద్యుత్‌ అవసరాల్లో 15 శాతం సౌరశక్తి ద్వారానే పొందుతుండడం గమనార్హం. ఆయా ప్రాంతాల్లో ఏడాదికి 10 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌..

మెట్రో స్టేషన్ల పైకప్పులపై ఏర్పాటు చేసిన సౌరశక్తి ప్లాంట్లతోపాటు మెట్రో రైళ్లలో బ్రేకులు వేసినప్పుడు ఉత్పన్నమయ్యే బలంతో విద్యుత్‌ ఉత్పత్తి రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ను కూడా వినియోగిస్తున్నారు. పునరుత్పత్తి బ్రేకింగ్‌ సిస్టమ్‌ అనేది అత్యాధునిక కన్వ ర్టర్‌, ఇన్వర్టర్‌ ఆధారిత ప్రొపల్షన్‌ సిస్టమ్‌. ఇది పునరుత్పత్తి బ్రేకింగ్‌ ద్వారా అందుకున్న 35 శాతం శక్తిని తిరిగి మూలానికి పంప్‌ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఏడాదికి ఇది 25 మిలియన్‌ యూనిట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌ మెట్రో రైలు 20 స్టేషన్లు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీ బీసీ), లీడర్‌షిప్‌ ఇన్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ డిజైన్‌) ప్లాటినం సర్టిఫికెట్‌ పొందడం గమనార్హం. కాగా, హైదరాబాద్‌ మెట్రో రైలు నీటిని సంరక్షించేందుకు, భూగర్భ జలాల స్థాయిని పునరుద్ధరించేందుకు అనేక నీటి గుంతలను కూడా కలిగి ఉన్నాయని అధికారులు తెలిపారు. సౌర విద్యుత్‌ వినియోగంతో నిర్వహణ ఖర్చుల్లో కొంత ఆదా చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

Read more