జీహెచ్ఎంసీఅద్దె మోజు
ABN , First Publish Date - 2022-10-17T15:51:23+05:30 IST
జీహెచ్ఎంసీ అద్దెలు చెల్లించడానికే ప్రాధాన్యం ఇస్తోంది. సొంత వనరులను నిర్వీర్యం చేసి ప్రైవేట్ సంస్థల సేవల కోసం అధికారులు
మరిన్ని స్వీపింగ్ యంత్రాల వినియోగానికి యోచన
కాలం చెల్లాయంటూ సంస్థ వాహనాలు తొలగించాలని నిర్ణయం
కాసుల కక్కుర్తా..? మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసమా..?
ఇప్పటికే 18 వాహనాలు అద్దెకు ..
వాటి పనితీరుపై తీవ్ర విమర్శలు
హైదరాబాద్ సిటీ: జీహెచ్ఎంసీ అద్దెలు చెల్లించడానికే ప్రాధాన్యం ఇస్తోంది. సొంత వనరులను నిర్వీర్యం చేసి ప్రైవేట్ సంస్థల సేవల కోసం అధికారులు పరితపిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాలు లక్ష్యంగా నిర్వహణ, ఇతరత్రా బాధ్యతల నుంచి బల్దియాను తప్పించేందుకు యంత్రాంగం అమితాసక్తి చూపుతోంది. ఇప్పటికే చెత్త తరలింపు, శాస్ర్తీయ నిల్వ, నిర్వహణ, సెకండరీ కలెక్షన్ బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. ప్రధాన రహదారుల స్వీపింగ్ కూడా అద్దె యంత్రాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు వినియోగంలో ఉన్న సంస్థకు చెందిన వాహనాలను తొలగించి.. మరిన్ని అద్దె యంత్రాలు తీసుకోవాలని తాజాగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ కోసం కసరత్తు మొదలైంది. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందన్న భ్రమ కల్పించేలా.. టెండర్లు ప్రకటించి, బిడ్లు ఆహ్వానించి ఏజెన్సీలను ఎంపిక చేస్తున్నా మని చెబుతుంటారు. వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి వారికి కావాల్సిన/ కాసులిచ్చే ఏజెన్సీలను అంతిమంగా ఎంపిక చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. గతంలోనూ అదే జరిగిందని సంస్థలోని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు.
ఏటా రూ.35 కోట్ల వరకు...
గ్రేటర్ పరిధిలోని ప్రధాన రహదారులపై రాత్రి వేళ యంత్రాల ద్వారా స్వీపింగ్ చేస్తుంటారు. జీహెచ్ఎంసీకి సంబంధించి పెద్ద స్వీపింగ్ యంత్రాలు ఐదు, చిన్న యంత్రాలు 12 ఉన్నాయి. మరో 18 యంత్రాలు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. మూడేళ్ల కాల వ్యవధిలో యేడాదిన్నర క్రితం ఈ వాహనాల అద్దె ఒప్పందం చేసుకున్నారు. ఇందుకుగాను యేటా రూ.30-35 కోట్లు ఖర్చువుతోంది. కాంప్రహెన్సీవ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ)లో భాగంగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించిన 820 కి.మీల రోడ్లపై స్వీపింగ్ బాధ్యతలు ఆయా సంస్థలకే అప్పగించారు. సదరు ఏజెన్సీలే యంత్రాలను ఏర్పాటు చేసి స్వీపింగ్ చేస్తున్నాయి. కాలనీలు, బస్తీల్లోని రోడ్లను కార్మికులు ఊడుస్తుండగా.. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రహదారులపై యంత్రాలతో స్వీపింగ్ చేస్తున్నారు. రాత్రి వేళ కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారన్న ఉద్దేశంతో యంత్రాల వినియోగం ప్రారంభించారు. సంస్థకు చెందిన స్వీపింగ్ యంత్రాలను కాలం చెల్లాయంటూ తుక్కుగా విక్రయించాలని నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు. వాటి స్థానంలో అద్దె వాహనాల వినియోగం కోసం త్వరలో టెండర్ నోటిఫికేషన్ ప్రకటించనున్నట్టు చెప్పారు. గతంలో చెత్త తరలింపు వాహనాలను తొలగించి.. అద్దె వాహనాలు వినియోగించారు. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికారులకు కావాల్సిన, గత పాలకమండలి సభ్యుల్లో కొందరి బినామీలకు చెందిన వాహనాలు అద్దెకు నడిపించారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం వినియోగిస్తోన్న స్వీపింగ్ యంత్రాలూ.. అధికారిక అండదండలున్న వారివే అన్నది బహిరంగ రహస్యం. మరిన్ని వాహనాలనూ అద్దె ప్రతిపాదికన వినియోగించడం ద్వారా ఆ సంస్థలకు మరింత లబ్ధి చేకూర్చే ప్రయత్నమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పర్యవేక్షణ లేదు.. పైసలిస్తరు...
ప్రస్తుతం రహదారులపై రాత్రి వేళ తిరుగుతోన్న ఏ స్వీపింగ్ యంత్రమూ సరిగా పని చేయడం లేదు. ఒక్కో మిషన్‌కు నాలుగు బుష్‌లు ఉండగా.. ఒకటి, రెండు మినహా పని చేయవు. గంటకు ఆరు కి.మీల చొప్పున నిత్యం 60 కి.మీల మేర యంత్రాలు స్వీపింగ్ చేయాలి. కానీ, మెజార్టీ యంత్రాలు 30-40 కి.మీలకు మించి రోడ్లు ఊడవడం లేదు. అయినా పట్టించుకోని ఉన్నతాధికారులు.. ఠంచనుగా ప్రతి నెలా బిల్లులు మాత్రం చెల్లిస్తున్నారు. బిల్లుల చెల్లింపు అధికారం జోనల్ కార్యాలయాలకు బదలాయించిన అనంతరం అవినీతి అధికమైందని చెబుతున్నారు. పారిశుధ్య నిర్వహణ పర్యవేక్షించి కొందరు ఏఎంఓహెచ్‌లు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు యంత్రాల పని తీరును సర్టిఫై చేస్తున్నారు. పూర్తిస్థాయి బిల్లు వచ్చేలా సహకరిస్తోన్న ఆ అధికారులకు తమ వంతు వాటాలు దక్కుతున్నట్టు సమాచారం. మరిన్ని యంత్రాలు అద్దెకు తీసుకుంటే యేటా ఖర్చు రూ.40 కోట్లకు పెరుగనుంది. స్వీపింగ్ యంత్రాలు సరిగా పని చేస్తున్నాయా..? లేదా..? అన్నది పర్యవేక్షించేందుకు సెన్సార్లు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. ఏజెన్సీలు ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. దీంతో యంత్రాలు తిరిగినవే కి.మీలు.. ఊడ్చినవే రోడ్లు అన్న చందంగా పరిస్థితి మారింది.