గుట్టుగా గుట్కా పట్టుకుంటున్నా..తగ్గట్లే

ABN , First Publish Date - 2022-03-23T17:39:30+05:30 IST

గుట్కా ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం విధించినా, విక్రయాలు మాత్రం తగ్గడంలేదు. పోలీసులు దాడులు చేసి రూ. లక్షల విలువైన గుట్కా ఉత్పత్తులు పట్టుకుంటున్నా.. కొందరు అక్రమ

గుట్టుగా గుట్కా  పట్టుకుంటున్నా..తగ్గట్లే

 పొరుగు రాష్ట్రం నుంచి దిగుమతి  

కాసులు  కురిపిస్తున్న వ్యాపారం


హైదరాబాద్‌ సిటీ : గుట్కా ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం విధించినా, విక్రయాలు మాత్రం తగ్గడంలేదు. పోలీసులు దాడులు చేసి రూ. లక్షల విలువైన గుట్కా ఉత్పత్తులు పట్టుకుంటున్నా.. కొందరు అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. నిషేధం కారణంగా రూ.2కు దొరికే గుట్కా రూ. 10లకు అమ్ముడవుతూ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో మూడు గుట్కాలు, ఆరు జర్దాలుగా వ్యాపారం కొనసాగుతోంది. చిన్న కిరాణా దుకాణాలు, పాన్‌షాపుల నిర్వాహకులు అధిక లాభం కోసం గుట్కా విక్రయాలు చేపడుతున్నారు.  కర్నాటకలోని బీదర్‌ నుంచి అక్రమంగా రాత్రికి రాత్రే తరలించి గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. నమ్మకస్తులైన వ్యాపారులకు మాత్రమే విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నగరానికి బీదర్‌ కేవలం 150 కిలోమీటర్ల దూరం ఉండటం, అక్కడ గుట్కా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉండటం వ్యాపారులకు కలిసి వస్తోంది. పోలీసుల కన్నుగప్పి రాత్రి సమయంలో వాహనాలతో బీదర్‌ వెళ్లి, తెల్లవారేలోగా సరుకును నగరంలోకి చేరుస్తున్నారు. గుట్కా విక్రయిస్తున్న చిన్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, గుట్కా రాకెట్‌ నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. 


నగర శివార్లలో  తగ్గిన తయారీ 

రాష్ట్రంలో గుట్కాపై నిషేధం ప్రారంభమైన తరుణంలో కొంతమంది నగర శివార్లలో తయారీ కేంద్రాలు నెలకొల్పారు. పోలీసులు గుట్కా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేయడంతో దాదాపు తయారీని నిలిపివేశారు. దాడులు పెరగడం, ముడి సరుకు కొనుగోలుపై నిఘా వంటి కారణాలకు తోడు దగ్గరలో ఉన్న బీదర్‌ నుంచి సరుకు అందుబాటులోకి రావడంతో నగర శివార్లలో గుట్కా తయారీ దాదాపుగా బంద్‌ అయింది. కర్నాటకలో గుట్కాపై నిషేధం లేకపోవడంతో బీదర్‌ ప్రాంతంలో ఇబ్బడిమబ్బడిగా తయారీ పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ తయారైన గుట్కా ఉత్పత్తులు సగానికిపైగా నగరానికి, ఇతర ప్రాంతాలకు చేరుతున్నాయి. బీదర్‌ నుంచి ప్రతిరోజూ లారీలు, డీసీఎం, కార్లలో గుట్కా ఉత్పత్తులు నగరానికి చేరుతున్నాయి. బీదర్‌కు సమీప ప్రాంతాల్లో ఉండేవారు బైకులపై కూడా వాటిని తరలిస్తున్నారు.


కోట్ల కొద్దీ సరుకు పట్టుకున్నా బేఖాతర్‌

బీదర్‌లో పరిశ్రమల నిర్వాహకులు గుట్కాను పెద్ద మొత్తంలో తయారు చేస్తుండడంతో వారికి ప్రతి ప్యాకెట్‌కు రూ.1.50 నుంచి రూ.2 ఖర్చు అవుతోంది. రెండింతలు చెల్లించి తెలంగాణ వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. రవాణా, గోదాం ఖర్చులు కలిపి ప్యాకెట్‌ రూ. 6నుంచి రూ. 7 వరకు దుకాణదారులకు విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన గుట్కాను కస్టమర్లకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఒకసారి పట్టుబడినా, గుట్కా అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయం ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు తిరిగి దందాను ప్రారంభిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి రూ.కోట్ల కొద్దీ సరుకును సీజ్‌ చేస్తున్నా, వెంటనే మరోవైపు నుంచి గుట్కా తెప్పించి విక్రయిస్తూ నష్టాన్ని పూడ్చుకుంటున్నారు.

Read more