గంటలో ఇల్లు చక్కబెట్టేశాడు..నాలుగు గంటల్లో పట్టేశారు..!

ABN , First Publish Date - 2022-01-28T16:04:46+05:30 IST

ఇంటికి తాళం వేసి అందరూ ఫంక్షన్‌కు వెళ్లారు. సరిగ్గా గంటలోనే తిరిగి వచ్చారు. ఈ లోపే ఇల్లును గుల్ల చేశాడో ఘరానా దొంగ. మొత్తం 26 తులాల..

గంటలో ఇల్లు చక్కబెట్టేశాడు..నాలుగు గంటల్లో పట్టేశారు..!

 26 తులాల బంగారం సహా..  13.10లక్షల సొత్తు చోరీ  

 చోరీ సొత్తుతో కొత్త ఫోన్‌, వస్త్రాల కొనుగోలు  

 ఘరానా దొంగ అరెస్ట్‌  


హైదరాబాద్‌ సిటీ: ఇంటికి తాళం వేసి అందరూ ఫంక్షన్‌కు వెళ్లారు. సరిగ్గా గంటలోనే తిరిగి వచ్చారు. ఈ లోపే ఇల్లును గుల్ల చేశాడో ఘరానా దొంగ. మొత్తం 26 తులాల బంగారం, కొంత నగదు చోరీ చేశాడు. చోరీ సొత్తుతో కొత్త ఫోన్‌, వస్త్రాలు కొనుగోలు చేశాడు. సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేవలం 4 గంటల్లోనే నిందితుడి ఆటకట్టించారు. చోరీ చేసిన సొత్తును వందశాతం రికవరీ చేశారు. ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, రాచకొండ క్రైమ్స్‌ డీసీపీ యాదగిరి, ఏసీపీలు పురుషోత్తంరెడ్డి, శ్రీధర్‌రెడ్డిలతో కలిసి వివరాలు వెల్లడించారు.


బడంగ్‌పేట సత్యనారాయణపురానికి చెందిన కట్టెకోల రత్నకుమార్‌ రిటైర్డ్‌ ఉద్యోగి. అదే కాలనీలో తన బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్‌కు బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. గంటలో ఫంక్షన్‌ ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తాళం పగులగొట్టిన దొంగలు లోపలికి ప్రవేశించి, ఇంట్లో ఉన్న కాసులపేరు, నెక్లెస్‌, చేతి గాజులు, చైన్‌ సహా మొత్తం 26 తులాల బంగారం, 2.5 తులాల వెండి, కొంత నగదు దోచేశారు. దాంతో వెంటనే బాధితులు మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. 


సీసీ ఫుటేజీల ద్వారా..

రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి అతను పాత నేరస్థుడనే అంచనాకు వచ్చారు. మీర్‌పేట పాత విలేజ్‌కు చెందిన కొడిదెల సుఽధాకర్‌గా పోలీసులు అనుమానించి అతడి కోసం గాలించారు. చోరీచేసిన సొత్తులోని నగదుతో కొత్త సెల్‌ఫోన్‌ కొనుగోలు చేశాడు. వస్త్రాలు కొనేందుకు షాపింగ్‌కు వెళ్లినట్లు గుర్తించి అతన్ని పట్టుకున్నారు. చోరీకి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. చోరీ చేసిన మొత్తం సొత్తును పోలీసులు రికవరీ చేశారు. 


తల్లిని చంపి జైలుకు.. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా రేవెళ్ల మండలం గుడిపల్లికి చెందిన సుధాకర్‌ పాతనేరస్థుడు. ఇతనిపై  ఇప్పటికే నాగర్‌కర్నూల్‌, మీర్‌పేట, ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలు కేసులున్నాయి. గతేడాది తల్లిని చంపిన కేసులో జైలుకు వెళ్లాడు. చర్లపల్లి జైల్లో ఉన్న సుధాకర్‌ ఈనెల 7న బెయిల్‌పై విడుదలయ్యాడు. బయటకు వచ్చిన 20 రోజుల్లోనే తాళం వేసిన ఇంటిని గుల్ల చేసి మీర్‌పేట పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న మీర్‌పేట పోలీసులను సీపీ అభినందించినట్లు డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించారు. సిబ్బందికి రివార్డులు అందజేశారు. చోరీ చేసిన ఘరానా దొంగను కేవలం 4 గంటల్లోనే పట్టుకుని, సొత్తును స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులకు బాధితులు కట్టెకోల రత్నాకర్‌ రావు, ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Read more