Hyderabad City: దళారుల దందా..!

ABN , First Publish Date - 2022-12-12T12:38:53+05:30 IST

ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని గుడిసెలు, ఇళ్లు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలను కొందరు

Hyderabad City: దళారుల దందా..!

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ చేయిస్తామని వసూళ్లు

రూ.15-20 వేలు ఇవ్వాలని డిమాండ్‌

లేనిపక్షంలో పట్టాలు రావని బెదిరింపులు

ముగిసిన క్షేత్రస్థాయి విచారణ

అప్పులు చేసి అడిగినంతా చెల్లిస్తున్న నిరుపేదలు

హైదరాబాద్‌ సిటీ: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని గుడిసెలు, ఇళ్లు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలను కొందరు దళారులు పీడిస్తున్నారు. స్థలాలకు సంబంధించిన దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియ చివరి దశకు చేరిన నేపథ్యంలో అడిగినంత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరో నెలలోపు ప్రభుత్వం పట్టాలు జారీ చేస్తుందని.. ఈలోగా కొంతమొత్తం చెల్లిస్తే అధికారులతో పనులను పూర్తి చేయిస్తామని మభ్యపెడుతూ దండుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకుంటే పట్టాలు రావని, తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని పరోక్షంగా బెదిరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక చాలామంది అప్పు చేసి మరీ వారికి చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంది.

125 గజాలలోపు గుడిసెలు వేసుకుని జీవో 58 కింద దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన పేదలకు ప్రభుత్వం ఉచితంగా స్థలాలను క్రమబద్ధీకరించి పట్టాలు పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ పాత జీవో 58, 59లకు అనుబంధంగా కొత్త జీవోలను జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు 1.14 లక్షల పైగా కుటుంబాలు ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 71,316 వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 31,830, హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 11,675 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. జీవో 59 కింద అర్హత సాధిస్తే ప్రభుత్వ భూమి విలువ ఆధారంగా ఆక్రమిత స్థలాలను క్రమబద్ధీకరించనున్నారు. 126 నుంచి 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన భూమి విలువలో 25 శాతం, 251 నుంచి 500 గజాల వరకు 50, 500 నుంచి 1000 గజాల వరకు 75 శాతం, 1000 గజాలపైన పూర్తి విలువను దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంటుంది.

జీవో 58 దరఖాస్తుదారులే టార్గెట్‌..

దాదాపు తొమ్మిది నెలల క్రితం చేసుకున్న దరఖాస్తులను ఒక్కొక్కటిగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు అర్హుల జాబితాను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకుంది. మండలాల నుంచి జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులను పది రోజులుగా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన బృందాలు పరిశీలిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఆయా మండలాల్లో దళారులు రంగంలోకి దిగారు. జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్న వారి సమాచారం తెలుసుకుని నేరుగా వారి దగ్గరకు వెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత ప్రభుత్వం పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోందని, పట్టాలు కావాలంటే రూ.15-20 వేల ఖర్చవుతుందని చెబుతున్నారు.

డబ్బులు ఇచ్చిన వారి పేర్లే ఆన్‌లైన్‌లో ఉంటాయని, ఇవ్వని వారివి ఉండవని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లూ పట్టాలు లేకుండా ఇబ్బందులు పడ్డారని, కొంత నగదు చెల్లిస్తే దర్జాగా పట్టాలు వస్తాయని, తర్వాత పక్కా ఇల్లు కట్టుకోవచ్చని సూచిస్తున్నారు. ఇటీవల హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ పక్కన కైత్లాపూర్‌లో, నగర శివారులోని మల్లంపేటలో, సూరారంలో ప్రభుత్వ స్థలంలో గుడిసెలు, ఇల్లు కట్టుకున్న 25 మంది నుంచి రూ.20 వేల చొప్పున దళారులు వసూలు చేసినట్లు తెలిసింది. షేక్‌పేట్‌, నాంపల్లి, బండ్లగూడ మండలాల పరిధిలో కూడా వసూళ్ల పర్వం కొనసాగుతోంది.

Updated Date - 2022-12-12T12:38:56+05:30 IST