Hyderabad City: జోష్ పెంచేలాజోడో యాత్ర
ABN , First Publish Date - 2022-10-17T17:38:46+05:30 IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల చివర్లో గ్రేటర్ హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది. గ్రేటర్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడం
గ్రేటర్లో ఒకనాడు హస్తానిదే హవా. పాతబస్తీ మినహాయిస్తే చాలా సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే ఉండేవి. మారిన పరిస్థితుల్లో సీన్ రివర్స్ అయ్యింది. గత ఎన్నికల్లో పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. బల్దియా ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ స్థానాల్లోనూ విజయం సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పార్టీకి పునర్జీవం పోస్తుందని ఇక్కడి నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు నగరంలో భారత్ జోడో యాత్ర షెడ్యూల్ ఖరారు చేశారు.
హైదరాబాద్ సిటీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల చివర్లో గ్రేటర్ హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది. గ్రేటర్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడం లక్ష్యంగా రాహుల్ గాంధీ యాత్ర షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సాగే ఈ పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు చర్యలు చేపట్టారు. గ్రేటర్‌లోని ప్రతీ ఇంటికి కాంగ్రెస్ జోడో యాత్ర చేరే విధంగా కాంగ్రెస్ గ్రేటర్ నాయకత్వం కార్యాచరణ చేపట్టింది. భారత్ జోడోయాత్ర గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ నెల 31న ప్రారంభం కానుంది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం అక్కడే భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభకు నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలందరినీ తరలించేందుకు కాంగ్రెస్ ఇంటింటి కార్యక్రమానికి సిద్ధమైంది.
పది నియోజకవర్గాల మీదుగా..
గ్రేటర్ పరిధిలోని ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలైన చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్‌ల నుంచి పాదయాత్ర సాగనుంది. రాజేంద్రనగర్, బహదూర్‌పురా, చార్మినార్, గోషామహల్, నాంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరుల మీదుగా యాత్ర సాగనుంది. మొత్తం 60 కిలోమీటర్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గ్రేటర్లో పాదయాత్ర చేసేలా షెడ్యూల్ రూపొందించారు. యాత్ర కోసం ఇప్పటికే పార్టీ నాయకత్వం గ్రేటర్ హైదరాబాద్ కమిటీని సన్నద్ధం చేసింది. నగరంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, బ్లాక్‌లు, డివిజన్లవారీగా పాదయాత్ర సన్నాహక సమావేశాలు చేపట్టారు. పాదయాత్ర సాగే నియోజకవర్గాలే గాకుండా గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను కదిలించేందుకు సమయత్తమవుతున్నారు.