Vijay Simha Reddy: ఆ మహిళపై నేను ఇలాంటి దాడి చేయలేదు..
ABN , First Publish Date - 2022-09-21T18:25:11+05:30 IST
ఆ మహిళపై తాను ఇలాంటి దాడి చేయలేదని విజయ్ సింహారెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ (Hyderabad): టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ నేత అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై బీరు బాటిల్‌తో దాడి చేసినట్లు ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన విజయ్ సింహారెడ్డి (Vijay Simha Reddy).. ఆ మహిళపై వెస్ట్‌జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఆమెపై తాను ఇలాంటి దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఆ మహిళ, ఆమె భర్త సూరజ్‌తో కలిసి బాబా ఫసియుద్దీన్ తనపై కుట్ర చేశారని ఫిర్యాదు చేశారు. రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటి దుశ్చర్యకు దిగారని డీసీపీకి వివరించారు. ఆ ముగ్గురిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. డీసీపీని కలిసిన వారిలో విజయసింహారెడ్డితో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఉన్నారు.
పూర్తి వివరాలు...
టీఆర్‌ఎస్ నాయకుడు అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై బీరు బాటిల్‌తో దాడి చేసినట్లు ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళపై హత్యాయత్నానికి పాల్పడ్డ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అనుచరుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేర్వే రుగా పంజాగుట్ట పీఎస్ ముందు ఆందోళన నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట బీఎస్ మక్తాకు చెందిన బడుగు నిషా జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్ట్ వర్కర్. ఈ నెల 18న రాత్రి బేగంపేటలోని ఓ పబ్‌కు వెళ్లింది. అర్ధరాత్రి 12 ప్రాంతంలో పబ్ నుంచి బయటికి వచ్చిన ఆమెను స్నేహితుడు ఇంటి వద్ద దింపివెళ్లాడు. ఇంటికి వచ్చిన ఆమె భర్త సూరజ్ కుమార్ గోయల్‌కు ఫోన్ చేయగా కొంత సేపు తర్వాత వస్తానని చెప్పాడు. ఆమె తలుపులకు గడియ పెట్టుకోకుండానే ఇంటి లోపలికి వెళ్లింది. అదే సమయంలో ఆమె ఫేస్‌బుక్ స్నేహితుడు విజయ్ సింహ వాట్సాప్ వీడియో కాల్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అతడి ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసింది. కొద్ది ేసపటి తర్వాత అతడు నేరుగా ఆమె ఇంటికి వచ్చాడు. వెంట తెచ్చుకున్న బీర్ బాటిల్‌ను పక్కకు విసిరి, ఆమె జుట్టు, గొంతు పట్టుకుని దాడి చేశాడు. బీరు సీసా పగులగొట్టి గొంతు, చేతిపై పొడిచాడు. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తినని, తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించాడు. ఆమె గట్టిగా కేకలు పెట్టడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. నిషా భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడు డయల్ 100కి కాల్ చేసి, పోలీసుల సహకారంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. సోమవారం పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రా రెడ్డి ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. తన భార్యపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరుడిని అరెస్ట్ చేయాలని బాధితురాలి భర్త సూరజ్ కుమార్ డిమాండ్ చేశారు. కాగా, విజయసింహ సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా అతడు సంఘటన జరిగిన రాత్రి కూకట్‌పల్లిలో ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దాడి జరిగినట్టు బాధితురాలు ఆరోపిస్తున్నప్పటికీ అందులో వాస్తవమెంత అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడిని అరెస్ట్ చేయాలి..
మహిళపై దాడి, హత్యాయత్నానికి పాల్పడ్డ టీఆర్‌ఎస్ నేతను అరెస్ట్ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రా రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక నేతలతో కలిసి ఆయన పంజాగుట్ట పీఎస్ ముందు ఆందోళన నిర్వహించారు. ఖైరతాబాద్ నాయకుడు పల్లపు గోవర్థన్‌తో పాటు మరికొంతమంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కక్ష కట్టి కేసులో ఇరికించారు
బాబా ఫసియుద్దీన్ డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు తాను ఆయనకు పీఏగా ఉన్నానని, అతడి అక్రమాలు ఇష్టం లేక ఉద్యోగం మానేసి బోరబండలో టీఆర్‌ఎస్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ సింహారెడ్డి (డివిజన్ కో-ఆర్డినేటర్) తెలిపారు. మహిళపై హత్యాయత్నం చేసినట్లు వస్తున్న వదంతులు నిజం కాదన్నారు. ఆ సమయంలో తాను అక్కడ లేనన్నారు. బాబా ఫసియుద్దీన్ తనపై కుట్రపూరిత వ్యవహారం చేయించారని ఆరోపించారు.