‘డబుల్‌’ దరఖాస్తుల్లో కదలిక..!

ABN , First Publish Date - 2022-08-04T05:49:16+05:30 IST

గ్రేటర్‌ పరిఽధిలో రెండు పడకల ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న వారు అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ కోరింది.

‘డబుల్‌’ దరఖాస్తుల్లో కదలిక..!
ఇంటి కోసం దరఖాస్తు చేయడానికి వచ్చిన పేదలు (ఫైల్‌)

దరఖాస్తుదారుల చిరునామాలకు అధికారులు

అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచన

రిజర్వేషన్‌ కేటగిరీ, ఓటర్‌ గుర్తింపు కార్డు తదితర వివరాల సేకరణ

 మెజార్టీ ప్రాంతాల్లో పాత అడ్ర్‌సల్లో లేని  దరఖాస్తుదారులు

చిరునామా మారిన వారి పరిస్థితేంటి..? 


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ పరిఽధిలో రెండు పడకల ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న వారు అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ కోరింది. నాడు సమర్పించిన దరఖాస్తుల్లో రిజర్వేషన్‌ కేటగిరీ, అసెంబ్లీ నియోజకవర్గం, ఓటర్‌ గుర్తింపు కార్డు(ఎపిక్‌) వివరాలు లేవు. పారదర్శకంగా కేటాయింపు జరిగేలా ఆయా వివరాలు సేకరించాలని సంస్థ నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో దరఖాస్తుల్లో పొందుపర్చిన చిరునామాకు వెళ్లి జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది వివరాలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. చాలా చోట్ల దరఖాస్తుదారులు అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడంతో అధికారులు స్పందించారు. పౌరులకు సమాచారం తెలిసేలా బుధవారం ప్రకటన విడుదల చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని గతంలో పేర్కొన్న చిరునామాల్లో దరఖాస్తుదారులు అందుబాటులో ఉండాలని, సిబ్బంది అడిగే వివరాలు ఇవ్వాలని కోరారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నగరంలో రెండు పడకల ఇళ్లకు దరఖాస్తుల జాతర సాగింది. మీ సేవా కేంద్రాలు, తహసీల్దార్‌, కలెక్టరేట్లలో ఆరు లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. నాటి నుంచి పక్కన పెట్టిన దరఖాస్తుల పరిశీలన ఇటీవల జీహెచ్‌ఎంసీలో ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను వేరు చేసి.. లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దరఖాస్తుదారుల పూర్తి వివరాలు సేకరించి అర్హత ఉన్న వారికి ఆత్మగౌరవ గృహాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మొదటి విడతగా ఒక్కో అసెంబ్లీ పరిధిలో 1000 మందికి ఇళ్లు ఇవ్వనున్నారు. గ్రేటర్‌లో లక్ష రెండు పడకల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టగా.. 98 వేల ఇళ్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 60 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇన్‌సిటు (అంతకుముందు ఉన్న గుడిసెలు, ఇళ్లు కూల్చి)లో నిర్మించిన ఇళ్లలో 5 వేలు లబ్ధిదారులకు కేటాయించారు. 

వారి పరిస్థితేంటి?

మహా నగరంలో అద్దె ఇళ్లల్లోనే మెజార్టీ కుటుంబాలు నివసిస్తుంటాయి. ఉపాధి, ఇతరత్రా అవసరాల నిమిత్తం చాలా మంది ఇళ్లు మారుతుంటారు. ఈ క్రమంలో చిరునామాలూ మారుతాయి. 2018లో రెండు పడకల ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన సమయంలో పొందుపర్చిన చిరునామాల్లో ఇప్పటికీ ఉంటోన్న వారు చాలా తక్కువ. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో లక్షలాది కుటుంబాలు సొంతూర్లకు తరలివెళ్లాయి. వారిలో కొందరు తిరిగి వచ్చినా.. మునుపటి చిరునామాల్లో ఉండడం లేదు. రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో వివరాల సేకరణకు వెళ్తోన్న సిబ్బందికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. మెజార్టీ దరఖాస్తుదారులు ఆ చిరునామాల్లో (దరఖాస్తులో పేర్కొన్న) ఉండడం లేదు. దీంతో మొబైల్‌ నెంబర్ల ఆధారంగా ఫోన్‌ చేసి వివరాలు ఇవ్వాలని చెబుతున్నారు. కొందరి మొబైల్‌ నెంబర్లు పని చేయడం లేదు. పలువురు సిబ్బంది మాత్రం ఫోన్లు చేయకుండానే ఆ చిరునామాల్లో దరఖాస్తుదారులు అందుబాటులో లేరని నమోదు చేస్తున్నారు. దీంతో మొబైల్‌ ఫోన్లు పని చేయని, నాటి అడ్ర్‌సల్లో లేని వారి పరిస్థితేంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

Updated Date - 2022-08-04T05:49:16+05:30 IST