బిల్లు వసూలుకు వెళ్తే Linemenపై దాడి.. మెడపట్టి బయటికి తోసి..
ABN , First Publish Date - 2022-05-26T20:39:30+05:30 IST
బిల్లు వసూలుకు వెళ్తే Linemenపై దాడి.. మెడపట్టి బయటికి తోసి..

- పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ/దుండిగల్ : విద్యుత్ లైన్‌మన్‌పై బహదూర్‌పల్లిలోని ఓ ఫ్లాట్ యజమాని దాడి చేశాడు. బాధితుడు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం వై.లక్ష్మారెడ్డి గత 22 సంవత్సరాలుగా డి పోచంపల్లిలో టీఎస్ఎస్పీడీసీఎల్ డిపార్టుమెంటులో లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. బహదూర్‌పల్లిలోని హృదరామ్ ఇన్ఫ్రా అపార్టుమెంట్‌లోని ఫ్లాట్ నెం.27, 28, 33, 34లకు సంబంధించి రెండు నెలల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడంలేదు. డిపార్టుమెంటు నుంచి వచ్చిన లిస్ట్ ప్రకారం మొత్తం 22 వేలా 716 రూపాయలు బకాయి ఉంది.
లైన్‌మన్ లక్ష్మారెడ్డి బుధవారం ఉదయం 9గంటల సమయంలో అపార్టుమెంట్‌కు వెళ్లి బకాయి చెల్లించాలని, లేదంటే విద్యుత్ కట్ చేస్తామని ఫ్లాట్ యజమాని చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పాడు. విద్యుత్ కనెక్షన్ కట్ చేసేందుకు ప్రయత్నించగా చంద్రశేఖర్‌రెడ్డి అడ్డు తగిలి లైన్‌మన్‌ను దుర్బాషలాడి, దాడి చేసి, మెడపట్టి గేటు బయటకు తోసేశాడు. ఈ విషయాన్ని లైన్‌మన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచన మేరకు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.