అర్ధరాత్రి వణికించిన వాన
ABN , First Publish Date - 2022-10-17T17:19:31+05:30 IST
నగరంలో శనివారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షం పలు ప్రాంతాలను వణికించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శేరిలింగంపల్లి గచ్చిబౌలిలో
గచ్చిబౌలిలో అత్యధికంగా 5.4 సెం.మీ
జలమయమైన రహదారులు
మరో రెండు రోజుల పాటువర్షాలు
హైదరాబాద్ సిటీ: నగరంలో శనివారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షం పలు ప్రాంతాలను వణికించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శేరిలింగంపల్లి గచ్చిబౌలిలో అత్యధికంగా 5.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి రహదారులపై మోకాళ్ల లోతు వరదనీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తాయి. ఆదివారం ఉదయం వరకు వరదనీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు గుంతల మయంగా మారాయి. ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉప్పల్ రామంతాపూర్‌లో 1.6 సెం.మీ, కుత్బుల్లాపూర్‌లో 1.1 సెం.మీ వర్షం కురిసింది. ఆదివారం సెలవురోజు కావడంతో బయటకు వెళ్లే వారికి వర్షం ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కూకట్పల్లి, ఉప్పల్, రామంతాపూర్, ముషీరాబాద్, బంజారాహిల్స్, అంబర్‌పేట, నారాయణ గూడ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లపై వరదనీరు నిలిచిపోయి స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
మరో రెండు రోజులు వర్షాలు
నగరంలో మరో రెండురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలుంటాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ దిశ నుంచి గాలులు 04-0.8 కి.మీ వేగంతో వీచే అవకాశముందని, గరిష్ఠం 29, కనిష్టం 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
వాగులో చిక్కుకున్న ఆటో
భారీ వర్షాలకు అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామం నుంచి మజీద్ పూర్ గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. మధ్యలో ఉన్న చిన్న ఏరుపై నుంచి వర్షపు నీరు పొంగి పొర్లుతుండటంతో రోడ్డును స్థానికులు వినియోగించడం లేదు. ఆదివారం రాత్రి వాగును గమనించని నలుగురు ఆటోలో మజీద్‌పూర్ నుంచి బాటా సింగారం వైపు వెళ్లే క్రమంలో వాగులో ఇరుక్కుపోయారు. ఎల్బీనగర్కు చెందిన చంద్రయ్య, యూసుఫ్, రహీమ్, మహేందర్ సెంట్రింగ్ పనుల నిమిత్తం ఆటోలో మజీద్‌పుర్ వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో తిరిగి వెళ్తున్న క్రమంలో వరద ప్రవాహం పెరగడంతో ఆటో అందులో చిక్కుకుంది. ఆటోలోని నలుగులు కిందకు దిగారు. పోలీసులు, మాజిద్ పూర్ సర్పంచ్ సుధాకర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఎక్స్కవేటర్, ట్రాక్టర్ సహాయంతో ఆటోను బయటకు తీశారు. వాహనాలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.