నాన్న కోసం ఏడుస్తున్నాడని!
ABN , First Publish Date - 2022-12-31T04:30:28+05:30 IST
తల్లి వివాహేతర సంబంధం ఆమె కొడుకును బలితీసుకుంది!. సహజీవనం చేస్తున్న ఆమె ప్రియుడే ఆ చిన్నారి పాలిట యముడయ్యాడు.
వివాహేతర బంధం బయటపడుతుందని పసివాడి ప్రాణాన్ని చిదిమేశారు
తల్లి, ఆమె ప్రియుడే హతమర్చారు
నిందితులిద్దరూ అరెస్టు
బద్వేలు, డిసెంబరు 30: తల్లి వివాహేతర సంబంధం ఆమె కొడుకును బలితీసుకుంది!. సహజీవనం చేస్తున్న ఆమె ప్రియుడే ఆ చిన్నారి పాలిట యముడయ్యాడు. నాన్న.. నాన్న అని పిలుస్తున్నాడని గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణం రూపరాంపేటలో చోటు చేసుకుంది. డీఎస్పీ వంశీధర్ గౌడ్ కథనం మేరకు.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన మారుతి నాయక్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండే వాడు. ఇతనికి 14 ఏళ్ల క్రితం బెంగళూరుకు చెందిన కవితతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు బిందు (4) ఉన్నారు. చాలాకాలం ప్రొద్దుటూరులో నివాసం ఉన్న వీరు ఇటీవల ఖాజీపేటకు మకాం మార్చారు. మారుతి నాయక్‌కు వినోద్ అనే మరో డ్రైవర్‌తో పరిచయమైంది. అతడు తరచూ వీరి ఇంటికి వచ్చిపోయేవాడు. ఈ క్రమంలో కవిత, వినోద్‌ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
దీంతో మూడు నెలల క్రితం కొడుకును, ఎనిమిదేళ్ల కూతురిని తీసుకుని కవిత వినోద్‌తో వెళ్లిపోయింది. అప్పటి నుంచి వీరు బద్వేలు పట్టణంలోని రూపరాంపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. రెండు వారాల క్రితం అక్కడే మరో ఇంట్లోకి మారారు. ఇంటినుంచి పరారైన భార్య, పిల్లలకోసం వెతుకుతున్న క్రమంలో వారు బద్వేలులో ఉన్నట్టు మారుతినాయక్‌కు తెలిసింది. కవిత ఇంటి వద్దకు వచ్చి గొడవ పడ్డాడు. తన కొడుకు ఎక్కడ అని నిలదీశాడు. కవిత పొంత న లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన మారుతి నాయక్ గురువారం బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బద్వేలు అర్బన్ ఎస్‌ఐ వె ంకటేశ్వర్లు రంగంలోకి దిగి వినోద్, కవితలను అదుపులోకి తీసుకుని విచారించగా బాలుడిని హతమార్చినట్లు వారు ఒప్పుకున్నారు. రోజూ రాత్రిపూట నాన్న నాన్న అని ఏడుస్తుంటే రెండు వారాల క్రితం గొంతు నులిమి హత్యచేశామని వినోద్ అంగీకరించాడు. బాలుడి మృతదేహాన్ని తాము మొదట అద్దెకు ఉన్న ఇంటిముందే పూడ్చామని చెప్పారు. ఆ మృతదేహాన్ని శుక్రవారం తహశీల్దారు మల్లికార్జునరెడ్డి, డీఎస్పీ వంశీధర్ గౌడ్ ఆధ్వర్యంలో వెలికి సిఇ పోస్టుమార్టం నిర్వహించారు. వినోద్, కవితలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు.