ఆగని దా‘రుణా’లు

ABN , First Publish Date - 2022-07-20T17:11:23+05:30 IST

ఇన్‌స్టంట్‌ దా‘రుణ’ వేధింపులకు చార్మినార్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రుణం ఇచ్చిన వారు తన భార్య, కుటుంబ సభ్యుల

ఆగని దా‘రుణా’లు

మళ్లీ పెరుగుతున్న ఇన్‌స్టంట్‌ రుణ 

కేటుగాళ్ల వేధింపులు

మనస్తాపంతో బాధితుల ఆత్మహత్య 

తాజాగా ఓ కానిస్టేబుల్‌ బలి


హైదరాబాద్‌ సిటీ: ఇన్‌స్టంట్‌ దా‘రుణ’ వేధింపులకు చార్మినార్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ మంగళవారం  రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రుణం ఇచ్చిన వారు తన భార్య, కుటుంబ సభ్యుల గురించి నీచంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురై తనువు చాలించాడు. సుధాకర్‌ మృతితో భార్య, ఏడాదిన్నర కూతురు దిక్కులేని వారయ్యారు. తాజా ఉదంతంతో ఇన్‌స్టంట్‌ దా‘రుణాలు’ మరోసారి వెలుగు చూశాయి. 

రెండేళ్ల క్రితం లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక వందలాది మంది బాఽధితులు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, యువతులు సహా.. పలువురు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ పెద్దలు, పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించారు. ఇన్‌స్టంట్‌ దారుణాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల ఆటకట్టించారు. హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, గుర్గావ్‌, చెన్నై, ముంబై వంటి నగరాల్లోని కాల్‌ సెంటర్లపై ఏకకాలంలో దాడులు చేసి నిర్వాహకులను, రుణ గ్రహీతలను వేధిస్తున్న టెలీ కాలర్లను కటకటాల్లోకి నెట్టారు. దాంతో దేశంలోని పలు నగరాల్లో నడుస్తున్న ఏజెన్సీలను మూసివేసిన కేటుగాళ్లు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారు. ఈ దారుణాల వెనుక ఉన్న చైనీయులు కొంతమంది తెలంగాణ పోలీసులకు చిక్కగా, ప్రధాన సూత్రధారులు పారిపోయారు. అప్పటి నుంచి రెండేళ్లపాటు దారుణ దందా వేధింపులు ఆగిపోయాయి. ఇటీవల మళ్లీ మొదలయ్యాయి. 


లోన్‌ యాప్‌లను నమ్మొద్దు.. 

గూగుల్‌ ప్లేస్టోర్‌లో దర్శనమిస్తున్న ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌లను నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇన్‌స్టంట్‌ రుణాల పేరుతో నిరుద్యోగులను, యువతను ఆకట్టుకొని రుణాలు తీసుకున్న బాధితులను తీవ్రమైన వేధింపులకు గురిచేసి వారి జీవితాలను ఆగం చేస్తున్నారు. లోన్‌ తిరిగి చెల్లించినా ఇంకా ఇంకా చెల్లించాలంటూ వేధిస్తున్నారు. ఇప్పుడైతే రుణం తీసుకున్న వారితో పాటు వారి కాంటాక్టు లిస్టులో ఉన్న వారిని కూడా మానసిక క్షోభకు గురిచేసి అశ్లీలంగా చిత్రీకరిస్తున్నారు.  ఏ తప్పూ చేయని వారి జీవితాలతో ఆటలాడుతున్నారు. ఇలాంటి ఇన్‌స్టంట్‌ లోన్స్‌ యాప్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


ఫిర్యాదు చేసి సెల్ఫీ పెట్టండి.. 

రుణాల పేరుతో కేటుగాళ్లు ఫోన్‌లు చేసి బెదిరించినా.. వేధింపులకు గురిచేసినా బాధితులు భయపడొద్దు. అసభ్యంగా మాట్లాడినా, మహిళలను లైంగికంగా వేధించినా ఎదురు తిరగండి. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించండి. పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఆ కాపీతో సెల్ఫీ తీసుకొని వాళ్లకు పోస్టు చేయండి. దాంతో కేటుగాళ్లు కొద్దిగా వెనక్కి తగ్గుతారు. సోషల్‌ మీడియాలో కూడా మీరు ఫిర్యాదు చేసిన విషయాన్ని పంచుకోండి. ఎవరైనా బాధితులు ఉంటే వారిని కూడా అలాగే చేయమని చెప్పండి. 

- ప్రసాద్‌ పాటిబండ్ల, సైబర్‌ ఫోరెన్సిక్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణులు

Updated Date - 2022-07-20T17:11:23+05:30 IST