అత్తింటి వేధింపులే అసువులు తీశాయి..

ABN , First Publish Date - 2022-12-07T00:37:50+05:30 IST

త్తింటి వేధింపులే తమ కుమార్తె ప్రాణాలను తీశాయని ఆరోపిస్తూ ఓ కుటుంబం మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సంజయ్‌నగర్‌లో ధర్నాకు దిగింది.

అత్తింటి వేధింపులే అసువులు తీశాయి..
సంజయ్‌నగర్‌లోని మెట్టింటి వద్ద మృతదేహంతో ధర్నా చేస్తున్న మృతురాలి బంధువులు

  • మృతదేహంతో మెట్టింటి ఎదుట కుటుంబీకుల ధర్నా

  • బాగ్‌లింగంపల్లి సంజయ్‌నగర్‌లో రాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితి

రాంనగర్‌, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): అత్తింటి వేధింపులే తమ కుమార్తె ప్రాణాలను తీశాయని ఆరోపిస్తూ ఓ కుటుంబం మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సంజయ్‌నగర్‌లో ధర్నాకు దిగింది. తమ కుమార్తె ఆత్మహత్యకు అత్త, భర్త ఇతర కుటుంబ సభ్యుల వేధింపులే కారణమని ఆరోపించారు. పుట్టింట్లో ఆత్మహత్య చేసుకున్న వివాహిత మృతదేహాన్ని అత్తింటికి అంబులెన్స్‌లో తీసుకువచ్చి ఆందోళన చేశారు. మృతదేహం రాగానే మృతురాలి భర్త, అత్త, ఇతర కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ రాత్రి వరకు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సీఐ సంజయ్‌తోపాటు ఎస్‌ఐలు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతురాలి తల్లిదండ్రులు మల్లయ్య, సత్తమ్మ తెలిపిన వివరాల ప్రకారం..

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని ఆత్మగూడెంకు చెందిన సత్తమ్మ మల్లయ్యల పెద్ద కుమార్తె శ్రీలతను బాగ్‌లింగంపల్లి సంజయ్‌నగర్‌కు చెందిన గడ్డం సాగర్‌కు రూ.9 లక్షల కట్నం ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు చెర్రి(7), కుమార్తె హనీ(6) ఉన్నారు. వివాహమైన కొద్దిరోజుల నుంచే అత్త భాగ్యమ్మ, భర్త సాగర్‌ అదనపు కట్నం కోసం వేధించేవారని, పుట్టింటికి వెళ్లేలా చేశారని ఆరోపించారు. సొంత పిల్లలను కూడా ఆమె వద్దకు రాకుండా, చూడకుండా నిర్భందం పెట్టారని తెలిపారు. అత్తింటి వేధింపులపై చర్యలు తీసుకోవాలని గతంలో చిక్కడపల్లి పీఎ్‌్‌సలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీలత పుట్టింట్లో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. తమకుమార్తెను హిందూ సంప్రదాయ ప్రకారం మెట్టింటి వద్దనే అంత్యక్రియలు చేయాలని, పిల్లలను తమకు అప్పగించాలని, మృతికి కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఆందోళనకు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు మద్దతుగా నిలిచారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లోంచి కిందకు దించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఏసీపీ యాదగిరి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా రాత్రి వరకు ధర్నా కొనసాగించారు.

మృతదేహం తరలింపు..

రాత్రి 10.30 గంటల సమయంలో శ్రీలత మృతదేహాన్ని పోలీసులు అక్కడినుంచి పోచంపల్లి మండలం ఆత్మగూడెం గ్రామానికి తరలించారు. మృతదేహాన్ని తరలించినా బంధువులు, గ్రామస్థులు న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.

Updated Date - 2022-12-07T00:37:54+05:30 IST