క్వింటాకు 15వేలు ఇవ్వండి

ABN , First Publish Date - 2022-12-31T03:21:57+05:30 IST

పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పత్తి రైతులు కదం తొక్కారు. రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆసిఫాబాద్‌లో సుమారు 3వేల మంది రైతులు భారీ నిరసన చేపట్టారు.

క్వింటాకు 15వేలు ఇవ్వండి

పత్తి రైతుల డిమాండ్‌

ఆసిఫాబాద్‌లో రాస్తారోకో

కలెక్టరేట్‌ దాకా ర్యాలీ

ఆసిఫాబాద్‌, డిసెంబరు 30: పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పత్తి రైతులు కదం తొక్కారు. రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆసిఫాబాద్‌లో సుమారు 3వేల మంది రైతులు భారీ నిరసన చేపట్టారు. అటవీ శాఖ చెక్‌పోస్టు సమీపంలోని ఛత్రపతి శివాజీ భవన్‌ నుంచి అంబేడ్కర్‌ చౌక్‌లోని అంతర్రాష్ట్ర రహదారి దాకా ర్యాలీ నిర్వహించి, అక్కడ రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు రైతులు ఆందోళన కొనసాగగా ఇరువైపులా వాహనాల రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. రైతుల ఆందోళనకు పలు రాజకీయ, కుల, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వ్యాపారులందరూ సిండికేట్‌గా మారి క్వింటాల్‌ పత్తికి రూ.6-7వేలే చెల్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు రూ.15వేల వరకు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకుని.. అక్కడ ర్యాలీ చేపట్టారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌.. రైతులతో మాట్లాడారు. సీసీఐ అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు, రైతుల సంఘాల నేతలతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Updated Date - 2022-12-31T03:21:57+05:30 IST

Read more