వజ్రోత్సవ వైభవం
ABN , First Publish Date - 2022-08-16T06:33:11+05:30 IST
మహానగరం మువ్వన్నెలతో మురిసింది. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల వేళ వీధి వీధినా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతోపాటు..

మహానగరం మువ్వన్నెలతో మురిసింది. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల వేళ వీధి వీధినా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతోపాటు.. కాలనీ, బస్తీ, యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థల భవనాలపైనా, వాహనాలకు జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా జాతీయ జెండాను చేతబూని దేశం విషయంలో అంతా ఒక్కటే అని చాటారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్థల భవనాలు, ప్రధాన రహదారులు, కూడళ్లు విద్యుద్దీపాలతో త్రివర్ణాలు అద్దుకున్నాయి. యువకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. విద్యా సంస్థలు అట్టహాసంగా వేడుకలు నిర్వహించాయి. క్రీడా, ఇతరత్రా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశాయి. సాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే నాటకాలు, నృత్య రూపకాలు ప్రదర్శించారు.
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి)
పర్యాటక ప్రాంతాల్లో సందడి
స్వాతంత్య్ర దినోత్సవం, వరుస సెలవుల నేపథ్యంలో నగరంలో పర్యాటక ప్రాంతాలు కళకళలాడాయి. సోమవారం సాగర తీరం సందర్శకులతో సందడిగా మారింది. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, నెక్లె్‌సరోడ్, సంజీవయ్య, లుంబినీ పార్కులకు భారీగా సందర్శకులు వచ్చారు. జాతీయ పతాకం, బుద్ధుడి విగ్రహం బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేలా ఫొటోలు దిగారు. చార్మినార్, గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, కేబుల్ వంతెన ప్రాంతాల్లోనూ సందడి కనిపించింది.
కలెక్టర్ పరిధిలోనే ‘డబుల్’ ఇళ్లు
మాకు సంబంధం లేదు : మేయర్
పూర్తి వివరాలు పంపుతున్నాం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రెండు పడకల ఇళ్ల కేటాయింపుతో జీహెచ్ఎంసీకి సంబంధం లేదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గ్రేటర్ పరిధిలో 7.09 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో అసంపూర్తి సమాచారం ఉండడంతో.. కులం, మతం, వయస్సు, ఓటరు గుర్తింపు కార్డు తదితర వివరాలను జీహెచ్ఎంసీ సిబ్బంది సేకరిస్తున్నారని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులకు ఇళ్ల కేటాయింపు జరిగేలా.. పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నామన్నారు. దరఖాస్తుదారుల నుంచి తీసుకున్న సమగ్ర వివరాలను కలెక్టర్లకు పంపుతామని, రెవెన్యూ విభాగం, కలెక్టర్ల ఆధ్వర్యంలో కేటాయింపునకు సంబంధించి తుది నిర్ణయం జరుగుతుందని పేర్కొన్నారు. సరోజినీనాయుడు, తుర్రెబాజ్‌ఖాన్ స్వాతంత్య్ర పోరాటంలో కీలక భూమిక పోషించారని గుర్తుచేసుకున్నారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, కమిషనర్ డీఎస్ లోకే్‌షకుమార్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
భారీ నృత్య ప్రదర్శన
శిల్ప కళావేదికలో సంగీతాంజలి ఫౌండేషన్ సంగీత కార్యక్రమం నిర్వహించింది. బాలీవుడ్ గాయకులు జస్పిందర్ నరులా, యూఎ్సఏకు చెందిన శాక్సోఫోన్ కళాకారుడు మార్క్ ఎడ్వర్డ్, పియానిస్ట్ స్టీఫెన్ డేవ్స్సీ పాల్గొన్నారు. హైటెక్‌సిటీ ప్రాంగణంతోపాటు వర్చువల్‌గా ఒన్ నేషన్ ఒన్ డ్యాన్స్ శీర్షికన భారీ నృత్య ప్రదర్శన ఏర్పాటుచేశాయి తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఐఈ), తెలంగాణ ఎంటర్టైనర్స్ అసోసియేషన్ (టీఈఏ). విద్యార్థులతోపాటు దాదాపు 7,500 మంది పాల్గొన్నారు. జయహో అంటూ ఒకేసారి వీరంతా నృత్యం చేశారు.
