పోరాట యోధుడు బండి యాదగిరి
ABN , First Publish Date - 2022-12-08T00:39:33+05:30 IST
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండి యాదగిరి అని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివా్‌సగుప్తా అన్నారు.
చిక్కడపల్లి, డిసెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండి యాదగిరి అని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివా్‌సగుప్తా అన్నారు. ఎందరో మహానుభావులు కార్యక్రమ పరంపరలో భాగంగా బుధవారం త్యాగరాయగానసభలో బండి యాదగిరి జయంతి సభ గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివా్‌సగుప్తా మాట్లాడుతూ యాదగిరి ‘బండెనక బండి కట్టి పదారుబండ్లు కట్టి’ పాటను రాసి దొరల గుండెల్లో గుబులు రేపాడని, అప్పటి నుంచి బండి యాదగిరిగా పేరు పొందాడని అన్నారు. పాటతో ప్రజానీకాన్ని ఉత్తేజితం చేసిన యాదగిరి గన్ను పట్టి పోరాటంలో పాల్గొన్న యోధుడని కొనియాడారు. ప్రముఖ రచయిత రమణ వెలమకన్ని తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వివరిస్తూ బండెనక బండి కట్టి పాట ప్రతాపరెడ్డి దొరను ఉద్దేశించి రాసినదని, మా భూమి సినిమాలో నిజాం పేరు చేర్చారని చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ జి.వల్లీశ్వర్ మాట్లాడుతూ బండి యాదగిరి వంటి త్యాగధనుల వల్లనే నేడు తెలంగాణ విముక్తి చెందిందని, ఆయన చరిత్ర నేటి యువతకు స్ఫూర్తినివ్వాలన్నారు. సభలో సూరి భగవంతం ట్రస్ట్ స్థాపకుడు ఎస్‌బీ.రామ్, బండి శ్రీనివాస్ పాల్గొన్నారు.