స్టేషన్‌లో లగేజీ ఇచ్చేసి.. నేరుగా ఎయిర్‌పోర్టుకు

ABN , First Publish Date - 2022-11-29T02:31:49+05:30 IST

విమాన ప్రయాణానికి బోలెడంత లగేజ్‌తో వెళ్లేవారే ఎక్కువ. అలాంటి వారికి ఎక్స్‌ప్రెస్‌ మెట్రోలో ప్రయాణించటం అంత సులువైన పనా? స్టేషన్‌కు లగేజ్‌ తీసుకెళ్లడం...

స్టేషన్‌లో లగేజీ ఇచ్చేసి.. నేరుగా ఎయిర్‌పోర్టుకు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఎంట్రీ వరకు..

రాయదుర్గం స్టేషన్‌లోనే లగేజీ చెకిన్‌ సౌకర్యం

ఎయిర్‌ పోర్టులో లగేజీ చెకిన్‌ లేకుండా ఏర్పాట్లు

కార్గోకు, ప్రయాణికులకు వేర్వేరుగా మెట్రో రైళ్లు

స్టేషన్‌లో లగేజీ ఇచ్చేసి.. నేరుగా ఎయిర్‌పోర్టుకు

ఎయిర్‌పోర్టు దగ్గర్లో 2.5 కి.మీ. భూగర్భ ట్రాక్‌

బయో డైవర్సిటీ వద్ద 2 వంతెనల పైనుంచి రైలు

సర్వేలు పూర్తి.. మూడేళ్లలో మెట్రో పరుగులు

ట్రాక్‌ మొత్తం ఓఆర్‌ఆర్‌ మీదుగానే..

పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టు

కొన్ని స్టేషన్లకు చేరుకోవడానికి స్కైవాక్‌లు

సరాసరి నాలుగైదు కిలోమీటర్లకు ఒక స్టేషన్‌

స్టేషన్ల సంఖ్యపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది

‘ఆంధ్రజ్యోతి’తో హైదరాబాద్‌

మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌ సిటీ ప్రతినిధి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): విమాన ప్రయాణానికి బోలెడంత లగేజ్‌తో వెళ్లేవారే ఎక్కువ. అలాంటి వారికి ఎక్స్‌ప్రెస్‌ మెట్రోలో ప్రయాణించటం అంత సులువైన పనా? స్టేషన్‌కు లగేజ్‌ తీసుకెళ్లడం.. తర్వాత దించుకోవడం.. మళ్లీ చెకిన్‌.. కానీ ఇలాంటి ఆలోచనలను ఇక కట్టిపెట్టేయవచ్చు. ఎందుకంటే.. ఇవేమీ అవసరం లేకుండా, పూర్తిస్థాయి హైటెక్‌ టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సన్నద్ధమవుతోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత మెట్రో రైళ్లు, ఎయిర్‌ పోర్టుల వద్దకు సేవలు అందించే మోడళ్లను పరిశీలించి.. అక్కడున్న ప్రత్యేకతల్ని హైదరాబాద్‌ ప్రజలకు పరిచయం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ మెట్రో అంటేనే టెక్నికల్‌ వండర్‌ అనే రీతిలో, ఎయిర్‌ పోర్టుకు తీసువెళ్లే మెట్రో ఫేజ్‌-2 కోసం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ మెట్రో మ్యాన్‌ ఎన్వీఎస్‌ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

మెట్రో ఫేజ్‌-2 కోసం జరిగిన కసరత్తు ఏమిటి?

ఇప్పటికే అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశాం. సర్వేలు పూర్తయ్యాయి. ఇప్పుడు డిటైల్డ్‌ సర్వే చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం మార్గాన్ని అంగుళం అంగుళం చొప్పున సర్వే చేయాల్సి ఉంటుంది. అది కూడా త్రీడీ సర్వే చేయాలి. ఎత్తుపల్లాలకు సంబంధించిన వివరాల్ని సేకరించటంతోపాటు.. స్టేషన్‌ ఏర్పాటులో కీలకంగా ఉండే ప్రాంతాల్ని గుర్తించాల్సి ఉంది. ఈ సర్వేలోనే ఎక్కడెక్కడ, ఎంత ఎత్తున పిల్లర్లు ఏర్పాటు చేయాలి, స్టేషన్ల ఏర్పాటు ఎక్కడన్న అంశాలపై నిర్ణయం తీసుకుంటాం.

మూడేళ్లలోనే ప్రాజెక్టు పూర్తవుతుందా?

ఇప్పటికే మెట్రో కట్టిన అనుభవం ఉంది. ఫేజ్‌-1లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. భూసేకరణ, కోర్టు కేసులు, హెరిటేజ్‌ కట్టడాలు వంటి సమస్యలెన్నో ఉండేవి. కానీ ఫేజ్‌-2లో అలాంటి ఇబ్బందులు లేవు. ఔటర్‌ నుంచి ట్రాక్‌ వెళుతుంది కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండవు. కచ్చితంగా మూడేళ్లకు ఫేజ్‌-2 పూర్తయి, మెట్రో రైళ్లు పరుగులు తీయటం ఖాయం.

ఫేజ్‌-2లో సాంకేతిక సంక్లిష్టతలు ఏమున్నాయి?

ప్రధానంగా రెండు చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. బయోడైవర్సిటీ వద్ద రెండు ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇక్కడ మెట్రో రైలు మూడో వంతెన మీదుగా వెళుతుంది. ఇదొక సవాలు. దీనికి సంబంధించి మరింత కసరత్తు అవసరం. అలాగే నానక్‌రాంగూడ ప్రాంతంలో 400 కేవీ అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ లైన్లు ఉన్నాయి. వాటి విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. బయోడైవర్సిటీ దాటటం వరకే ఇబ్బంది. అది దాటితే ఔటరే. పెద్దగా సమస్యలు ఉండవు.

ఔటర్‌ మీదుగా వెళ్లే ట్రాక్‌తో సమస్యలు రావా?

ఔటర్‌ డిజైన్‌లోనూ పాల్గొన్న అనుభవం ఉంది. భవిష్యత్తులో మెట్రో అవసరాలకు తగ్గట్లుగా ఔటర్‌ డిజైన్‌ సమయంలోనే భూమిని ఏర్పాటు చేసి ఉంచాం. అది ఇప్పుడు మనకున్న సానుకూలాంశం.

ఫేజ్‌-2లో కేంద్రం పాత్ర ఏమిటి?

ఫేజ్‌-2లో కేంద్రంతో ఎలాంటి ఆర్థిక సంబంధాలు ఉండవు. అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రో నుంచి అవసరమైన అనుమతుల కోసం డీపీఆర్‌లను పంపాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ప్రక్రియను పూర్తి చేసింది. కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. నిధుల సమస్య లేదు.

ఎక్స్‌ప్రెస్‌ మెట్రో లేన్‌లో ఎన్ని స్టేషన్లు ఉంటాయి?

ఎన్ని స్టేషన్లు ఉండాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సరాసరి నాలుగైదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఉండొచ్చు. ఫేజ్‌-1లో స్టేషన్ల ఏర్పాటు, వాటి ఫలితాల మీద అవగాహన ఉంది. ఆ అనుభవంతో ఫేజ్‌-2లో స్టేషన్లను ఏర్పాటు చేస్తాం.

ఫేజ్‌-2 డిజైన్‌ ఎలా ఉంటుంది?

ప్రపంచంలోని అత్యుత్తమ మెట్రోలను పరిశీలించాం. వాటి నుంచి స్ఫూర్తి పొందటంతోపాటు మన అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉంటాయి. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తాం. మెట్రో స్టేషన్లకు చేరుకోవటానికి వీలుగా ప్రత్యేకంగా స్కైవాక్‌లను ఏర్పాటుచేస్తాం.

ఎయిర్‌ పోర్టుకు వెళ్లే వారికి లగేజ్‌తో మెట్రో ప్రయాణం ఇబ్బంది కదా?

రాయదుర్గంలో ఇప్పటికే ఉన్న మెట్రో స్టేషన్‌ నుంచి నేరుగా ఎక్స్‌ప్రెస్‌ మెట్రో స్టేషన్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తాం. ఆ స్టేషన్‌లోనే లగేజ్‌ చెకిన్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. దీంతో.. ప్రయాణికులు తమ లగేజ్‌ చెకిన్‌ను మెట్రో స్టేషన్‌లోనే పూర్తి చేసుకుంటారు. హ్యాండ్‌ బ్యాగ్‌తో ఎయిర్‌పోర్టుకు వెళ్లవచ్చు. ఎయిర్‌ పోర్టుకు వెళ్లే మెట్రోలో... కార్గోకు, ప్రయాణికులకు వేర్వేరుగా రైళ్లు నడుపుతాం.

ఫేజ్‌-1, ఫేజ్‌-2 రైలు బోగీల్లో తేడా ఉంటుందా?

రెండింటికీ సంబంధం ఉండదు. ఫేజ్‌-2 డిజైన్‌ వేరుగా ఉంటుంది. ఎక్కువ మంది ప్రయాణికులు కూర్చునేలా బోగీల డిజైన్‌ ఉంటుంది. లగేజ్‌ పెట్టుకోవటానికి వీలుగా ఉంటాయి. ఇప్పుడు దేశీయంగా కోచ్‌ల నిర్మాణం జరుగుతుంది. స్వదేశీ కోచ్‌లకు ప్రాధాన్యం ఇస్తాం. టెండర్ల పద్ధతిలోనే ఎంపిక ఉంటుంది.

ఫేజ్‌-2 ట్రాక్‌ మొత్తం స్తంభాలపైనే ఉంటుందా?

మొత్తం 31 కిలోమీటర్లలో అత్యధిక భాగం మెట్రో స్తంభాల మీదనే రైళ్లు వెళతాయి. విమానాశ్రయానికి దగ్గర్లో దాదాపు 2.5 కిలోమీటర్ల మేర మాత్రం అండర్‌గ్రౌండ్‌ ద్వారా రైళ్లు ప్రయాణిస్తాయి. మెట్రో రైలు దిగి నేరుగా ఎయిర్‌ పోర్టులోకి వెళ్లేలా ఏర్పాట్లు ఉంటాయి.

Updated Date - 2022-11-29T08:19:04+05:30 IST