బదిలీపై వెళ్లినా.. వారిదే పెత్తనం

ABN , First Publish Date - 2022-12-16T00:34:43+05:30 IST

గోషామహల్‌ నియోజకవర్గంలోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-14 కార్యాలయాన్ని అదృశ్య శక్తులు నడుపుతున్నాయి.

 బదిలీపై వెళ్లినా.. వారిదే పెత్తనం

మంగళ్‌హాట్‌, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): గోషామహల్‌ నియోజకవర్గంలోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-14 కార్యాలయాన్ని అదృశ్య శక్తులు నడుపుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం మొదలుకొని కేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతాలు ఈ సర్కిల్‌ పరిధిలోకే వస్తాయి. అలాంటి సర్కిల్‌ను అక్కడ పనిచేసే వారి కంటే.. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు శాసిస్తున్నారు. ఆస్తి పన్ను విభాగం మొదలు పట్టణ ప్రణాళిక, ఆరోగ్య-పారిశుధ్య విభాగం వరకు వారిదే హవా.

గోషామహల్‌ సర్కిల్‌లో వాణిజ్య భవనాలు, వ్యాపార సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలు ఎక్కువగా ఉంటాయి. వివిధ మార్గాల్లో సంస్థకు ఆదాయం రావాల్సిన సర్కిల్‌లో అధికారుల తీరుతో తీవ్ర నష్టం జరుగుతోంది. యేళ్లుగా సర్కిల్‌లో పనిచేసి.. బదిలీపై వెళ్లినా ఇక్కడి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఆస్తిపన్ను విభాగంలో ఇతర ప్రాంతాల్లో పని చేస్తోన్న వారి పెత్తనం మితిమీరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పన్ను వసూలుకు సంబంధించి 23 డాకెట్స్‌ ఉన్న సర్కిల్‌లో ఇద్దరు ఏఎంసీలు ఉన్నారు. గతంలో బిల్‌ కలెక్టర్‌గా ఉద్యోగంలో చేరి ఇన్‌చార్జి డీఎంసీ వరకు ఇక్కడే కొనసాగిన ఓ అధికారి.. నోటి దురుసు కారణంగా కొన్నాళ్ల కిందట బదిలీ అయ్యారు. బేగంబజార్‌, సిద్దంబర్‌ బజార్‌, జాంబాగ్‌, సుల్తాన్‌బజార్‌, గన్‌ఫౌండ్రీ ప్రాంతాల్లోని వ్యాపారులతో మొదటి నుంచి సన్నిహితంగా ఉండే ఆ అధికారి.. ఇప్పటికీ వారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లోని కొన్ని వాణిజ్య సముదాయాల యజమానులు ఆస్తి పన్ను చెల్లించకపోయినా... వాస్తవం కంటే తక్కువ పన్ను చెల్లిస్తోన్నా.. వారికి అండగా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన సర్కిల్‌లో పనిచేసినప్పుడే పన్ను మదింపులో మతలబు జరిగిందన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం సర్కిల్‌లో పనిచేసే ఏ అధికారి దుకాణాల వైపు వెళ్లినా.. వెంటనే సదరు అధికారికి సమాచారం వెళ్తుంది. వెంటనే రంగంలోకి దిగి అక్కడకు ఎందుకు వెళ్లారంటు.. ఆయన నానా హంగామా చేస్తారు. ఇటీవల ఆస్తి పన్ను మదింపునకు సంబంధించి.. ఓ భవనం వద్దకు వెళ్లిన అధికారినుద్దేశించి.. అక్కడికి ఎందుకు వెళ్లావు.. నీ సంగతి చూస్తానని కార్యాలయంలో హెచ్చరించినట్టు తెలిసింది. కేంద్ర కార్యాలయంలో తనకున్న పరిచయాలతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి సర్కిల్‌లోని ఓ అధికారిని సస్పెండ్‌ చేయించినట్టు ప్రచారం జరుగుతోంది. సదరు అధికారి ఎక్కడ పనిచేసినా.. ఇక్కడి సర్కిల్‌ బిల్‌ కలెక్టర్‌ మొదలు డీఎంసీ వరకు ఆయన సూచనల మేరకు పని చేయాల్సిందే.

అన్న సెక్షన్‌ ఆఫీసర్‌.. తమ్ముడు బిల్డర్‌

ఇదే సర్కిల్‌లో గతంలో టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేసిన ఓ అధికారి సొంత తమ్ముడు గోషామహల్‌ నియోజకవర్గంలో బిల్డర్‌. ఆయన చేపట్టే ఏ భవన నిర్మాణానికీ అనుమతి అవసరం ఉండదు. అనుమతి లేదని నోటిసు ఇచ్చేందుకు వెళితే.. ఆ సెక్షన్‌ ఆఫీసర్‌ వెంటనే రంగంలోకి దిగుతాడు. ఏసీపీ, అంతకంటే పై అధికారులకు ఫోన్‌ చేసి మంత్రాంగం నడుపుతాడు. ఎలాగోలా వారికి నచ్చచెప్పి.. మరోసారి పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది అటువైపు వెళ్లకుండా చూస్తాడు. దీంతో బిల్డర్‌ చెప్పిందే టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో జరుగుతున్నట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో నిర్మాణాలు చేపట్టిన సదరు కాంట్రాక్టర్‌ ఎలాంటి అనుమతులు పొందకుండానే అన్ని తానే చూసుకుంటానని భవనాల యజమానులకు హామీలు ఇస్తుండడం కొసమెరుపు. ఇతర జిల్లాలో పనిచేస్తూ కూడా గోషామహల్‌ సర్కిల్‌లో తన అధికారాన్ని చెలాయిస్తున్న సదరు సెక్షన్‌ అధికారి తీరును చూసి ఇక్కడి సిబ్బంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఆరోగ్య, పారిశుధ్య విభాగంలో సస్పెండ్‌ అయిన ఓ ఎస్‌ఎ్‌ఫఏ అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. శానిటేషన్‌ మొదలుకొని, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వద్ద వసూళ్ల కార్యక్రమాలు ఆయనగారిచేతే చేయిస్తున్నారని కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గోషామహల్‌ సర్కిల్‌ పరిధిలో పనిచేస్తున్న అధికారులకు అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T00:34:53+05:30 IST