రోడ్లు విస్తరించినా ట్రా‘ఫికరే’..!

ABN , First Publish Date - 2022-12-13T00:46:20+05:30 IST

మెట్రోరైల్‌ పనిలో భాగంగా రోడ్లను విస్తరించినా కూడా ప్రయోజనం లేకుండా పోతోంది. రోడ్లలోని సగభాగాన్ని పార్కింగ్‌లతో, వ్యాపారాల కోసం ఆక్రమించుకుంటుండడంతో ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఎప్పటికీ రద్దీగా ఉండే ఎర్రగడ్డ ప్రధాన రహదారిలో కూడా వాహన దారులు ప్రస్తుతం ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారు.

రోడ్లు విస్తరించినా ట్రా‘ఫికరే’..!

ఎర్రగడ్డ, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి అయిన ఎర్రగడ్డ ప్రధాన రోడ్డులో ఎస్సార్‌నగర్‌ చౌరస్తా నుంచి మూసాపేట బ్రిడ్జి వరకు పార్కింగ్‌లతో రోడ్డులో సగభాగం నిండిపోతోంది. ముఖ్యంగా రైతుబజార్‌ నుంచి మూసాపేట బ్రిడ్జి వరకు రెండు పక్కల వివిధ వ్యాపార సంస్థలు విరివిగా ఉన్నాయి. దీంతో వినియోగదారులు, వ్యాపారుల పార్కింగ్‌లతో ట్రాఫిక్‌కు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతీయ రహదారి కావడంతో అధిక శాతం వాహనాల రాకపోకలతో ముందే ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉంటోంది. దీనికి తోడు అక్రమ పార్కింగ్‌లు రోడ్డును సగభాగం ఆక్రమిస్తుండడంతో వాహనదారులు సాయంత్రం వేళ ముందుకు కదలలేక పోతున్నారు. ఎస్సార్‌నగర్‌ నుంచి మూసాపేట బ్రిడ్జి ప్రాంతానికి వెళ్లడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. రైతుబజార్‌, బాటా షోరూం, డక్కన్‌ హోటల్‌, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం, సన్మాన్‌ హోటళ్లతో పాటు ఎర్రగడ్డ చౌరస్తాలోని వివిధ వ్యాపార సంస్థల ఎదురుగా వాహనాలను అధిక శాతం నిలుపుతున్నారు. వాహనదారులే కాకుండా పాదచారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎర్రగడ్డ చౌరస్తాలో..

ట్రాఫిక్‌ సమస్య వల్ల ఎర్రగడ్డ చౌరస్తాలో సాయంత్రం వాహనదారులకు నరకం కనబడుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు వెళ్లాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. ఎర్రగడ్డ రైతుబజార్‌ నుంచి చౌరస్తా, మూసాపేట బ్రిడ్జి వరకు సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌జాం విపరీతంగా అవుతోంది. ఎడమ, కుడి వైపుల రోడ్డు ఆక్రమణలతో వాహనాలు వెళ్లడానికి వీలు లేకుండా ఉంటోంది. చౌరస్తాలో ఆటోవాలాలు ప్యాసింజర్ల కోసం వేచి ఉంటుండడం వల్ల బస్సులు తదితర భారీ వాహనాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దాంతో వాహనాలు కదలేని పరిస్థితి నెలకొంటోంది.

రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు

ఎర్రగడ్డ రైతుబజార్‌ ఎదురుగా తోపుడు బండ్ల మూలంగా నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికీ 5, 6 పర్యాయాలు బండ్లను ట్రాఫిక్‌ అధికారులు పూర్తిగా తొలగించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. కానీ తోపుడు బండ్లను స్వాధీనం చేసుకున్న ప్రతిసారీ వ్యాపారస్థులు వాటిని ఏదో విధంగా తిరిగి తెచ్చుకుని వ్యాపారాలు సజావుగా సాగిస్తున్నారు. మూసాపేట నుంచి రైతుబజార్‌కు వెళ్లే దారిలో విద్యుత్‌ కార్యాలయాన్ని ఆనుకుని బెంచీలు, టేబుళ్ల వ్యాపారాలను రోడ్డులో సగభాగం ఆక్రమించి నిర్వహిస్తున్నారు. రైతుబజార్‌ వద్ద తోపుడు బండ్లు, బెంచీల వ్యాపారులు తాము సంబంధిత అధికారులకు, మరికొంత మందికి మామూళ్లు ఇస్తున్నామని బాహటంగా ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి చర్యలపై కూడా కఠినంగా వ్యవహరించాలని వాహనదారులు పేర్కొంటున్నారు.

ఎర్రగడ్డ చౌరస్తాలో సిగ్నళ్లను పునరుద్ధరించాలి

మెట్రోరైల్‌ పనుల మూలంగా ఎర్రగడ్డ చౌరస్తాలో సిగ్నళ్లను తొలగించారు. చౌరస్తాలో యూ-టర్నింగ్‌ లేకుండా ఈ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి ఇటు ఎర్రగడ్డ రైతుబజార్‌ వద్ద, అటు మూసాపేట బ్రిడ్జి వద్ద మాత్రమే యు-టర్న్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. చౌరస్తా వద్ద సిగ్నళ్లను పునరుద్ధరిస్తే ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడకుండా ఉంటుంది. రైతుబజార్‌ నుంచి వచ్చే వాహనాలు సనత్‌నగర్‌ వైపు, సనత్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలు మూసాపేట వైపు వెళ్లడానికి సౌలభ్యంగా ఉంటుంది. సిగ్నళ్లను పునరుద్ధరిస్తే ట్రాఫిక్‌ సమస్య తీరడమే కాకుండా ప్రమాదాలకు కూడా చెక్‌పెట్టినట్లు అవుతుంది.

- కళ్లె శ్రీనివాస్‌ రెడ్డి, ఎర్రగడ్డ

Updated Date - 2022-12-13T00:46:22+05:30 IST