తాగిన మత్తులో బావ, బావ మరిది ఘాతుకం
ABN , First Publish Date - 2022-03-12T17:39:16+05:30 IST
తాగిన మత్తుతో బావతో కలిసి బావమరిది ఒకే కుటుంబానికి చెందిన..

హైదరాబాద్ సిటీ/సైదాబాద్ : తాగిన మత్తుతో బావతో కలిసి బావమరిది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై కత్తితో దాడి చేశారు. సైదాబాద్ పూసలబస్తీకి చెందిన షణ్ముఖకు, వాణినగర్‌కు చెందిన శ్రీధర్ కుటుంబానికి నాలుగు నెలల క్రితం గొడవ జరిగింది. పెద్దల సమక్షంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. శుక్రవారం షణ్ముఖ బావ విశాల్ పెళ్లి రోజు కావడంతో పూసలబస్తీలో విందు ఏర్పాటు చేసుకుని ఇద్దరూ మద్యం తాగారు. ఆ సమయంలో శ్రీధర్ కుమారుడు సాయి రోడ్డుపై వెళ్తుండగా షణ్ముఖ టీజ్ చేశాడు. ఇంటికి వెళ్లి తండ్రి శ్రీధర్‌కు సాయి విషయం చెప్పాడు. దీంతో సాయి, శ్రీధర్, మేనమామ రాజేష్‌లు షణ్ముఖ వద్దకు వెళ్లి ప్రశ్నించారు. మద్యం మత్తులో ఉన్న షణ్ముఖ, విశాల్ వారిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీధర్, సాయి, రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముందుజాగ్రత్తగా పూసలబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.