డ్రగ్స్‌ ఎలా వచ్చాయో తెలియదు

ABN , First Publish Date - 2022-04-16T16:23:37+05:30 IST

‘పబ్‌లోకి డ్రగ్స్‌ ఎలా వచ్చాయో మాకు తెలియదు. మేం సరఫరా చేయలేదు. వినియోగదారులే తెచ్చుకొని

డ్రగ్స్‌ ఎలా వచ్చాయో తెలియదు

అభిషేక్‌, అనిల్‌ది ఒకే మాట

హైదరాబాద్/బంజారాహిల్స్‌: ‘పబ్‌లోకి డ్రగ్స్‌ ఎలా వచ్చాయో మాకు తెలియదు. మేం సరఫరా చేయలేదు. వినియోగదారులే తెచ్చుకొని ఉంటారు. డ్రగ్స్‌తో మాకు సంబంధం లేదు.’ పోలీసు కస్టడీలో ఉన్న అభిషేక్‌, అనిల్‌లు విచారణాధికారులకు చెబుతున్న మాటలివి. ఎన్ని రకాలుగా పోలీసులు ప్రశ్నించినా వారి సమాధానాలు మారడం లేదు. ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ పార్టీలో అరెస్టు అయిన అభిషేక్‌, అనిల్‌ను రెండో రోజు నార్కొటిక్‌ డ్రగ్స్‌ విచారణ విభాగాధిపతి నర్సింగరావు, బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌, సీఐ నాగేశ్వరరావు, ముగ్గురు డీఐలు విచారించారు. కలిపి విచారించినా, వేర్వేరుగా ప్రశ్నించినా ఇద్దరూ ఒకటే సమాధానం చెబుతున్నారు. సుమారు ఎనిమిది గంటల పాటు జరిగిన విచారణలో నిందితులు పోలీసులకు విసుగు వచ్చేలా ప్రవర్తించినట్లు తెలిసింది. 


అభిషేక్‌ సంబంధాలపై ఆరా..

పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌కు సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల పిల్లలతో పరిచయాలు ఉన్నాయి. వారి కోసం గోవాతో పాటు ఇతర నగరాల్లో కూడా అతడు పార్టీలు నిర్వహించాడు. గోవా పబ్‌లో పార్టీ చేస్తూ అభిషేక్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన కొన్ని ఫొటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న వారి గురించి ఆరా తీస్తున్నారు. అభిషేక్‌ ఫోన్‌ కాంటాక్ట్‌లో ఉన్న వారు ఏం చేస్తుంటారు అన్న కోణంలో కూడా విచారణ సాగుతోంది. వాటి ద్వారా డ్రగ్స్‌ పెడలర్స్‌ ఎవరనేది తేలే అవకాశం ఉందని విచారణాధికారులు భావిస్తున్నారు. 


మొదటి అంతస్తులోనే..

పబ్‌ రెండు అంతస్తుల్లో ఉంటుంది. పబ్‌పై దాడి రోజున కింద అంతస్తులో ఉన్న వారందరిని ప్రత్యేక వాహనాల ద్వారా ఠాణాకు పంపించారు. అక్కడ డ్రగ్‌ వినియోగించినట్టు తేలలేదు. మొదటి అంతస్తులో ఉన్న వారిని క్షుణ్నంగా తనిఖీ చేసి స్టేషన్‌కు పంపించారు. అభిషేక్‌, అనిల్‌తో పాటు పబ్‌ సిబ్బంది మాత్రమే ఆ అంతస్తులో మిగిలిపోయారు. వారిని కూడా విచారిస్తుండగా కొన్ని జార్‌ల వెనకాల డ్రగ్స్‌ను గుర్తించారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని నిర్వాహకులను ప్రశ్నించగా వారు సమాధానం చెప్పలేదు. అదే అంతస్తులోని బాత్రూం వద్ద డ్రగ్‌ పౌడర్‌తో పాటు ఖాళీ ప్లాస్టిక్‌ కవర్లు లభించాయి. దీంతో అక్కడే డ్రగ్స్‌ను వినియోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసుల రాక చూసి డెస్క్‌ పైకి డ్రగ్స్‌ను ఎవరైన విసిరారా లేక నిర్వాహకులే అమ్ముతున్నారా అనేది విచారణలో తేలాల్సి ఉంది.

Updated Date - 2022-04-16T16:23:37+05:30 IST