Hyderabad City: డీపీఎస్ పార్సిల్ సర్వీస్

ABN , First Publish Date - 2022-12-16T11:58:40+05:30 IST

డ్రగ్స్‌ విక్రయదారులు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. మాదకద్రవ్యాలను వినియోగదారుల

Hyderabad City: డీపీఎస్ పార్సిల్ సర్వీస్

‘డ్రగ్స్‌’ పార్సిల్‌ సర్వీస్‌

దర్జాగా సరిహద్దులు దాటుతున్న మాదకద్రవ్యాలు

కొరియర్‌ల ద్వారా సరఫరా

గిఫ్ట్‌ ప్యాక్‌లు.. పార్సిళ్ల మధ్యలో పెట్టి..

పోలీసులకు చిక్కకుండా నిందితుల ఎత్తుగడ

హైదరాబాద్‌ సిటీ: డ్రగ్స్‌ విక్రయదారులు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. మాదకద్రవ్యాలను వినియోగదారుల వద్దకు చేర్చేందుకు కొరియర్‌ సంస్థలను ఎంచుకుని నిరాటంకంగా పార్సిళ్లను పంపుతున్నారు. గిఫ్టుబాక్స్‌లు తయారు చేసి వాటిలో డ్రగ్స్‌ పెట్టి, వాటి ముడి సరుకు సరఫరా చేస్తున్నారు. తాజాగా కొరియర్‌ సంస్థ ద్వారా పంపుతున్న డ్రగ్స్‌ పార్సిళ్లను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 9కోట్లు ఉంటుందని, కొరియర్‌ సంస్థల ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిందితులు అంగీకరించడం గమనార్హం. అంతే కాకుండా ఇప్పటికే రూ. 70కోట్ల విలువ చేసే సూడో ఎఫిడ్రిన్‌ అనే మత్తు పదార్థాలను విదేశాలకు పార్శిల్‌ చేసినట్లు పోలీసులకు వెల్లడించారంటే ఏ మేరకు దందా కొనసాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి తనిఖీలు లేకుండా వచ్చిన పార్సిళ్లను నేరుగా పంపించేస్తూ నేరస్థులకు పరోక్షంగా సహకరిస్తున్న కొరియర్‌ కంపెనీల కారణంగా డ్రగ్స్‌ దందా చాప కింద నీరులా విస్తరిస్తోందనే చెప్పాలి.

పోస్టల్‌ ద్వారా..

సరిగ్గా రెండు నెలల క్రితం అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ రాకెట్‌ను డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) ఛేదించిన విషయం తెలిసిందే. అప్పట్లో మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి రూ. 2.36 కోట్ల విలువ చేసే 5.3కేజీల హైడ్రోపోనిక్‌ వీడ్‌ స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులకు అందిన పక్కా సమాచారంతో ముంబై, హైదరాబాద్‌, ఢిల్లీ అధికారుల సమన్వయ సహకారాలతో ఈ దాడులు జరిగాయి. యూఎస్‌ నుంచి డార్క్‌వెబ్‌ ద్వారా ఇక్కడికి డ్రగ్స్‌ తరలిస్తున్నారనే సమాచారంతో ముంబైలోని అంతర్జాతీయ పార్శిళ్లు చేరే పోస్టాఫీ్‌స కు చేరుకుని అధికారులు తనిఖీలు నిర్వహించారు. యూఎస్‌ (అమెరికా) నుంచి వచ్చిన ఓ పార్సిల్‌పై ఫుడ్‌ ఐటెమ్స్‌ అని రాసి తెలంగాణ, హైదరాబాద్‌ అడ్రస్‌ ఉంది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఈ వ్యవహారానికి సూత్రఽధారితోపాటు మరో వ్యక్తిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు ఢిల్లీలోనూ దాడులు నిర్వహించి అక్కడా ఓ పార్సిల్‌లో 1.8 కేజీల హైడ్రోపోనిక్‌ వీడ్‌ సీజ్‌ చేశారు. మొత్తం 5.3 కేజీల వీడ్‌ స్వాధీనం చేశారు. వాటి విలువ రూ. 2.36కోట్లు ఉందని అధికారులు వెల్లడించారు.

కొరియర్‌ కంపెనీల నిర్లక్ష్యం

కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ సరఫరా అవుతున్నా గుర్తించలేని పరిస్థితుల్లో కొరియర్‌ కంపెనీలు పని చేస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్సిల్‌లో రెండు మూడు పేపర్లు పెట్టి... దానిపై ఏదో కీలక సమాచారం ఉన్నట్లు సృష్టించి మధ్య పేపర్‌కు డ్రగ్స్‌ అంటించి పంపించిన ఘటనలు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వెలుగు చూశాయి. గిఫ్టు ప్యాక్‌లో డ్రగ్స్‌ ఉన్నట్లు రాచకొండలో వెలుగు చూశాయి. పార్సిల్‌లో పేపర్‌లే ఉన్నాయని గుడ్డిగా నమ్ముతున్న కంపెనీలు ఆయా కవర్‌లను సంబంధిత అడ్ర్‌సలకు చేరవేస్తున్నాయి. కొరియర్‌ ద్వారా ప్రతి రోజూ లక్షల సంఖ్యలో చేరుతున్న కవర్‌లపై నిఘా పెట్టి స్కానర్‌ల ద్వారా పరిశీలించాల్సిన బాధ్యత కొరియర్‌ కంపెనీలపై ఉందని సీపీలు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన కవర్‌లో ఏముందో.. తమ పిల్లలకు ఏం వచ్చిందో చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సీపీ అన్నారు. కవర్‌లోపల కనిపించకుండా ఉండేలా అమర్చిన డ్రగ్స్‌తో కూడిన కవర్‌ను పోలీసుల చేతికి చిక్కడంతో ఆ దిశలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఇప్పటికే వేల సంఖ్యలో అలాంటి కవర్‌లు అడ్ర్‌సలకు చేరి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీడియా సమావేశం సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసిన ఓ కవర్‌ను ఆయన చూపించారు.

యాప్‌ల్లో ఆర్డర్‌... క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు

డ్రగ్స్‌ కొనుగోలు కోసం... డార్క్‌వెబ్‌ వెబ్‌సైట్‌ ద్వారా సాగుతున్న దందాలో ఓ యాప్‌ ద్వారా ఇష్టమైన డ్రగ్స్‌ను ఎంచుకుని ఆర్డర్‌ ఇచ్చే అవకాశముంది. ఇటీవల హైదరాబాద్‌ పోలీసుల విచారణలో భాగంగా డ్రగ్స్‌ వ్యవహారంలో ప్రధాన నిందితుల ఫోన్‌ల ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఏడాదికి పైగా సాగుతున్న దందాలో హరియాణా రాష్ట్రానికి చెందిన నరేంద్ర ఆర్య, గోవాలో సెటిల్‌ అయి డార్క్‌వెబ్‌, సోషల్‌మీడియా ద్వారా దందా సాగించి వందల సంఖ్యలో కస్టమర్ల నుంచి రూ.20లక్షలకు పైగా దందా సాగించాడు. డార్క్‌వెబ్‌, ఇతర హిడెన్‌ యాప్‌లలో రకరకాల పేరుతో ఐడీలు సృష్టించి, వాటిలో వివిధ రకాల డ్రగ్స్‌ గురించి వివరించి వాటి ధరలు ఉంటాయి. ఆర్డర్‌ ఇస్తే డబ్బును క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లించిన తర్వాత కొరియర్‌ ద్వారా పంపిస్తారు. కొరియర్‌ కంపెనీలకు, పార్సిల్‌ ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకూ అనుమానం రాకుండా జాగ్రత్తగా ప్యాక్‌ చేసి పంపిస్తున్నారు. కింగ్‌పిన్‌లు డ్రగ్స్‌ సమకూర్చగా.. సరఫరాదారులు కొరియర్‌, పోస్టు ద్వారా వాటిని డెలివరీ చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T11:58:42+05:30 IST