ధూం..ధాం పెళ్లి..!

ABN , First Publish Date - 2022-12-12T00:57:40+05:30 IST

శుభముహూర్తాలు రావడంతో నగరంలో పెళ్లిసందడి కనిపిస్తోంది.

ధూం..ధాం పెళ్లి..!

మారిన వెడ్డింగ్‌ తీరు

వేడుకల్లో భారీతనం

అంతే భారీగా ఖర్చు

విందుల్లోనూ సంథిగ్‌ స్పెషల్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 11 (ఆంరఽధజ్యోతి):శుభముహూర్తాలు రావడంతో నగరంలో పెళ్లిసందడి కనిపిస్తోంది. కొవిడ్‌ భయాలకు దూరంగా ఈసారి వివాహాలలో భారీతనం అడుగడుగునా కనిపిస్తోంది. నేటితరం వివాహ వేడుకల్లో అట్టహాసం కనిపించాలని కోరుకుంటోంది. అదే సమయంలో ఆ వేడుకలు పర్యావరణ అనుకూలంగా ఉండాలనీ తలపోస్తోంది. ప్లాస్టిక్‌ను వీలైనంతగా వినియోగించకపోవడం, సహజసిద్ధమైన ఉత్పత్తులను వాడేందుకు ఇష్టపడుతున్నారు. మరోపక్క భారీతనానికి మాత్రం ఏ మాత్రం లోటుండకూడదనీ అంటున్నారు.

గతానికి భిన్నంగా తెలుగు వివాహాలలో వేడుకలు పెరిగాయి. పసుపు కొట్టడం, పెళ్లికొడుకు/పెళ్లికూతురును చేయడం, వివాహం, వ్రతం/రిసెప్షన్‌లు గతంలో కనిపించేవి. ప్రస్తుతం 9-10 కార్యక్రమాలు జరుగుతున్నాయి. మధ్య తరగతి కుటుంబమే కట్నకానుకలు, భోజనాలను పక్కన పెట్టి వేడుకల కోసమే రూ. లక్షలు ఖర్చు చేస్తుంటే, ఉన్నత తరగతి వర్గాల వారు రూ. కోట్లను ఖర్చు చేయడం సర్వసాధారణంగా మారిందంటున్నారు వెడ్డింగ్‌ ప్లానర్లు.

కాస్మోపాలిటన్‌ నగరంలో అన్ని ప్రాంతాల సంస్కృతులూ మిళితం చేసుకోవడం అనే సమాధానం వినిపిస్తోంది. ఓ ఈవెంట్‌ మేనేజర్‌ ఇదే విషయమై మాట్లాడుతూ వేడుక ఏదైనా అందరూ భాగం కావాలనుకోవడం ఇప్పుడు కనిపిస్తోందని అన్నారు. పసుపు కొట్టడం అంటే ఒకప్పుడు ముత్తైదువుల హంగామా ఉండేదని, ఇప్పుడు కుర్రాళ్లూ భాగమవుతున్నారని అన్నారు. నిజానికి సంప్రదాయాలకంటే వేడుకలకు ప్రాధాన్యమివడమే దీనికి కారణం అని చెప్పుకొచ్చారు. వాస్తవానికి నగరంలో జరుగుతున్న ఈ వేడుకలను అతి సన్నిహిత బంధువుల నడుమనే జరుగుతున్నా.. వివాహం, రిసెప్షన్‌లకు మాత్రం సకలపరివార సమేతం అన్నట్లుగా బంధువులందరినీ పిలిచి ఘనంగా చేసుకుంటున్నారని చెబుతున్నారు.

నగరంలో ప్రస్తుతం అన్ని ప్రాంతాల సంస్కృతుల సమ్మేళనంగా వివాహ వేడుకలు జరుగుతున్నాయి. హల్దీ, పెళ్లికొడుకు/పెళ్లికూతురుని చేయడం, మెహిందీ, బ్యాచులర్‌ పార్టీ, సంగీత్‌, హోలీ, ప్రీ కాక్‌టైల్‌, నిజామీ నైట్‌, ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌, వెడ్డింగ్‌, రిసెప్షన్‌..ఇలా ఉంటున్నాయి. పక్కా హైదరాబాదీలు నిజామీ నైట్‌ కోరుకుంటున్నారు. మిగిలిన వాటిలో హోలీ, ప్రీ కాక్‌టైల్‌ లాంటివి ఉంటున్నాయని ప్లానర్లు చెబుతున్నారు.

స్వర్గమే దిగివచ్చెనా..?

స్వర్గంలోనే పెళ్లిళ్లు నిర్ణయమవుతాయని నమ్మే మనవాళ్లు ఇప్పుడు ఆ స్వర్గాన్నే భువికి తీసుకువస్తే అన్న ఆలోచనలతో థీమ్‌ మ్యారేజీలకు రూపం ఇస్తున్నారు. ఈ వెడ్డింగ్‌ సీజన్‌లో భారీ హంగూఆర్భాటాలతో వివాహాలు జరుగుతున్నా సన్నిహితులకు విలాస రుచులను పరిచయం చేస్తున్నారు. పెళ్లిళ్లలో కూడా కస్టమైజేషన్‌ ఇప్పుడు తప్పనిసరి అంశంగా మారింది. ఉన్నత మధ్య తరగతి, సంపన్న వర్గాలలో ఈ ధోరణి అధికంగా కనిపిస్తుంటే, మధ్యతరగతి వారు కూడా పోటీపడుతున్నారని అంటున్నారు. వెడ్డింగ్‌ ప్లానర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ థీమ్‌ మ్యారేజీలు నగరంలో సాధారణమయ్యాయని, తమ అభిరుచులకనుగుణంగా థీమ్‌ను ఎంచుకోవడమే కాకుండా, ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌ కూడా ఆ థీమ్స్‌తోనే చేస్తున్నారని, తమ వివాహాన్ని ఓ అందమైన దృశ్యకావ్యంగా మలుచుకుంటున్నారని అన్నారు. కొవిడ్‌ తర్వాత జనాల అభిరుచులు బాగా మారిపోయాయని, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ విస్తృతం కావడం, వెడ్డింగ్‌ థీమ్స్‌లో షోస్‌.. జనాలపై బాగానే ప్రభావం చూపాయంటున్నారు.

Updated Date - 2022-12-12T00:58:29+05:30 IST

Read more