టైర్ల దొంగలు

ABN , First Publish Date - 2022-02-23T15:44:45+05:30 IST

బతుకుదెరువు కో సం టైర్ల పంక్చర్‌ షాప్‌లో పనిచేసే వ్యక్తి ఓ ముఠా ఏర్పాటు చేశాడు. లారీ టైర్ల లోడ్‌తో ఉన్న కంటైనర్ల చోరీకి ప్లాన్‌ చేశాడు. రెండు లోడ్‌లను కూడా చోరీ చేశాడు.

టైర్ల దొంగలు

రెండు కంటైనర్లు చోరీ చేసిన ముఠా

ప్రధాన నిందితుడి సహా ముగ్గురి అరెస్టు


హైదరాబాద్/కొత్తపేట:  బతుకుదెరువు కో సం టైర్ల పంక్చర్‌ షాప్‌లో పనిచేసే వ్యక్తి ఓ ముఠా ఏర్పాటు చేశాడు. లారీ టైర్ల లోడ్‌తో ఉన్న కంటైనర్ల చోరీకి ప్లాన్‌ చేశాడు. రెండు లోడ్‌లను కూడా చోరీ చేశాడు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు ఆ ముఠా ఆటకట్టించారు. ముఠాలోని ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. 152 టైర్లు, కారు, స్కూటర్‌, కత్తి, 4 ఫోన్లు, రూ2 వేలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. మంగళవారం ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో అదనపు డీజీపీ రాచకొండ సీపీ మహే్‌షభగవత్‌ కేసు వివరాలను వెల్లడించారు. 


బతుకుదెరువు కోసం వచ్చి..

హరియాణా మేవట్‌ జిల్లా నౌషీరా గ్రామానికి చెందిన జంషీద్‌ఖాన్‌ అలియాస్‌ జమ్మీ(27) బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడకు వచ్చాడు. టైర్ల పంక్చర్‌ షాపులో నాలుగు నెలలు పనిచేశాడు. అతడికి హైదరాబాద్‌కు చెందిన పాతటైర్ల వ్యాపారులు అఫ్రోజ్‌ అలీ ఖాన్‌(38), సయ్యద్‌బాసిత్‌ హుసేన్‌(42), కమల్‌ కబ్రా(38) పరిచయమయ్యారు. మేవట్‌కు చెందిన రాహిల్‌ఖాన్‌, ఆజాద్‌లతో కలిసి ముఠాగా ఏర్పడి టైర్ల చోరీలకు జమ్మీ పథకం వేశాడు. వీరంతా టైర్ల ఫ్యాక్టరీలు, గోదాముల వద్ద రెక్కీ నిర్వహించేవారు. లోడ్‌ చేసే సమయంలో ముగ్గురూ డ్రైవర్‌, క్లీనర్లతో మాటలు కలిపేవారు. అదును చూసుకుని ఆయుధంతో బెదిరించి కంటైనర్‌ సహా టైర్లను ఎత్తుకెళ్లే వారు. ఇలా ఈ ఏడాది జనవరి 18న అపోలో లారీ టైర్ల లోడ్‌ను, ఫిబ్రవరి 17న ఎంఆర్‌ఎఫ్‌ లారీ టైర్ల లోడ్‌ను చోరీ చేశారు. 


ప్రయాణికుల్లా..

ఫిబ్రవరి 15 రాత్రి 11 గంటలకు తమిళనాడులోని ఎంఆర్‌ఎఫ్‌ ప్లాంట్‌ నుంచి 192 టైర్లను లోడ్‌ చేసుకుని ఓ కంటైనర్‌ బయలుదేరింది. హరియాణా హిస్సార్‌లో గల ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీకి చేర్చాల్సి ఉంది. తిరుచి సమీపంలోని ఓ దాబా వద్ద కంటైనర్‌ ఆపారు. అక్కడ జమ్మీ, రాహిల్‌ఖాన్‌లు తామూ హరియాణాకు వెళ్లాలని ప్రయాణికుల్లా పరిచయం చేసుకుని, అదే కంటైనర్‌లో బయలు దేరారు. ఈ నెల 17న తెల్లవారుజామున 3 గంటలకు నెల్లూరు మీదుగా నల్లగొండ పరిధిలోని తిప్పర్తికి చేరుకోగానే కంటైనర్‌ను రోడ్డు పక్కన ఆపాలని జమ్మీ, రాహిల్‌లు పిస్టల్‌తో డ్రైవర్‌ను బెదిరించారు. వాహనం ఆపాక డ్రైవర్‌, ఇద్దరు క్లీనర్ల కళ్లకు గంతలు కట్టి, చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేశారు. టైర్ల లోడ్‌తో ఉన్న కంటైనర్‌ను కాటేదాన్‌లోని గోదాంకు చేర్చారు. అన్‌లోడ్‌ చేశారు. ఖాళీ కంటైనర్‌ను, డ్రైవర్‌, క్లీనర్లనూ తుక్కుగూడ టోల్‌గేట్‌ సమీపంలో వదిలి కారులో, స్కూటీల్లో పరారయ్యారు. 17న ఉదయం 10 గంటల సమయంలో దారిన వెళ్లే వారు గుర్తించి డ్రైవర్‌, క్లీనర్లకు కట్టిన తాళ్లను విప్పారు. లారీ డ్రైవర్‌ 100కు కాల్‌ చేసి ఫిర్యాదు చేశారు. 


విమాన ప్రయాణికుల్లో నిందితుడు

రంగంలోకి దిగిన పహాడీషరీఫ్‌ పోలీసులు, ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తూ దర్యా ప్తు చేపట్టారు. తమిళనాడు పోలీసుల సహకారాన్ని కూడా తీసుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 18నరాత్రి ఢిల్లీ వెళ్లే స్పైస్‌జెట్‌ ప్రయాణికుల్లో జమ్మీ పేరును గుర్తించి అక్కడి డీసీపీని సంప్రదించారు. ఆయన సహకారంతో విమానాశ్రయ పోలీసులు మరుసటి రోజు జమ్మీని అదుపులోకి తీసుకుని రాచకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఢిల్లీ వెళ్లి అతడిని నగరానికి తీసుకొచ్చారు. జమ్మీ ఇచ్చిన సమాచారం ఆధారంగా అఫ్రోజ్‌అలీఖాన్‌, సయ్యద్‌ బాసిత్‌ హుస్సేన్‌లనూ అరెస్టు చేశారు. 


టైర్ల వ్యాపారి కమల్‌ కబ్రాను విచారిస్తున్నారు. రాహిల్‌ ఖాన్‌, ఆజాద్‌లు పరారీలో ఉన్నారు. విచారణలో జమ్మీ తన నేరాలను అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో కాటేదాన్‌ వద్ద నిందితులు వదిలిపెట్టిన 8 ఎంఎం ఒక లైవ్‌ రౌండ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్‌, యాదగగిరి, ఏడీసీపీ ఎం.శ్రీనివాసులు, సీసీఎస్‌ ఎల్‌బీనగర్‌ టీం, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి, పహాడీషరీఫ్‌ ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, డీఐ కాశీవిశ్వనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-02-23T15:44:45+05:30 IST