బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితుడి మృతి

ABN , First Publish Date - 2022-11-05T05:36:09+05:30 IST

బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భూమి కోల్పోయిన నిర్వాసితుడు పరిహారం,

బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితుడి మృతి

పునరావాసం కోసం నాలుగు రోజులుగా దీక్ష

తాజాగా గుండెపోటు, కన్నుమూత

మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా

యాదగిరిగుట్ట రూరల్‌, నవంబరు 4: బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భూమి కోల్పోయిన నిర్వాసితుడు పరిహారం, పునరావాసం కోసం నాలుగు రోజులుగా దీక్ష చేస్తూనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి, యాదగిరిగుట్ట మండలాల పరిధిలో మూడు కిలోమీటర్ల మేర బస్వాపూర్‌ రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మించనుండగా బీ.ఎన్‌.తిమ్మాపురం, లప్పానాయక్‌ తండా గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి 2013లో భూసేకరణ ప్రారంభంకాగా, 2018లో ప్రభుత్వం నిర్వాసితుల జాబితాను విడుదల చేసింది. యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్‌ తండా నిర్వాసితుడు ధీరావత్‌ జామ్ల నాయక్‌(58)కు చెందిన ఏడెకరాల భూమి మొత్తం రిజర్వాయర్‌ కింద పోయింది. ఇందులో నాలుగు ఎకరాలకు ఎకరాకు రూ.18లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించగా, మిగిలిన మూడు ఎకరాలకు పరిహారం రావాల్సి ఉంది.

లప్పానాయక్‌ తండాకు చెందిన మరో 250 కుటుంబాలు కూడా ఇదే తరహాలో తమ భూములను కోల్పోయాయి. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పిస్తామని అధికారులు ఏడాదిగా చెబుతున్నా ఎంతకూ పట్టించుకోవడం లేదు. దీంతో గత నెల 30 నుంచి బస్వాపురం రిజర్వాయర్‌కట్టపై 100మంది లప్పానాయక్‌తండా నిర్వాసితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులుగా దీక్షలో పాల్గొంటున్న ధీరావత్‌ తనకు ఇక పరిహారం రాదేమోనని గత కొన్ని రోజులుగా ఆందోళనకు లోనవుతున్నాడు. ఈక్రమంలోనే శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని రిజర్వాయర్‌ కట్టపై ఉంచిన కుటుంబ సభ్యులు, నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని ఉదయం 10 గంటలకు ధర్నాకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న యాదగిరిగుట్ట పోలీసులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు తమ ఆందోళనను విరమించి ధీరావత్‌ మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Updated Date - 2022-11-05T05:36:10+05:30 IST