ఇంజనీర్ల వేతనాల్లో కోత..!

ABN , First Publish Date - 2022-06-29T16:51:32+05:30 IST

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఇంజనీరింగ్‌ అధికారులపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝళిపించింది. ప్రజల ప్రాణ రక్షణకు సంబంధించిన పనులను

ఇంజనీర్ల వేతనాల్లో కోత..!

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నందుకే..

ఆకస్మిక తనిఖీల్లో గుర్తింపు

38 మందిపై చర్యలకు ఉపక్రమించిన జీహెచ్‌ఎంసీ


హైదరాబాద్‌ సిటీ: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఇంజనీరింగ్‌ అధికారులపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝళిపించింది. ప్రజల ప్రాణ రక్షణకు సంబంధించిన పనులను పలుమార్లు సూచించినా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయనందుకు చర్యలకు ఉపక్రమించింది. నాలాలు ప్రమాదకరంగా ఉన్న చోట రక్షణా చర్యలు చేపట్టాలని సూచించిన ఉన్నతాధికారులు.. ఉదాసీనంగా ఉంటే చర్యలు తప్పవన్న హెచ్చరికలను నిజం చేసి చూపించారు. అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ (డీఈఈ), ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌(ఈఈ) స్థాయి అధికారులు 38మందికి ఒకరోజు వేతనంలో కోత విధించారు. ఈ మేరకు కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్‌ నెల వేతనాల చెల్లింపులో ఒకరోజు వేతనం మినహాయించాలని డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ అధికారులను ఆదేశించారు. అప్పగించిన పనుల్లో అశ్రద్ధగా ఉండొద్దని హెచ్చరిస్తూ పునరావృతమైన పక్షంలో మరోసారి నోటీసులివ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


ఆదేశాలు బేఖాతరు

 ఉన్నత స్థాయి ఆదేశాలను సర్కిల్‌, డివిజన్‌ స్థాయి ఇంజనీరింగ్‌ అధికారులు ఖాతరు చేయలేదు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, లోకే్‌షకుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి రక్షణా ఏర్పాట్లు చేయని విషయాన్ని గుర్తించారు. దీనిపై సీరియస్‌ అయిన అర్వింద్‌కుమార్‌.. పై అధికారుల ఆదేశాలు ఎందుకు పట్టించుకోలేదో వివరణ కోరుతూ బాధ్యులందరికీ షోకాజ్‌ నోటీసులివ్వాలని ఆదేశించారు. దీంతో 40 మందికిపైగా ఇంజనీర్లకు కేంద్ర కార్యాలయం నుంచి షోకాజ్‌ నోటీసులు అందాయి. అనంతరం సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లో రక్షణా ఏర్పాట్లకు సంబంధించి ఫొటోలతో సహా వివరణ పంపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు 38 మంది ఇంజనీర్లకు ఒకరోజు వేతనం కోత విధించాలని నిర్ణయించారు.  


రక్షణా చర్యలకు ఆదేశాలు..

నాలాలు, ఓపెన్‌ డ్రైన్లలో ప్రమాదవశాత్తు పడి పౌరులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రతి యేటా జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలేంటనేది వివరిస్తూ చెక్‌లిస్టు సర్కిళ్లకు పంపారు. జూన్‌ 5వ తేదీ వరకు ఏర్పాట్లు చేయాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2022-06-29T16:51:32+05:30 IST